అల్లర్లను నియంత్రించడానికిఅన్ని చర్యలు

– బ్రిటన్‌ ప్రధాని
సోలిహుల్‌: ముస్లింలు, వలసదారులను లక్ష్యంగా చేసుకుని దేశంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న అల్లర్లను నియంత్రించడానికి ఏ అవకాశాన్ని వదులుకోమని, అల్లర్లను నియంత్రించడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని బ్రిటన్‌ ప్రధానమంత్రి కైర్‌ స్టార్మర్‌ గురువారం స్పష్టం చేశారు. ఇంగ్లండ్‌లోని సోలిహుల్‌ పట్టణంలోని ఒక మసీదును ప్రధానమంత్రి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. దాడులకు పాల్పడ్డవారిని ఉపేక్షించమని చెప్పారు. కాగా, జూలై 29న ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో ఒక కత్తిదాడిలో ముగ్గురు యువతులు మరణించిన తరువాత దేశంలో వరుస అల్లర్లు ప్రారంభమయ్యాయి. దాడికి పాల్పడింది ఒక ముస్లిం యువకుడని ఒక నకిలీ వార్త ఈ అల్లర్లుకు కారణమయింది. అయితే ప్రజలు ఐక్యంగా ఉండి ఈ అల్లర్లను అడ్డుకున్నారని లండన్‌ మెట్రోపాలిటన్‌ పోలీస్‌ కమిషనర్‌ మార్క్‌ రౌలీ తెలిపారు. పోలీసు శక్తి, వివిధ కమ్యూనిటీల మధ్య ఐక్యతే సమస్యలను ఓడించిందని తాను భావిస్తున్నట్లు రౌలీ చెప్పారు.