– కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధింపు
– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడి
నాలుగున ఉదయం 8 గంటలకు ప్రారంభం 17 లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానానికి ఓట్ల లెక్కింపు ముందుగా పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత ఈవీఎంలు అత్యధికంగా 24 రౌండ్లు, అత్యల్పంగా 13 రౌండ్లు ఆడియో, వీడియో, సెల్‌ఫోన్లకు నో పర్మిషన్ లెక్కింపునకు 10 వేల మంది నియామకం 49 మంది మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ ఆ రోజు లిక్కర్ షాపుల మూసివేత 12 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులతో మూడంచెల భద్రత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలోని 17 లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానానికి ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ నెల 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని వెల్లడించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు తుది ఫలితాలు వచ్చే అవకాశముందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు ఆయన చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ముందుగా పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందనీ, ఆ తర్వాత అరగంటకు ఈవీఎంల లెక్కింపు చేపడతామని వికాస్‌రాజ్ తెలిపారు. చొప్పదండి, యాకత్‌పుర, దేవరకొండలో అత్యధికంగా 24 రౌండ్లు, ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటలో అత్యల్పంగా 13 రౌండ్లు ఉంటా యని తెలిపారు. ఇప్పటి వరకు 2 లక్షలా 18 వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని చెప్పారు. వీటి లెక్కింపు కోసం 276 టేబుళ్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కౌంటింగ్ ప్రారంభించే రోజు ఉదయం 8 గంటల వరకు వచ్చే పోస్టల్ బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. కౌంటింగ్ పూర్తయ్యాక ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని 5 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్‌ల లెక్కింపు ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కోసం 10వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారనీ, మరో 50 శాతం మంది అదనంగా అందుబాటులో ఉంటారని చెప్పారు. వీరందరికీ రెండు దఫాలుగా శిక్షణ అందించినట్టు వివరించారు. కౌంటింగ్‌ను పర్యవేక్షించేందుకు 49 మంది మైక్రో అబ్జర్వర్లు, 2,440 మంది సహాయ మైక్రో అబ్జర్వర్లను నియమించినట్టు తెలిపారు. లెక్కింపు ప్రక్రియను ఎంట్రీ చేసేందుకు 800 మంది ఐటీ నిపుణులను ఏర్పాటు చేశామన్నారు. లెక్కింపు తర్వాత ర్యాలీలు, ఇతర సభలు, సమావేశాలకు పోలీసుల అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. కౌంటింగ్‌ను మానిటరింగ్ చేసేందుకు హైదరాబాద్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో వార్ రూం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కౌంటింగ్ రోజు లిక్కర్ షాపులను మూసివేయనున్నట్టు పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు హాల్ వద్ద 100 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించినట్టు వెల్లడించారు. ఐడీ కార్డు ఉన్నవారిని మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తారని పేర్కొన్నారు. లెక్కింపు కేంద్రం లోపలికి ఆడియో, వీడియో, మొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూం నుంచి కౌంటింగ్ హాల్ వరకు సీసీటీవీలతో మానిటరింగ్ చేస్తామని వివరించారు. కాగా మొత్తం 3,32,16,348 మంది ఓటర్లకు గాను 2,20,24,806 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.