బహుముఖ కళల్లో రాణించే మహిళలు చాలా అరుదుగా ఉంటారు. కుటుంబం, పిల్లల బాధ్యతల్లో చాలా వరకు ఏదో ఒక రంగానికే పరిమితమ వుతుంటారు. అయితే దీప అలా కాదు. అన్ని రంగాల్లోనూ తన సత్తాను చాటుతున్నారు. ఇటు చదువు, అటు సంగీత సాహిత్యాల్లో తన చిన్నారి కవల పిల్లల్ని చూసుకుంటూనే ముందుకు దూసుకుపోతున్నారు. ఆకాశవాణిలో ఆర్.జెగా రాణిస్తూనే నిదానం కవిగానూ పేరుతెచ్చుకున్నారు. ఇలా ఆల్ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
దీప హైదబాద్‌లోని జంగమ్‌మెట్‌లో పుట్టి పెరిగారు. తండ్రి ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.ఆర్.వెంకటేశం, ఉస్మానియా యూనివర్శిటీలో ఆచార్యులుగా పనిచేశారు. తల్లి లలిత తన ఆరుగురు ఆడపిల్లలను అత్యున్నతంగా తీర్చిదిద్దారు. చదువుతో పాటు వారంతా ఏదో ఒక కళారంగంలో రాణించేందుకు ఎంతో ప్రోత్సహించారు. ఏడవ తరగతిలో దీప అన్నాజీరావు వద్ద సంగీతం నేర్చుకున్నారు. బడిలో విద్యార్థినిగా అనేక బహుమతులు అందుకున్నారు. ఇక ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా పాటల్లో ఎన్నో బహుమతులు పొందారు. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పి.హెచ్.డి.చేయడంలో భర్త వేణుగోపాల్ ఆమెకు ఎంతో సహకరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ నుండి హెచ్‌ఓడీ వరకు ఎదిగిన ఆమె ప్రస్తుతం ఆర్.జెగా కొనసాగుతున్నారు.
విభిన్న కళల్లో…
కళారంగంపై ఉన్న అభిరుచితో 2007లోనే ఆకాశవాణితో కలిసి పని చయడం మొదలుపెట్టారు. అక్కడ యువవాణి కార్యక్రమంతో తన ప్రయాణం కొనసాగించారు. తర్వాత జ్ఞానవాణి అనే కార్యక్రమం కూడా చేశారు. ఆకాశవాణిలో యువవాణితో ఆరంభమై నేడు ఎఫ్.ఎం.రేడియో జాకీగా 16 ఏండ్లుగా కొనసాగడ మంటే చెప్పుకోదగ్గ విశేషం. అలాగే ఫ్రీలాన్స్ యాంకర్‌గా, బుక్ రిలీజ్ ఫంక్షన్స్‌లో, ఫ్యామిలీ కౌన్సిలర్‌గా, మోటి వేషన్ స్పీకర్‌గా, పలు విద్యా సంస్థల్లో ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో జనాల్లో చైతన్యం తెస్తున్నారు. బెస్ట్ ఆర్.జె. అవార్డులు, బెస్ట్ టీచర్ అవార్డులు సైతం అందుకున్న దీప కవిత్వం కూడా రాస్తున్నారు. ఆమె కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. డిప్లొమా లెవల్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పుస్తకం రాయటంతో పాటు చాలా పుస్తకాల్లో చాప్టర్స్ కూడా రాశారు.
రేడియో జాకీగా ప్రయాణం
దీప రేడియో జాకీగా ఎంతో మంది అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఎంతోమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, మాటల రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్లు, పాటల రచయితలు, సాహితీవేత్తలు, సంఘసంస్కర్తలు, సామాజికవేత్తలు, సింగర్లు, డాన్సర్లు, యాక్టర్లు, విద్యాసంస్థల అధినేతలు, రకరకాల విభాగాలకు సంబంధించిన డాక్టర్లు ఇంతమందిని కలిసి వాళ్ల అనుభవాలను ప్రపంచానికి పరిచయం చేసి, తనూ ఎంతో స్ఫూర్తి పొందారు. వీరిలో కొందరి జీవితాల్లోని సంఘటనలు ఆమెను కదిలించాయి. ‘మనం ఎలా కనబడుతున్నాం, ఎలా వినపడుతున్నాం అన్నది కాదు. వ్యక్తిగా సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. మన వల్ల సమాజంలో మంచి జరగకపోయినా పర్వాలేదు, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా మసులుకుంటే బాగుంటుంది అనేదాన్ని నేను నమ్ముతాను. దాన్నే ఓ వ్యక్తిగా నేను ఆచరిస్తాను. మంచిని మన పెదవుల ద్వారా పదిమందికి పంచుదాం, చెడుకి చెవిని దూరంగా ఉంచుదాం’ అంటారు దీప.
బాధ బయటకు కనబడకుండా…
‘రేడియో జాకీ అనగానే ఏముంది వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు, మనం వింటాం అని అనుకుంటారు చాలా మంది. కానీ ఈ వృత్తిలో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో మనం ఊహించని సంఘటనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సిస్టమ్స్ పని చేయకపోవడం లాంటివి, సడన్‌గా అప్పటికప్పుడు ఏదో ఒక ఇంపార్టెన్స్ ప్రోగ్రాం వచ్చినప్పుడు, ముఖ్యంగా కాలర్స్‌తో సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మరీ ఇబ్బంది పడాల్సిన విషయం ఏమిటంటే మా ఆరోగ్యం బాలేకున్నా లేదా ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినా, పర్సనల్ లైఫ్‌లో సమస్యలు ఉన్నా, పై అధికారుల వల్ల ఇబ్బందులకు గురవుతున్న ఏవేవీ మా గొంతులో వినిపించకూడదు. ఆ బాధలన్నీ దిగమింగి ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రేక్షకులతో మాట్లాడా ల్సిందే. ఇలాంటి సంఘటనలు నా ఆర్.జె ప్రయాణంలో ఎన్నో వచ్చాయి. ఏం జరిగినా సరే ప్రజలను ఎంటర్టైన్ చేయగలిగే శక్తి మన లోపల ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే క్రియేటివ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి సవాల్‌ని చిరునవ్వుతో ఎదుర్కొని కష్టపడి ఈ ప్రయాణంలో కొనసాగుతున్నం దుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.
– అచ్యుతుని రాజ్యశ్రీ