– ఆర్డీవోలు, తాసిల్దారులు పత్తి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి నివేదిక ఇవాలి
– కలెక్టర్ నారాయణరెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నేటి సాయంత్రంలోగా జిల్లాలో ప్రతిపాదించిన అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆయన వివిధ అంశాలపై జిల్లా,మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ వానకాలం ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 375 కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రతిపాదించడం జరిగిందని, వాటన్నింటిని బుధవారం సాయంత్రంలోగా ప్రారంభించాలని కలెక్టర్ అన్నారు. 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, అన్ని కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు, తూకం కొలచే యంత్రాలు,తేమ యంత్రాలు,ఇతర అన్ని సౌకర్యాలు ఉండాలని, వర్షానికి ధాన్యం తడవకుండా చూసుకోవాలని కలెక్టర్ పునరుద్గాటించారు. ఆర్డీవోలు, తహసిల్దారులు వారి పరిధిలోని పత్తి కొనుగోలు కేంద్రాలను తక్షణమే తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అంతేకాక ఆయా ప్రాంతాలలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన విషయాన్ని మీడియా ద్వారా రైతులకు తెలియజేయాలని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర 7521 రూపాయలకు కు మించి ప్రైవేటు కొనుగోలు కేంద్రాలలో ధర వస్తున్నట్లయితేనే రైతులు అక్కడ అమ్ముకోవచ్చని, మద్దతు ధర కంటే తక్కువగా ఎవరు అమ్మాల్సిన అవసరం లేదని, అందువల్ల పత్తి రైతులు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలకే పత్తిని తీసుకురావాలని కలెక్టర్ కోరారు.సామాజిక, ఆర్థిక గణనలో భాగంగా గణకులను, పర్యవేక్షకులను తక్షణమే గుర్తించాలని, అన్ని శాఖల నుండి అధికారి స్థాయి ఉద్యోగులను సూపర్వైజర్లుగా, ఇతర ఉద్యోగులను గణకులుగా తీసుకోవాలని, ఉపాధ్యాయులను సోషియ ఎకనామిక్ సర్వే విధులకు తీసుకోవద్దని, అవసరమైతే 25 శాతం మాత్రమే తీసుకోవలసి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
మండలాల తనిఖీ..
మండల ప్రత్యేక అధికారులు గ్రామాలలో సీజనల్ వ్యాధులు పారిశుధ్యం, మొక్కల పెంపకం పై దృష్టి పెట్టాలని, ఈ శుక్రవారం గ్రామాలలో వీటిని తనిఖీ చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా అన్ని స్థాయిల్లో పరిష్కరించి లబ్ధిదారులకు చెక్కులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ- 2025 ముందస్తు కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 29న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నందున పెండింగ్ లో ఉన్న 6,7,8 పారాలను వెంటనే పరిష్కరించాలని, జిల్లాలో సుమారు 14 వేల వరకు వివిధ ఫారాలు పెండింగ్ లో ఉన్నాయని ,ఈనెల 26 లోగా వాటిని పరిష్కరించాలని తహసిల్దార్లను ఆదేశించారు.వరంగల్,ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి శనివారం లోపు అర్హులైన ప్రైవేటు, ప్రభుత్వ టీచర్లందరూ ఆన్లైన్ ద్వారా ఫారం-19 లో దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై డీఈఓ, ఎంఈవోలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం ఆర్డీవోలు,తహసిల్దారులు దరఖాస్తులపై విచారణ నిర్వహించి వాటిని పరిష్కరించాలని చెప్పారు.ఎల్ఆర్ఎస్ లో భాగంగా పట్టణ ప్రాంతాలలో ఈ శనివారం లోపు దరఖాస్తులన్నింటిని పరిష్కరించాలని, అలాగే గ్రామీణ ప్రాంతాలలో సైతం ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు వచ్చే గురువారం నాటికి మొత్తం దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచంద్ర, సంబంధిత జిల్లా అధికారులు, ఆర్డీవోలు, మండలాల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈఓ లు తదితరులు ఈ టెలికాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.