అఖిల భారత విద్యార్థుల సదస్సు ఆహ్వానం

Bharath Bachavoనవతెలంగాణ-హైదరాబాద్:బాగులింగంపల్లి
– ఫాసిజాన్ని ఓడిద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, లౌకికవాదాన్ని రక్షించుకుందాం
అనే నినాదం తో అఖిల భారత విద్యార్థుల సదస్సు 25, ఫిబ్రవరి, 2024: ఉదయం 10.00 గం. లనుండి రాత్రి 09.00 గం. ల వరకు 26, ఫిబ్రవరి, 2024: ఉదయం 10.00 గం.ల నుండి సాయంత్రం 06.00 గం. ల వరకు  సుందరయ్య విజ్ఞాన వేదిక, బాగ్ లింగం పల్లి, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది అని నిర్వాహకులు పత్రిక ప్రకటన విడుదల చేసారు
భారత స్వాతంత్ర్యోద్యమ లక్ష్యాల, ఆశయాల సాధనలో;
అ. జాతీయ విద్యావిధానం (NEP- 2020) ను రద్దు చేయాలి.
ఆ. ఫీజుల పెంపును వ్యతిరేకిద్దాం
ఇ. ఉమ్మడి, శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలి.
ఈ. విశ్వవిద్యాలయాలలో బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయాలి
ఉ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి. ఊ. విద్యాలయాలన్నింటిలో లింగ, సామాజిక న్యాయాన్ని అమలు చేయాలి
ఋ. స్కాలర్షిప్ల, ఫెలోషిప్ల పునరుద్ధరణ, పెంపులను అమలు చేయాలి.
ౠ. కాంపస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి
లు. ఫాసిజాన్ని ఓడిద్దాం

ప్రియ మిత్రులారా…
భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర భగత్ సింగ్, రాజగురు, సుఖ్ దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, అశ్ఫఖుల్లా ఖాన్, అల్లూరి సీతారామ రాజులతో పాటు విద్యార్థులు, యువత, కమ్యూనిస్టులు, కాంగ్రేసు, ఇంకా అనేక మంది దేశభక్తుల అనన్య త్యాగాల కారణంగానే ఎరుపెక్కినదని మనందరికీ తెలుసు. విద్యార్థులే నవభారత నిర్మాతలు కూడా.
అఖిల భారత విద్యార్థుల సదస్సు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల నందరినీ ఒక్కతాటి మీదకు తీసుకురావడం ద్వారా ప్రస్తుత బి. జె.పి. – ఆర్.ఎస్.ఎస్. ల మనువాద. బ్రాహ్మణీయ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ఒక ఐక్యవేదికను నిర్మించేందుకు సంకల్పించింది. దేశంలో గరిష్ట స్థాయికి చేరుకున్న నిరుద్యోగం నుండి మొదలుకుని విద్యారంగ ప్రైవేటీకరణ, అసమానతలు, ప్రశ్నిస్తున్న విద్యార్థుల గొంతునొక్కడం వరకూ… దేశానికి వెన్నెముకలయిన యువకుల నడ్డి విరిచేందుకు ఈ ప్రభుత్వం చేయని ప్రయత్నమూ, దుర్మార్గాలు లేవంటే అతిశయోక్తి కాదు.
విద్యార్థుల సంఘటిత శక్తి ఎంతటి బలీయమైనదో తెలిసిన బి.జే.పి. ప్రభుత్వం, అధికారంలోకి వచ్చీ రాగానే ఫీజులను విపరీతంగా పెంచి, వారికి నాణ్యమైన విద్యను దూరం చేయడంతో పాటు, విద్యావ్యవస్థనే సమూలంగా నాశనం చేసే ఉద్దేశ్యంతోనే, జాతీయ విద్యావిధానం – 2020 ( NEP-2020) ను తీసుకు వచ్చింది. ఈ విధానం, ప్రభుత్వాన్ని సంక్షేమరాజ్య బాధ్యతలనుండి తప్పించడమే కాకుండా వ్యాపార కేంద్రాలుగా మారిన ప్రైవేటు, విదేశీ విశ్వవిద్యాలయాలు లాభాల దాహాన్ని తీర్చేందుకు కూడా దోహదపడుతుంది.
