ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుందన్నారు గురజాడ. దాన్ని నిజం చేస్తూ నేటి మహిళలు ఎందరో చరిత్రను సృష్టిస్తున్నారు. తాము అడుగుపెట్టిన రంగాలలో అనేక విజయాలు సాధిస్తున్నారు. భవిష్యత్ తరాలకు మైలురాళ్లను సృష్టించిన ఆ మహిళల విజయాలు ఎందరికో స్ఫూర్తినందిస్తున్నాయి. అసలు చదివే అబ్బదనుకున్న ఓ అమ్మాయి మెడిసెన్ చేసి పరిశోధనలు చేసింది. మంచి ఉద్యోగాన్ని విడిచి నగరం నుండి గ్రామానికి పరుగులు పెట్టింది మరో మహిళ. కళేబరాల బొక్కలు ఏరిన అమ్మాయి అట్టడుగు ప్రజల కోసం ఓ సంఘాన్ని ఏర్పాటు చేసింది. అలాంటి ముగ్గురు మహిళల స్ఫూర్తిదాయక జీవిత పరిచయం నేటి మానవిలో…
పరిశోధనలు చేసి…
గగన్‌దీప్ కాంగ్.. సిమ్లాలో జన్మించింది. ఆమెకు ఆరేండ్లు వచ్చే వరకు అమ్మమ్మ వద్ద పెరిగింది. తల్లిదండ్రులు యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివసించారు. కాంగ్‌తో పాటు ఇంట్లో ఇంకా చిన్న పిల్లలు ఉండేవారు. వాళ్ళందరినీ చూసుకోవడం అమ్మమ్మకు చాలా ఇబ్బందిగా ఉండేది. దాంతో కాంగ్ స్కూల్‌కు సరిగ్గా వెళ్లేది కాదు. తల్లిదండ్రులు తిరిగి వచ్చిన తర్వాత ఆమెను బీహార్‌లోని ఒక పాఠశాలలో చేర్పించారు. అక్కడ ఆమె 10 సబ్జెక్టులకు ఏడింటిలో ఫెయిల్ అయ్యింది. తండ్రి ఇండియన్ రైల్వేస్‌లో ఇంజనీర్ కావడంతో 12 ఏండ్లలో కాంగ్ 10 స్కూళ్లను మార్చాల్సి వచ్చింది. వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్‌లో(జవీజ) చేరిన తర్వాత ఆమె మామయ్యతో నిత్యం చర్చిస్తూ ఉండేది. ఆయన ప్రభావంతో ఆమె జీవన గమనం మారిపోయింది. చదువులో బలహీనంగా ఉన్నప్పటికీ కాంగ్ 1987లో మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీలో పట్టభద్రురాలైంది. ఆ తర్వాత 1991లో జవీజ నుండి మైక్రోబయాలజీ విభాగంలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (ఎండీ) పూర్తి చేసింది. 1998లో పీహెచ్‌డీ కూడా పొందింది. తర్వాత భారతదేశంలోని ప్రముఖ వైరాలజిస్ట్‌లలో ఒకరిగా గుర్తింపు పొందింది. భయంకర అంటువ్యాధైన రోటవైరస్‌పై పరిశోధనను ప్రారంభించింది. 2000ల ప్రారంభంలో ఈ వ్యాధి భారతదేశంలో ఏటా 1.3 లక్షల మరణాలకు కారణమైంది. ఆమె, ఆమె బృందం ఇప్పుడు భారతీయ పిల్లలలో ఈ వ్యాధిని నివారించడానికి వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసింది. అలాగే ఆమె నైపుణ్యం కోవిడ్-19 వ్యాప్తి సమయంలో దేశవ్యాప్తంగా పరిశోధనలో ఉపయోగించబడింది. ఎక్కువగా పురుషుల మధ్య పని చేసిన మహిళగా కాంగ్‌కు ఆ సవాళ్ల గురించి తెలుసు. ఆమె ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు సరైన సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో సహాయపడాలనుకుంది. తద్వారా నిధుల కొరత నుండి వ్యాక్సిన్‌లపై అపనమ్మకాన్ని పారద్రోలడంలో విశేష కృషి చేస్తుంది..
