నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా ధన్యవాదాలతో ముగిసింది. ఎంపీపీ గాల్ రెడ్డి అధ్యక్ష వహించిన సమావేశంలో సర్పంచుల పదవీకాలంలో జరిగిన పనులు, చేసిన అభివృద్ధిని గుర్తుచేసుకొని సహకరించిన అధికారులకు సర్పంచులు ధన్యవాదాలు తెలిపారు. మిషన్ భగీరథ జంగంపల్లి, భాగిర్థిపల్లి, రామేశ్వర్ పల్లి గ్రామాలలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సర్పంచులు అధికారులను కోరారు. గ్రామపంచాయతీ నిధుల ద్వారా నీటి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో అనంతరావు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించారే కానీ పంపిణీ చేయని కారణంగా నిరుపయోగంగా ఉన్నాయని పంపిణీ చేయని గ్రామాలలో త్వరగా పంపిణీ చేయాలని సర్పంచ్ లు కోరగా విద్యుత్, మంచినీటి సౌకర్యాలు, ఇతర సమస్యలు పరిష్కరించిన తర్వాత పంపిణీ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. తిప్పాపూర్, మోటాట్ పల్లి, అంతంపల్లి, జంగంపల్లి ఆరోగ్య కేంద్రాలను రాజంపేట పరిధి నుండి తొలగించి భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలపాలని ఎంపీటీసీ, సర్పంచులు కోరగా గ్రామపంచాయతీ నుండి వినతి పత్రం అందజేస్తే ప్రభుత్వం, జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీపీ హామీ ఇచ్చారు. సొసైటీ నిధుల నుండి నూతన భవనాలు నిర్మిస్తున్న స్థలం వద్ద 33/11 కేవీ విద్యుత్ తీగలను తొలగించాలని అధికారులను కోరిన పట్టించుకోవడంలేదని, విద్యుత్ తీగలను మార్చడానికి డిడి చెల్లిస్తే మార్చడం జరుగుతుందని విద్యుత్ ఎఈలు తెలిపినట్లు సొసైటీ చైర్మన్ భూమయ్య సభ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ విద్యుత్ తీగలను, పోల్స్ ను మార్చడానికి తమకు ఎలాంటి అధికారం లేదని బదిలీ చేయడానికి డిడి చెల్లిస్తే మార్చడం జరుగుతుందని తెలపగా ఎంపీపీ చొరవ తీసుకొని చిన్న చిన్న సమస్యలను విద్యుత్ అధికారులె పరిష్కరించాలని, ప్రజల కోసం జరుగుతున్న పనులలో విద్యుత్ అధికారులు సహకరించాలని సూచించారు. పశు వైద్య శాఖలో సబ్సిడీతో కూడిన స్కీములు అందుబాటులో ఉన్నాయని రైతులు ఈ స్కీములకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎంపీఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సర్పంచుల సహకారంతో జిల్లాలోనే మండలంలోని 18 గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు, 100% పనులు పూర్తిచేసిన గ్రామం భిక్కనూరు మండలమేనని పనులు పూర్తి చేయడానికి సహకరించిన సర్పంచులకు ధన్యవాదాలు తెలిపారు. పదవి కాలం ముగుస్తున్న సర్పంచులకు ఎంపీటీసీ మధ్య చంద్రకాంత్ రెడ్డి, ఎంపీపీ గాల్ రెడ్డి మెమోంటో అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శివ ప్రసాద్, వైస్ ఎంపీపీ యాదగిరి, డిప్యూటీ ఇరిగేషన్ ఈఈ, భిక్కనూర్ మండల స్పెషల్ ఆఫీసర్ సుష్మా రెడ్డి, ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్ లు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.