విద్యా విధానాన్ని మరింతగా భ్రష్టు పట్టించేందుకు, ఉన్నత విద్యలో 40 శాతం ఆన్లైన్ పద్దతిలో బోధించే మిశ్రమ విద్యా విధానానికి యు.జి.సి. శ్రీకారం చుట్టింది. విద్యార్థులతో ఉపాధ్యాయులకు ప్రత్యక్ష సంబంధం ఉండని కారణంగా, ప్రభుత్వ విద్యతో, అంతోఇంతో సామాజిక అభివృద్ధిని సాధించిన అట్టడుగు వర్గాలు మళ్ళీ తమ మునుపటి స్థితికి దిగజారుతాయి. ప్రత్యేక సదుపాయాలు కలిగిన సామాజిక నేపథ్యం నుండి రాని కారణంగా, ఆ వర్గాలు తమ భవిష్యత్తు గురించి అలోచించే అవకాశాన్ని కోల్పోతాయి. అట్టడుగు వర్గాల ప్రజలకు విద్యాహక్కును నిరాకరించేందుకు జాతీయ విద్యావిధానం – 2020 ఒక మాత్రమే.
బాధ్యతలే తప్ప హక్కుల ఊసే సహించని నేటి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా, పూర్తిగా కేంద్రం నియంత్రణలో జరిగే ప్రవేశ పరీక్షల ద్వారా విశ్వవిద్యాలయాల్లో ఒక తరహా విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే ఆర్.ఎస్.ఎస్. సిద్ధాంతకర్తలతో నింపివేయబడిన ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పాలనా యంత్రాంగాలు, జాతీయ విద్యావిధానం-2020 నెపంతో, తమ స్వంత నిధులను పెంచుకొని, మరింత స్వతంత్రంగా వ్యవహరించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది.
విద్య కాషాయీకరణ :
ప్రస్తుత పాలకుల కారణంగా దేశ విద్యారంగానికి కలుగుతున్న వెనుప్రమాదం విద్య కాషాయీకరణ. అశాస్త్రీయ పాఠ్యాంశాల బోధన,డార్విన్ జీవ పరిణామ పాఠ్యాంశాన్ని తొలగించడం, అభూత, పౌరాణిక దృక్కోణాలతో చరిత్రను తిరగరాయడం లాంటివన్నీ విద్య కాషాయీకరణలో భాగమే. ఆర్.ఎస్.ఎస్. సైద్ధాంతిక ప్రచారానికి, ఎన్.సి.ఆర్.టి.ని తమ ప్రచార సాధనంగా మార్చుకుంటున్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో, ప్రజాస్వామిక వాతావరణాన్ని కలుషితం చేయడం ద్వారా స్వతంత్ర విద్యా సముపార్జనకు అవకాశమే లేకుండా చేస్తున్నారు. సకల సంస్థలనన్నింటినీ నాశనం చేయడం, విద్వేష మనస్థత్వం కలిగిన సంఘ్ పరివార్ కార్యకర్తలను తయారు చేసుకోవడమే నేటి పాలకుల లక్ష్యంగా ఉంది.

స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి రాజ్యాంగ విలువలను మరచి, నిరంతరం విద్వేషాలను వెదజల్లడం. మనుషులను ఒకరిపై మరొకరిని ఉసిగొల్పడం, మత కల్లోలాలను రెచ్చగొట్టడంల వలన దేశ సామాజిక సంతులనం చెదిరిపోతుంది. దళితులు, ముస్లింలపై అత్యాచారాలను సాధారణీకరించడం, పార్లమెంటరీ విలువలను, న్యాయ వ్యవస్థను అవహాస్యం చేస్తూ, సర్వశక్తివంతుడయిన నాయకుని నేతృత్వంలో నేటి దేశ పాలనావ్యవస్థ ఫానీజం వైపుగా పరుగులు తీస్తుంది.
ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించడం ద్వారా బలహీన వర్గాల, కులాల విద్యార్థులు అనేక ఆటంకాలను అధిగమించి అక్కడికి వచ్చినా, లక్షలాది రూపాయల విద్యారుణాలను తీర్చేందుకు సంవత్సరాల తరబడి వెట్టిచాకిరీ చేయక తప్పని స్థితి కల్పిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు సామాజిక మార్పు కొరకు పనిచేసే విద్యార్థి ఉద్యమాలను కూడా అడ్డుకుంటున్నాయి.
