పేదల బతుకులు మారలే గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి డిమాండ్‌
నవతెలంగాణ- బోధన్‌
తరాలు మారినా పేదల బతుకులు మారలేవని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి అన్నారు. 50 ఏండ్లుగా పేదలు కిరాయి ఇండ్లల్లోనే నివసిస్తున్నారని, పాలకులు వారికి కనీసం 120 గజాల ఇంటి స్థలం కేటాయించకపోవడం దారుణమని అన్నారు. నెహ్రూనగర్‌లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం నెహ్రూనగర్‌లో చేపట్టిన భూపోరాట కేంద్రాన్ని శనివారం ఆమె పరిశీలించారు. గుడిసెలు వేసుకున్న పేదలతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు నిలువ నీడ కల్పించకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి పేదలు సుమారు 50 ఏండ్ల నుంచి అద్దె ఇండ్లల్లో ఉండి అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సరిగా పనులు లేక ఇంటి కిరాయి చెల్లించలేక పిల్లలను సైతం సరిగ్గా చదివించలేకపోయారని చెప్పారు. దీనికి తోడు పెట్రో, వంట గ్యాస్‌ ధరల పెరుగుదలతో నిత్యావసర ధరలు అమాంతంగా పెరిగాయని దీంతో బతకడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల మీద ధరలు పెంచుతూ మరింత భారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం గ్యాస్‌ బండ ధర రూ.410 నుంచి 1220 రూపాయల వరకు పెంచడంతోపాటు డీజిల్‌, పెట్రోల్‌ , కూరగాయలు, పప్పులు ఉప్పులు నూనె కారం ధరలు పెంచుతూ పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దలకు రాయితీలు కల్పిస్తూ పేదలపై భారాలు మోపుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ గుడిసె వాసులకు అండగా ఉంటామని చెప్పారని, గుడిసెలు తొలగించొద్దని తహసీల్దార్‌ను ఫోన్‌లో ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. దీంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆమె వెంట సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌, జిల్లా అధ్యక్షులు శంకర్‌ గౌడ్‌, ఐద్వా జిల్లా కార్యదర్శి సబ్బని లత, సీపీఐ(ఎం) డివిజన్‌ కార్యదర్శి ఏశాల గంగాధర్‌, ఫారూఖ్‌ మన్సూర్‌, గంగామణి, జరీనా యాస్మిన్‌ రాజు ఉన్నారు.