
– వ్యవసాయ కార్మిక సంఘాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి..
– వ్యవసాయ కార్మిక , ప్రజా సంఘాల డిమాండ్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
భూమిలేని వ్యవసాయ కార్మికులందరికీ రూ.12 వేల వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (ఎం సిపిఐ యు) రాష్ట్ర అధ్యక్షులు వరికుప్పల వెంకన్న, పిడిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం అర్హులైన పేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన ఏడాదికి 12,000 హార్దిక సహాయం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూభూమిలేని వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ జాబ్ కార్డు ద్వారా 100 రోజులు పని పోందిన కుటుంబాల ఆధార కార్డు, పట్టాదారు పాస్ బుక్ ఆధారంగా రూ.12 వేల పథకానికి ఎంపిక చేయబోతున్నట్టుగా వార్తలోస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. లబ్ధిదారులను కుదించేందుకు కుట్ర జరుగుతుందన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. గ్రామ సభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.
తక్షణమే విధివిధానాల రూపకల్పనకు వ్యవసాయ కార్మిక సంఘాలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. జాబ్ కార్డు కలిగిన వారితోపాటు వలస కార్మికులను, కూలి పని చేసుకుని బతికే పేదలందరినీ అర్హులుగా ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కొత్తగా జాబ్ కార్డులిచ్చి పనిదినాలు కల్పించాలని కోరిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులలో జాబ్ కార్డు పేరుతో ఆన్లైన్ పేరుతో 12 వేల రూపాయల పథకాన్ని కుదించి లబ్ధిదారులను తగ్గించాలని చూస్తున్నారని అన్నారు. ఇలాంటి విధానాలు ప్రభుత్వం విరమించుకొని గ్రామ గ్రామాన భూమిలేని పేదలను గుర్తించాలని, ఐదు పది గుంటలు భూమి ఉన్న పేదలను కూడా ఈ పథకానికి అర్హులుగా తీసుకోవాలని, ప్రభుత్వము ఎకరం లోపు భూమి ఇచ్చి ఆ భూమిలో పంట పండడానికి అవకాశం లేకుంటే వారికికూడా 12 వేల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రేషన్ కార్డు లేని వారికి వెంటనే రేషన్ కార్డు ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ళను అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఏమాత్రం సరిపోవు అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డికి సమర్పించారు. ఎం సిపిఐ యూ జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ ,డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాసాని కిషోర్, బోయిల్ల నవీన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సోమపంగా జానయ్య, ఆరే రామకృష్ణారెడ్డి, నల్ల మేకల అంజయ్య, జంపాల స్వరాజ్యం, నాయకులు కేశగాని భద్రయ్య, వెలుగు మధు తదితరులు పాల్గొన్నారు.