టికెట్ల మాదిరిగానే.. రాష్ట్రాన్నీ అమ్మేస్తారు..!

Just like tickets.. they sell all over the state..!– కాంగ్రెస్‌కు అధికారమిస్తే ఇదే జరుగుతుంది
– మూడోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం :వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి, ఆదిలాబాద్‌ అర్బన్‌, ఉట్నూర్‌
కాంగ్రెస్‌ వాళ్లకు పోటీ చేయడానికి సత్తా లేక పైసలకు టికెట్లు అమ్ముకున్నారని, వీళ్లకు అధికారమిస్తే రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారని వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఓటుకు నోటు దొంగల చేతిలో కాకుండా.. కేసీఆర్‌ వంటి త్యాగధనుల చేతిలో ఈ రాష్ట్రం ఉండాలన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌, జిల్లా కేంద్రంలోని డైట్‌ మైదానంలో శనివారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ఆదిలాబాద్‌, బోథ్‌, ఖానాపూర్‌ నియోజకవర్గ అభ్యర్థులు జోగు రామన్న, అనిల్‌ జాదవ్‌, జాన్సన్‌ నాయక్‌ను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ గాలి వీస్తోందని, మరోసారి కేసీఆర్‌ సీఎం కావడం ఖాయమని చెప్పారు. ఈ పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో కరువు, కర్ఫ్యూ లేదని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని, జనవరి నుంచి ప్రభుత్వ వేతనాలు వస్తాయని వివరించారు. బీజేపీ, కాంగ్రెస్‌ వాళ్లు ఎన్ని జిమ్మిక్కులు చేసినా సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమన్నారు. కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్‌ తమను ఆగం పట్టించిందని అక్కడి రైతులు ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను గడపగడపకూ తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. బీఆర్‌ఎస్‌ మరోసారి అధికారంలోకి రాగానే రూ.5వేల పింఛన్‌, రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ, రైతుబంధు ఎకరానికి రూ.16వేలు, రూ.400 గ్యాస్‌ సిలిండర్‌, సౌభాగ్యలక్ష్మీ పేరిట మహిళలకు నెలకు రూ.3వేల ఆర్థిక సాయం, ఆరోగ్యశ్రీ కింద రూ.15లక్షల వరకు ఉచిత వైద్యం, అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా మార్చి హక్కులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.కేసీఆర్‌ బీమా పథకం కింద కోటి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున వర్తింప జేస్తామని, ముస్లిం, మైనార్టీల కోసం బడ్జెట్‌లో రూ.2200కోట్లు ఖర్చు పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్‌, మాజీ శాసనమండలి చైర్మెన్‌ స్వామిగౌడ్‌, మాజీ ఎంపీ గోడం నగేష్‌, మున్సిపల్‌ చైర్మెన్‌ జోగు ప్రేమేందర్‌, డీసీసీబీ చైర్మెన్‌ అడ్డి భోజారెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు రోకండ్ల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.