రాజ్యాంగబద్ధంగా లభించ వలసిన రిజర్వేషన్లను, ఉద్యోగావకాశాలను అడ్డుకోవడం ద్వారా అట్టడుగు కులాల, వర్గాల భవిష్యత్తును చావుదెబ్బ తీసే కుట్రలో భాగంగానే ” రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం, అర్హులయిన అభ్యర్థులు లభించడం లేద’నే వాదనలు చేస్తున్నారు. వేలాది మంది విద్యార్థులు పరిశోధనకు దరఖాస్తు చేసుకుంటున్నా. 98 శాతం కులీనులతో నిండి న దేశంలోని ప్రముఖ అయిదు ఐ.ఐ.ఎం.,ఐ.ఐ.టి.లలో దళిత విద్యార్థుల ప్రాతినిధ్యం 2 శాతం తగ్గడం గమనార్హం. మొన్నటికిమొన్న. ప్రగతిశీలవాదులు, విద్యార్థులు సంఘటితంగా ఉద్యమించడం వలన వెనక్కి తీసుకున్న ” డీ రిజర్వేషన్” డ్రాఫ్టు అంశాన్ని గమనిస్తే, అట్టడుగు వర్గాలు కలిసికట్టుగా ఉద్యమించక పోతే. భవిష్యత్తులో ఎంతటి అణచివేతకు గురవుతారో ఒక హెచ్చరికగా అర్థం చేసుకోవాలి.
ప్రస్తుత ప్రభుత్వం, తమ స్నేహితుల ఖజానాను సంపదతో నింపివేసి శతకోటీశ్వరులనుండి, రాత్రికిరాత్రే. వారిని ప్రపంచ ధనవంతులలో ఒకరిని చేయడం ద్వారా భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అనమానతలు కలిగిన దేశంగా మారిపోయింది. దేశంలోని 5% సంపన్నుల వద్ద 60% పైగా దేశసంపద పోగుపడగా 50% శాతం అట్టడుగు ప్రజానీకం కేవలం 3% శాతమే ఉన్న దుర్భర పరిస్థితులో కొత్త కార్మిక చట్టాలను ఈ ప్రభుత్వం తీసుకు రావడంతో అసమానతలను పెంచిపోషించడమే నేటి ప్రభుత్వ విధానం అని స్పష్టం అవుతుంది.
నిరుద్యోగం, అనిశ్చిత భవిష్యత్తు ; దేశ యువత విద్యా ప్రమాణాల క్షీణతనే కాకుండా అత్యధిక నిరుద్యోగ సంక్షోభాన్ని సైతం ఎదుర్కొంటుంది. భారతీయ రైల్వే నాన్-టెక్నికల్ విభాగంలో ప్రకటించిన35,000ల దిగువస్థాయి ఉద్యోగాలకు 12,50,000ల మంది నిరుద్యోగులు అప్లయి చేసుకోవడం దానికి అద్దం పడుతుంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం దేశంలో ప్రతీ పదిమందిలో ఒకరు నిరుద్యోగులుగా ఉన్నారు. కేంద్రప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా పడిఉన్న లక్షలాది ఉద్యోగాల భర్తీ చేయకపోగా, ఆర్.ఆర్.బి., అవినీతిపై, దేశ రక్షణరంగంలో కాంట్రాక్ట్ పద్దతిలో, కొత్తగా ప్రవేశపెట్టిన ‘ అగ్నివీర్ పథకం’ వ్యతిరేక ఉద్యమంపై, నిరుద్యోగంపై గొంతు విప్పే ఏ చిన్న నిరసన ఉద్యమాన్నైనా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయడమే ధ్యేయంగా పెట్టుకుంది. అటువంటి దిక్కుతోచని స్థితిలోనే యవతరం దేశ పార్లమెంట్, భగత్ సింగ్ స్పూర్తితో,తమ నిరసనను వ్యక్తం చేసేందుకు పొగడబ్బాలను ప్రయోగించింది. ప్రభుత్వం వారి ఆ ఆవేదనను అర్థం చేసుకోకుండా దానిని ‘విద్రోహ చర్యగా పేర్కొంటూ, వారిపై “చట్టవ్యతిరేక చర్యల నిరోధక చట్టం – ఊపా” ను ప్రయోగించడంతో పాటు చిత్రహింసలకు పాల్పడింది. కాంట్రాక్టీకరణ ఒక మహమ్మారిలా దేశ యువశక్తిని పట్టి పీడిస్తుంటే, కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కార్మిక చట్టాలు సంఘాలు పెట్టుకునే, సమ్మె చేసే హక్కులను నిరాకరిస్తూ కార్మికుల మనుగడను మరింత దుర్లభంగా మారుస్తున్నాయి. రైతులు తమ వీరోచిత పోరాటాల కారణంగా కేంద్రప్రభుత్వం వెనక్కు తీసుకున్న మూడు రైతు చట్టాలు సైతం, వ్యవసాయ రంగం పగ్గాలను కార్పోరేటు కబంథ హస్తాలకి అప్పగించేందుకు ఉద్దేశించబడినదే.
