అష్టదిగ్బంధనంలో వీణవంక.. అంతా అతలాకుతలం

– నిండుకుండలా చెరువులు, కుంటలు లోతట్టు ప్రాంతాల జలమయం
– కూలిన ఆరు ఇండ్లు, నీటమునిగిన ఇండ్లు
– భయాందోళనలో ప్రజలు
పలుగ్రామాలకు నిలిచిన రాకపోకలు
నవతెలంగాణ-వీణవంక
గత ఐదు రోజులోగా కురుస్తున్న వానలకు చెరువులన్నీ నిండుకున్నాయి. బుధవారం సాయంత్రం నుండి గురువారం వరకు కురిసిన అతి భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండి మత్తడులు దూకడంతో భారీగా వర్షం నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో మండలంలోని నర్సింగాపూర్, లస్మక్కపల్లి, కనపర్తి, వీణవంక, మామిడాలపల్లి, కోర్కల్, నర్సింహులపల్లి, కొండపాక, వల్బాపూర్, బేతిగల్, చల్లూరు, పోతిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. చల్లూరులో రెండు, వీణవంకలో ఒకటి, మామిడాలపల్లిలో ఒకటి, కనపర్తిలో ఒకటి, బ్రాహ్మణపల్లిలో ఒకటి కాగా మొతం ఆరు ఇండ్లు వర్షానికి నాని కూలిపోయాయి. భారీ వర్షానికి నీరు రోడ్లపైకి వచ్చి చేరడంతో కరీంనగర్-జమ్మికుంట రహదారిపై పలుచోట్ల అంతరాయం ఏర్పడింది. మామిడాలపల్లి-పచ్చునూరు, కోర్కల్-శ్రీరాములపేట, వీణవంక-నర్సింగాపూర్ గ్రామాల మధ్య రోడ్లు తెగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే మండలంలోని కనపర్తి-బేతిగల్, కనపర్తి-వీణవంక, గ్రామాల మధ్య రోడ్లు తెగడం కనపర్తి-జగ్గయ్యపల్లి గ్రామాల మధ్య భారీ చెట్లు గాలులకు నేలకొరగడంతో పూర్తిగా కనపర్తి గ్రామం అష్టదిగ్భందనంలోకి వెళ్లింది. దీంతో ఆ గ్రామ ప్రజలు ఎటూ వెళ్లలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బొంతుపల్లి-గద్దపాక, ఎల్బాక-గంగారం, ఘన్మక్ల-రెడ్డిపల్లి గ్రామాల మధ్య వరద నీరు రోడ్లపైకి రావడంతో కొంత సేపు రాకపోకలు నిలిచిపోయాయి. మండలం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో 80శాతంపైగా వరి, పత్తి పంటలు నీట మునిగాయి. నర్సింగాపూర్, కనపర్తి తదితర గ్రామాల్లో సర్పంచులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.