– మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మరో ప్రాణికి జన్మనివ్వడం ద్వారా ఇంకో మనిషిని సృష్టించే శక్తి మహిళలకే ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ‘డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ వుమెన్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో అంతర్జా తీయ మహిళా దినోత్సవాన్ని (మార్చి8) నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మహిళల హక్కుల సాధన కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ‘సృష్టికి మూలం మహిళ. మహిళ లేనిదే సృష్టి లేదు. ప్రకృతికి మహిళ వరం లాంటిది. మహిళను భూదేవితో పోలుస్తారు. కూతురుగా, తల్లిగా, చెల్లిగా, భార్యగా ఈ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే శక్తి మహిళలకున్నది. నాటి కాలంలో లాగా నేడు మహిళలపై అంతటి వివక్ష లేదు. ఇప్పటి పిల్లలకు ఇష్టానుసారంగా వారి జీవితాలను తీర్చిదిద్దుకునే స్వేచ్ఛను ఆ కుటుంబాలు కల్పిస్తున్నాయి’ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి హౌదాలో ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.