అనుకున్నంతా అయింది.. పరువంతా పోయింది

Everything happened.. All honor is gone– ఎంపీపై దాడికేసులో తుస్సుమన్న సర్కారు యత్నం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తిదాడి వ్యవహారాన్ని వాడుకుని రాజకీయంగా ప్రయోజనం పొందాలనుకున్న బీఆర్‌ఎస్‌ పెద్దల ప్రయత్నం ఫలించలేదు. పోలీసుల ప్రాథమిక విచారణ సందర్భంగా ఎంపీపై దాడిచేసిన వ్యక్తి కేవలం సంచలనం సృష్టించడానికే ఈ చర్యకు పాల్పడ్డట్టు సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్వేత మీడియాకు చెప్పడంతో అసలు సంగతి బయటకొచ్చింది. వాస్తవానికి ఎంపీపై దాడిని ఎవరూ సమర్థించాల్సిన అవసరం లేదు. ఖండించాల్సిందే. నేరం చేసిన నిందితులెవరైనా, ఏస్థాయిలో ఉన్నా చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. అయితే మూడోసారి అధికారంలోకి రావాలనే తపనతో బీఆర్‌ఎస్‌ నాయకత్వం తప్పులో కాలేసింది. అభాసుపాలైంది. రాజకీయ ప్రయోజనాలను ఆశించి సభలు, సమావేశాలు, ట్వీట్ల ద్వారా స్టేట్‌మెంట్లు ఇచ్చారు. సోషల్‌మీడియాలోనూ భారీగా పోస్టులు పెట్టారు. రాజకీయ పార్టీలను సైతం తప్పుబట్టారు. చికిత్స సందర్భంగా ఆస్పత్రిలోనూ హడావిడి చేశారు. ఈ ఘటనను ఎన్నికల్లో లబ్ధికోసం ఉపయోగించుకునే ప్రయత్నం బీఆర్‌ఎస్‌ నేతల నుంచి గట్టిగానే జరిగింది.
చివరకు కత్తిదాడి వెనుక ఎవరి ప్రమేయం లేదనీ, అతడు సెన్సేషన్‌ కోసమే ఎంపీపై దాడి చేశాడని పోలీసులు దృవీకరించడం గమనార్హం. ఈనేపథ్యంలో సోషల్‌మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని సీపీ శ్వేత సూచించారు. కాగా ఆ జిల్లా సీపీతో ఓ మంత్రి ‘రిపోర్టు ఇచ్చేటప్పుడు, మీడియాతో మాట్లాడే ముందు ఒక్క మాట చెప్పొచ్చుకదా ?” అని అడిగినట్టు తెలిసింది. అందుకు సదరు సీపీ చిరునవ్వుతో సమాధానం దాటవేసినట్టు సమాచారం. ఆ చిరునవ్వు వెనుక ఎన్నికల కమిషన్‌ ఆదేశాలే కారణం కావచ్చు. ప్రభుత్వానికి సహకరించే ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల మూకుమ్మడిగా వేటు వేసిన సంగతి తెలిసిందే.