– నాగం చేరికతో బీఆర్‌ఎస్ బలం పెరిగింది… : సీఎం కేసీఆర్
– గులాబీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి నాగం, పీజేఆర్ తనయుడు విష్ణువర్థన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉమ్మడి పాలమూరు జిల్లాల్లోని పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ తమ పార్టీ గెలుపు జెండా ఎగరేస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అదెప్పుడో ఖాయమైందని చెప్పారు. మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత పీజేఆర్ తనయుడు విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు సీఎం కేసీఆర్ సమక్షంలో మంగళవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ… నాగం జనార్థన్‌రెడ్డి 1969 ఉద్య మంలో క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆ సందర్భంగా జైలుకెళ్లిన చరిత్ర కూడా ఆయనకు ఉందన్నారు. నాగం చేరికతో తమ పార్టీ బలం పెరిగిందని చెప్పారు. పీజేఆర్ తనకు మంచి మిత్రుడనీ, ఆయన తనయుడు విష్ణువర్థన్‌రెడ్డి తన కుటుంబ సభ్యుడిలాంటి వాడని అన్నారు. నాగం, విష్ణుల రాజకీయ భవిష్యత్ బాధ్యత తనదేనని హామీనిచ్చారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, విష్ణు ఇద్దరూ పాత, కొత్త అనే తేడా లేకుండా సమ న్వయంతో పని చేసుకోవాలంటూ సూచించారు. త్వరలో నాగం ఇంటికి తానే స్వయంగా వెళతాననీ, అప్పుడు ఆయన వెంట పార్టీలోకి వచ్చిన కార్యకర్తలను కలుసుకుంటానని వివరిం చారు. కత్తిపోటుకు గురైన కొత్త ప్రభాకర రెడ్డి అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డారని చెప్పారు. అలాంటి హింసా రాజకీయాలను సహించేది లేదనీ, ఎవరినీ ఉపేక్షించబోమనీ హెచ్చరించారు. హేయమైన దాడులకు పాల్పడే వారికి ప్రస్తుత ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని సీఎం ఈ సందర్భంగా హెచ్చరించారు.