భూ యాజమాన్యాన్నీ గుర్తించాలి

– కుల గణనలో దీనినీ చేర్చాలి
– నిపుణులు, విశ్లేషకుల సూచన
న్యూఢిల్లీ: భారత్‌లో కుల గణన డిమాండ్‌ ప్రజాదరణ పొందుతున్నది. గతేడాది అక్టోబరులో బీహార్‌ జనాభా లెక్కలను ప్రచురించిన తర్వాత దాని డిమాండ్‌ మరింత పెరి గింది.ముఖ్యంగా, కేంద్రంలోని మోడీ సర్కారుపై దీని ఒత్తిడి పడింది. కుల గణన దేశవ్యాప్తంగా జరపాలనే డిమాండ్‌ దేశంలోని అనేక వర్గాల నుంచి వచ్చింది. అయితే, మోడీ సర్కారు కులగణనపై మౌనమే సమాధానంగా ఉంటున్నది. బీహార్‌ కుల గణన తర్వాత కర్నాటకలోనూ అలాంటి డిమాండ్‌లే వచ్చాయి. ఏపీ కుల గణనను ప్రారంభించింది. కేరళ, తమిళనాడు, యూపీ, పశ్చిమ బెంగాల్‌లో ఇదే విధమైన కసరత్తు చేయాలనే పిలుపులు పెరుగుతున్నాయి. భారత్‌లో 2024 సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కుల గణన అంతగా అవసరం లేదనే వాదనలకు సమాధానంగా…పేదరికం, నిరుద్యోగం, వనరుల పంపిణీ సంబంధిత సమస్యలు తెరపైకి వచ్చినప్పుడు ఎన్నికల తర్వాత దాని ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటివరకు కుల గణన చర్చల్లో ఎక్కువగా కుల సంఘాల జనాభాను నిర్ధారించటం, జాతి పేర్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంపై దృష్టి ఉండేది. అదే సమయంలో, కులాల వారీగా భూ యాజమాన్యాన్ని కొలిచే కసరత్తుపై సమాన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. కుల గణనలు భారత్‌లో అధికారం ‘భూమిలో’ ఎలా చిక్కుకుపోయిందో కీలకమైన నమూనాలను వెల్లడిస్తుందనీ, మరీ ముఖ్యంగా, కుల గణనతో భూసంస్కరణలను మళ్లీ రాజకీయ అజెండాలకు చేర్చే అవకాశం ఉన్నదని చెప్తున్నారు.
భూ యాజమాన్యం ఎందుకు?
భారత్‌లో సామాజిక, రాజకీయ శక్తికి భూమి కీలక మైన మూలం. భూమి ఆహారం, జీవనోపాధికి మూలం. అలాగే, ఆస్తి, స్థిరత్వం వంటి అంశాలూ ఇందులో మిళితమై ఉంటాయి. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ నిర్వహించిన ఆలిండియా డెట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వే నుంచి అందు బాటులో ఉన్న తాజా డేటా ప్రకారం.. భారతీయులకు భూమి అత్యంత ముఖ్యమైన ఆస్తిగా ఉన్నది. 2019లో గ్రామీణ భారత్‌లో మొత్తం ఆస్తి విలువలో 69 శాతం, పట్టణ భారత్‌లో 49 శాతంగా ఉన్నది. 2020-2021లో జరిగిన రైతు నిరసనల నుంచి భూమికి ఇచ్చిన విలువ స్పష్టంగా తెలుస్తున్నదనీ, భారతీ యులు ఇప్పటికీ భూమితో ఎంత దృఢంగా అనుబంధం కలిగి ఉన్నారో వారు సూచిస్తున్నారని విశ్లేషకులు చెప్తు న్నారు. అదే సమయంలో, భూమి యాజమాన్యం కులం ద్వారా చాలా వక్రీకరించబడిందని అంటున్నారు. ఉదా హరణకు, దేశంలోని 18 శాతం కుటుంబాలను కలిగి ఉన్న షెడ్యూల్డ్‌ కులాల సభ్యులు భారత్‌లో 8.5 శాతం భూమిని మాత్రమే కలిగి ఉన్నారని కొన్ని గణాంకాలు సూచిస్తు న్నాయి. మరోవైపు, 22 శాతం ఉన్న అగ్రవర్ణ హిందూ కుటుంబాలు 28 శాతం భూమిని కలిగి ఉన్నాయి. అయినప్పటికీ, భూమి యాజమాన్యం గురించిన సమాచా రం అస్పష్టంగా ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. సామా జిక-ఆర్థిక కులగణన 2011 కుల-విభజన డేటాను ప్రజ లకు అందుబాటులో ఉంచలేదని విశ్లేషకులు చెపుతున్నారు. ఈ విషయంలో స్పష్టమైన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించాలని వారు అంటున్నారు.