– ప్రభుత్వానికి నచ్చిన వారిని ఎంపిక చేయకూడదు
– సెలెక్టివ్‌గా నియామకాలు జరిగితే సీనియారిటీ క్రమానికి విఘాతం
– ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలి..
– లేకుంటే ఉత్తర్వుల జారీకి వెనుకాడబోం : సుప్రీంకోర్టు ధర్మాసనం
న్యూఢిల్లీ : న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం ప్రతిపాదనల పేర్లను ఆమోదించే సమయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ‘పిక్ అండ్ సెలెక్ట్’ విధానంపై సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల కోసం సిఫారసు చేసిన వారి సీనియారిటీకి ఈ విధానం భంగం కలిగించిందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ‘ఈ పిక్ అండ్ సెలెక్ట్ ఆపివేయాలి. ఇది ఆఫ్ హ్యాండ్ రిమార్క్ కాదు’ అని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయ మూర్తుల నియామకంలో కొలీజియం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ బెంగళూరు న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సంజరు కిషన్ కౌల్, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం సమస్యను పరిష్కరించ కుంటే ఈ అంశంపై ఉత్తర్వులు జారీ చేసేందుకు వెనుకాడబోమని న్యాయమూర్తులు తెలిపారు.
పంజాబ్, హర్యానా హైకోర్టులను ఉదాహరణ ను ఉదహరించిన ధర్మాసనం ‘సుప్రీం కోర్ట్ కొలీజియం పంజాబ్, హర్యానా హైకోర్టులకు ఐదుగురు న్యాయవాదులను పదోన్నతి కల్పించాలని సిఫార్సు చేసింది. సీరియల్ నంబర్ 1, 2లో ఉంచబడిన పేర్లను విస్మరించి, కేంద్రం కేవలం ముగ్గురి పేర్లను మాత్రమే క్లియర్ చేసింది’ అని ధర్మాసనం పేర్కొంది. సెలెక్టివ్‌గా నియామకాలు జరిగితే సీనియారిటీ క్రమానికి విఘాతం కలుగుతుందని, తద్వారా యువ న్యాయవాదులు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టేందుకు అనువుగా ఉండదని ధర్మాసనం పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న పేర్లపై సుప్రీం కోర్టు స్పందిస్తూ కొలీజియం ప్రతిపాదించిన 14 పేర్లు ఇప్పటికీ ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, కొలీజియం పునరుద్ఘాటించినప్పటికీ వాటిలో ఐదు పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.
‘ఈ బదిలీలు తప్పక జరగాలి. లేకుంటే అది వ్యవస్థలో విపరీతమైన క్రమరాహి త్యాన్ని సృష్టిస్తుంది’ అని జస్టిస్ ఎస్‌కె కౌల్ అన్నారు. సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. అటార్నీ జనరల్ ఇచ్చిన హామీలపై చర్యలు తీసుకోకుండా కోర్టు కొరడా ఝుళిపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది.