నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం ఇసుక క్వారీకి ఇసుక కోసం వచ్చిన లారీలు నిలుపుకోడానికి స్థలం లేక రోడ్లపైనే ఎక్కడ పడితే అక్కడ నిలిపి ఉంచుతున్నారు. గురు,శుక్రవారాల్లో ప్రయాణికులు ఇబ్బందులకు గురైయ్యారు. ఈ క్వారీకి వందకు పైగా లారీలు రావడంతో మల్లారం ఫారెస్ట్ నర్సరీ నుంచి మల్లారం క్వారీ వరకు సుమారు రెండు కిలో మీటర్ల మేర లారీలు నిలిచాయి. ఇసుక కోసం క్వారీలకు వెళ్లే లారీల కోసమే రోడ్లు అన్న ట్లుగా మారిపోయాయి. లారీలు రోడ్డుపై నిలపడంతో తాడిచర్ల నుంచి కొయ్యూర్ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ లారీలతో గత నాలుగైదు రోజులుగా ఇదే పరిస్థితి ఉందని వాహనదారులు వాపోతున్నారు. రోడ్డుపై లారీలు నిలిచి ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ము, దూళీతో ఇబ్బందులు పడు తున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని స్థానికులు, ప్రజలు కోరుతున్నారు.