– మొత్తాన్ని ఇతర లోన్లకు జమ చేయకూడదు
– వారం పాటు రుణాల రెన్యువల్ డ్రైవ్
– సమస్యల నివృత్తికి 7288800023 ఏర్పాటు
– కలెక్టర్ నారాయణ రెడ్డి
– 15811.91 కోట్లతో 2024- 25 వార్షిక రుణ ప్రణాళిక విడుదల
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
సోమవారం నాటికి లక్ష రూపాయల లోపు పంట రుణాలు పొందిన రైతులందరి రుణమాఫీ మొత్తం వారి ఖాతాలలో జమ చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి బ్యాంకర్లతో కోరారు. గురువారం ఆయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీకి సంబంధించి ఈనెల 15న జీవో జారీ చేయడం జరిగిందని, 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలు పొందిన రైతుల రుణాలు మాఫీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఇందులో భాగంగా ముందుగా గురు, శుక్రవారాలలో లక్ష రూపాయల వరకు రుణాలు ఉన్న రైతుల ఖాతాలలో పంట రుణమాఫీ మొత్తం జమ చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నదని తెలిపారు. అందువల్ల బ్యాంకర్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సోమవారంలోపు లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకొన్న రైతులందరి రుణాలను మాఫీ చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ మొత్తాన్ని ఇతర లోన్లకు జమ చేయకూడదని ఆయన అన్నారు. అలాగే రుణమాఫీకి సంబంధించి ఏదైనా సాంకేతిక సమస్యలతో రైతులు బ్యాంకులకు వచ్చినప్పుడు వారికి సహాయం చేయాలని, ఇందుకుగాను అన్ని బ్యాంకులలో నోడల్ అధికారులను నియమించాలని చెప్పారు. సోమవారం నాటికి లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేయడంతో పాటు, రుణమాఫీ పొందిన రైతులందరికీ తిరిగి బ్యాంకు రుణాలను రెన్యువల్ చేయాలని ఆదేశించారు. వచ్చే సోమవారం నుండి వారం రోజులపాటు రుణాల రెన్యువల్ డ్రైవ్ నిర్వహించాల్సిందిగా ఆయన ఆదేశించారు.పంట రుణమాఫీ కి సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకుగాను జిల్లా స్థాయిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్ 7288800023 కు ఫోన్ చేసి తెలియజేయాలని ఆయన సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం తో పాటు, సహాయ సంచాలకులు,మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సైతం ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
453 కోట్లు ఒకేసారి జమ…
జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ మాట్లాడుతూ లక్ష రూపాయల లోపు పంట రుణాలు పొందిన రైతులు జిల్లాలో 83,000 మంది ఉన్నారని, ఇందుకుగాను ప్రభుత్వం 453 కోట్ల రూపాయలు ఒకేసారి వారి ఖాతాలలో జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రుణాలు పొందిన రైతుల జాబితాను ఇదివరకే బ్యాంకులకు పంపించడం జరిగిందని, మండల వ్యవసాయ అధికారుల ద్వారా రైతులందరికీ గ్రామాలలో సమాచారాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు.
యూనిట్ల గ్రౌండింగ్ పై సమావేశం…
అనంతరం బ్యాంకుల అనుసంధానం తో అమలు చేసే యూనిట్ల గ్రౌండింగ్ పై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎల్డీఎం శ్రామిక్ మాట్లాడుతూ 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలలో 6479 కోట్ల రూపాయల రుణాల లక్ష్యానికి గాను, 7417 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చి 115 శాతాన్ని లక్ష్యాలను సాధించడం జరిగిందని, ప్రత్యేకించి పంట రుణాల కింద 95 శాతం రుణాల లక్ష్యాలను సాధించామని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ కింద 300 శాతం లక్ష్యాలుసాధించామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్యత, ప్రాధానయేతర రంగాలలో 200 శాతం లక్ష్యాలను సాధించామని వెల్లడించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి బ్యాంకర్లు ఇస్తున్న సహకారం పట్ల అభినందనలు తెలిపారు.ప్రత్యేకించి స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకుల అనుసంధానంతో ఇచ్చే రుణాలలో నల్గొండ జిల్లాలో 260 కోట్ల రూపాయల రుణాలను ఇచ్చి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండడం పట్ల ఆయన అభినందించారు. ఆ జాబితా ఆధారంగా గ్రామాలకు వెళ్లి యూనిట్లు గ్రౌండ్ అయ్యేవిధంగా సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో బ్యాంకర్లు సైతం దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఆగస్టు మొదటి వారం నాటికి సబ్సిడీ పొందిన లబ్ధిదారులందరూ యూనిట్లు పొందే విధంగా చూడాలని, ఒకవేళ ఎవరైనా లబ్దిదారు సహకరించనట్లైతే రెవెన్యూ రికవరీ చట్టం కింద సబ్సిడీ మొత్తాన్ని తిరిగి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఆసుపత్రులు, విద్యాసంస్థలకు సహకారం అందించాలి…
బ్యాంకర్లు వైద్య, ఆరోగ్యం ,విద్య రంగాలలో సామాజిక బాధ్యత కింద సహకారం అందించాలని, ఇందులో భాగంగా ఆసుపత్రులు, విద్యాసంస్థల నిర్వహణకు ముందుకు రావాల్సిందిగా జిల్లా కలెక్టర్ కోరారు. ఈ విషయమై ప్రతి బ్యాంకు ఆసుపత్రి లేదా ఒక విద్యాసంస్థను దత్తత తీసుకొని నిర్వహణ చేసేలా ప్రణాళిక రూపొందించాలని, వారంలో అన్ని బ్యాంకుల ద్వారా సిఎస్ఆర్ కింద చేపట్టే పనుల జాబితా రూపొందించి పని ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని ఎల్డిఎం శ్రామిక్ ను ఆదేశించారు. డిఆర్డిఓ నాగిరెడ్డి , ఎస్బిఐ రీజినల్ మేనేజర్ ఆలీముద్దీన్, నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వినయ్ కుమార్, ఆర్బిఐ ఏజీఎం సాయి తేజ రెడ్డి మాట్లాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ 15811.91 కోట్ల రూపాయల అంచనాలతో రూపొందించిన 2024- 25 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు.ఈ సమావేశానికి వివిధ బ్యాంకుల నియంత్రణ అధికారులు, కో-ఆర్డినేటర్లు, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు.