ప్రజాపాలనలో కుటుంబాలన్ని దరఖాస్తులు చేసుకోవాలి

– ప్రజాపాలన సన్నాహ సమావేశంలో ఎంపీడీఓ రాము సూచన
– అధికారులందరూ నిబద్ధతతో పనిచేయాలని హెచ్చరిక
– జనవరి 6 తర్వాత ఎలాంటి దరఖాస్తులు స్వీకరించబడవని వెల్లడి
నవతెలంగాణ-బెజ్జంకి 
ప్రజాపాలన కార్యక్రమంలో సంక్షేమ పథకాల కోసం ధ్రువ పత్రాలు లేకున్నా ఆధార్ కార్డ్ నంబర్ తో ప్రజలందరూ దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీఓ దమ్మని రాము సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ సమావేశ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖ అధికారులతో ఎంపీడీఓ సన్నాహ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడారు.కుటుంబంలోని మహిళా అభ్యర్థులే యజమానులుగా దరఖాస్తులు పూరించాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలను అమలు చేయడమే ధ్యేయంగా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని విధుల్లో అలసత్వం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. ప్రజా పాలన సజావుగా జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మండలంలోని ప్రజాప్రతినిధులు సహకరించాలని తెలిపారు. ఉదయం 8 గం. నుండి సాయంత్రం 6 గం. వరకు అయా గ్రామాల్లోని గ్రామ పంచాయతీల వద్ద దరఖాస్తులు స్వీకరించబడుతాయని జనవరి 6 తర్వాత ఎలాంటి దరఖాస్తులు స్వీకరించబడమని వెల్లడించారు.ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజాపాలన కార్యక్రమం సజావుగా సాగేల పోలీసులు భాగస్వాములవుతారని ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని ఎస్ఐ నరేందర్ రెడ్డి సూచించారు. ఎంపీపీ లింగాల నిర్మల,జెడ్పీటీసీ కనగండ్ల కవిత,ఏఎంసీ చైర్మన్ కచ్చు చంద్రకళ,సర్పంచ్ ద్యావనపల్లి మంజుల, ఎంపీటీసీలు గుభిరే శారద, మహేందర్ రెడ్డి, తహసిల్దార్ శ్యామ్, అయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అయా శాఖల అధికారులు హజరయ్యారు.
సమావేశంలో ప్రజా ప్రతినిధుల సందేహాలు..!
బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవనం సాగిస్తున్నారని పలు సందర్భాల్లో ప్రజా ప్రతినిధులు వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పరిపాలనలో భాగస్వాములైన ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన సన్నాహా సమావేశంలో ప్రజాపాలన దరఖాస్తులో పూరించే వివరాలపై పలు సందేహాలను లేవనెత్తి ఎంపీడీఓ వద్ద నివృత్తి చేసుకోవడం ఆశ్చర్యం.