మితృలారా ! నేడు మనందరం చారిత్రక సంధి కాలంలో ఉన్నాము. మనం ఇప్పటి వరకు ఒక అద్భుతమైన భారతదేశంలో నివసిస్తున్నామని అనుకోకపోయినా, స్వాతంత్రోద్యమ ఆకాంక్షలు, హామీల నేపథ్యంలో కొద్దోగొప్పో ప్రజాస్వామిక విలువలు, వెసులుబాట్లు కలిగాయి. వాటిని కూడా ప్రస్తుత కేంద్రప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ధ్వంసం చేస్తున్నది. ఈ కార్పోరేట్ అనుకూల ఫాసిస్టు శక్తులను సంఘటితంగా ఎదుర్కొనకపోతే, భారత రాజ్యాంగం ద్వారా లభించిన ఆ కొద్దిపాటి ప్రజాస్వామిక పద్దతుల్లో నిరసనను తెలిపే హక్కును సైతం కోల్పోయే ప్రమాదం ఉన్నది.
అందుకే, మనందరం మరోసారి నాటి స్వాతంత్ర్యోద్యమ కాలంలో మన ముందుతరం నాయకత్వం నినదించిన ‘ సామాజిక, రాజకీయ, ఆర్ధిక రంగాలలో స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం లాంటి విలువలను పునరుద్ఘాటించ వలసిన చారిత్రక సందర్భం ఇది. మనమధ్య నుండే చిన్న చిన్న విభేదాలను అధిగమించి, ఒక్కటిగా పోరాడడం ద్వారానే ఈ మనువాద, బ్రాహ్మణీయ, కార్పోరేట్, ఫాసిస్టు బి.జె.పి. ఆర్.ఎస్.ఎస్ పరివార మూకలను ఎదుర్కొని, విద్యా, ఉద్యోగ అవకాశాలను కాపాడుకో గలుగతాము. ఆ క్రమంలోనే 2024, ఫిబ్రవరి 25, 26 తేదీలలో, రెండు రోజులపాటు జరిగే అఖిల భారత విద్యార్థుల సదస్సులో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.

జాతీయ విద్యా విధానం-2020 కుట్ర :
1. ప్రాధమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకూ మొత్తం విద్యా వ్యవస్థనే కాషాయీకరణ, ప్రైవేటీకరణ, వ్యాపారీకరణగా మార్చివేయడం.
2. 5+3+3+4 విధానాన్ని ప్రవేశపెట్టడం వలన వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు గురిచేయడం.
3. విశ్వవిద్యాలయాలలో అశాస్త్రీయమైన జ్యోతిష్యం, హస్తసాముద్రికం, సంఖ్యా శాస్త్రాలను ప్రవేశ పెట్టడం వలన విద్యార్థులలో మూఢనమ్మకాలు పెంపొందడం.
4. అర్ధాంతరంగా ఎన్.సి.ఆర్.టి సిలబస్ను మార్చి, డార్విన్ జీవపరిణామ క్రమాన్ని, గాంధీ, టిప్పుసుల్తాన్ ల చరిత్రలను తొలగించడం వలన విద్యార్థులు చారిత్రక జ్ఞానాన్ని కోల్పోయి గందరగోళానికి గురవుతారు.
5. దశాబ్దాల తరబడి విశ్వ విద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకుండాబలహీన పరచడమే కాక వాటినే లేకుండా చేసే కుట్ర.

ఆర్గనైజింగ్ కమిటీ:
అఖిల భారత విశ్వవిద్యాలయాల విద్యార్థులు
ప్రచురణకర్తలు: ప్రొ. మనోరంజన్ మహంతి, డా. ఎం.ఎఫ్. గోపీనాథ్, గాదె ఇన్నయ్య, జంజర్ల రమేష్ బాబు
ఫోన్ నంబర్లు: 79955 31919, 81859 93218, 99484 10798