గ్రామానికి తిరిగి వెళ్ళి
ఛవి రజావత్… పూణేలో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఒక ప్రముఖ టెలికాం సంస్థలో మంచి ఉద్యోగాన్ని వదిలి, అట్టడుగు స్థాయిలో పని చేయడానికి రాజస్థాన్‌లోని సోడాలోని తన పూర్వీకుల గ్రామానికి తిరిగి వెళ్ళింది. ఆమె తాత ఆ గ్రామానికి మూడుసార్లు సర్పంచ్‌గా ఉన్నారు. దాంతో సంఘం సభ్యులు రాజావత్‌ను ఈ పద్ధతిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నారు. ‘మనలో ప్రతి ఒక్కరూ మన జీవిత ప్రయాణాన్ని ఒక గ్రామంలో తిరిగి చూడవచ్చు. అవకాశాల కోసం గ్రామాలను విడిచిపెట్టిన వారితో మన నగరాలు నిండి ఉన్నాయి. అయితే గ్రామాలే మనకు పునాది. అవి బలంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో నేను తిరిగి గ్రామానికి వెళ్లాను’ అని ఆమె చెప్పారు. 2011లో రజావత్ ఎన్నికలలో పోటీ చేసి గ్రామ సర్పంచ్ అయ్యారు. తన సంఘానికి నీరు, సోలార్ పవర్, పాఠశాల, రోడ్లు, మరుగుదొడ్లతో పాటు బ్యాంకును తీసుకొచ్చాను. గ్రామం అత్యంత కరువుతో బాధపడుతుండటం చూసి, అక్కడ భూగర్భ జలాలు నీటిపారుదలకి కూడా అవకాశం లేదని ప్రకటించారని రాజావత్‌కు అర్థమైంది. ‘నేను కేవలం కరువు వినాశనానికి వ్యతిరేకంగా పోరాడలేదు. ఒక సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నించాను’ ఆమె చెప్పారు. 2010లో సోడాలో సుమారు 7 వేల మంది జనాభా ఉన్నారు. అయితే ప్రభుత్వం కేవలం రూ.20 లక్షల నిధులు మాత్రమే కేటాయించింది. అందులో సగం ప్రభుత్వ భవన నిర్మాణానికి ఖర్చు చేసింది. ‘కాబట్టి నేను ఏడాదికి రూ. 10 లక్షల బడ్జెట్‌తో నా పని ప్రారంభించాను. పంచాయితీ తన సొంత అభీష్టానుసారం నిధులను ఉపయోగించకపోవడమే కాకుండా, జిల్లాలో ఎంచుకున్న ప్రాజెక్టులను మాత్రమే మేము అమలు చేయగలమని గ్రహించాను. ఇది ప్రధాన కార్యాలయం, అక్కడి అధికారులచే ఆమోదించబడింది. ఇది గ్రామం కోరుకున్నదానికి, ఆమోదించబడిన వాటికి మధ్య పెద్ద అసమతుల్యతకు దారితీసింది’ అని ఆమె వివరించారు. రాజావత్ ప్రతి ఇంటి నుండి వారి అవసరాలు, ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి వారితో మాట్లాడేవారు. ఆమె సర్పంచ్‌గా గ్రామ అభివృద్ధి కోసమే కాదు వ్యవస్థ, కుల అక్షరాస్యత, లింగ-ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా ఒక గొప్ప పోరాటం చేశారు. చిన్న జోక్యాలు కూడా గ్రామానికి భారీ ప్రయోజనాలు అందిస్తాయని ఆమె గ్రహించారు. ఇప్పటికీ ఆమె సోడా అభివృద్ధికై పని చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో అట్టడుగు స్థాయి వారి కోసం కృషి చేస్తూ దేశమంతటా మహిళలను ప్రేరేపిస్తున్నారు.
మొదటి మహిళగా…
గౌతమ మీనా చెన్నైలో తన తల్లితో కలిసి కబేళాల నుండి ఎముకలను సేకరిస్తూ పెరిగింది. చాలా సందర్భాల్లో సరిపడా నీళ్లు లేక స్నానం చేయకుండానే స్కూల్‌కి అలాగే వెళ్లిపోయేది. చాలా ఏండ్ల తర్వాత మీనా బౌద్ధ, అంబేద్కరైట్‌ను అభ్యసించడం మొదలు పెట్టింది. ఆల్ ఇండియా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్‌ను స్థాపించింది. అఖిల భారత స్థాయిలో ఉద్యోగ సంఘానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. మీనా చిన్న వయస్సు లోనే ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించింది. 1994లో చెన్నైలో జరిగిన తొలి అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో సభ్యురాలిగా చేరింది. ‘ఆట నాకు అంతుచిక్కని దూకుడును వదిలించుకోవడానికి సహాయపడింది. నా ప్రత్యర్థులను గమనించడానికి నా నైపుణ్యాలను మెరుగుపరిచింది. ఇది తర్వాత కాలంలో నా జీవితంలో కూడా నాకు సహాయపడింది’ ఆమె చెప్పింది. రిజర్వేషన్ రోస్టర్‌లో దిగ్భ్రాంతికరమైన వ్యత్యాసాలను కనుగొన్న తర్వాత 2016లో మీనా, ఆమె బృందం వారి హక్కుల కోసం నిరసనలు చేయడం ప్రారంభించింది. ఈ పోరాటం ముగిసే సమయానికి ఆమె పది రోజుల పాటు నిరాహార దీక్షకు కూర్చున్న ఏకైక ఉద్యోగి. ఆమె సంఘం చేసిన ఏడేండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆమె శాఖలో మొట్టమొదటిసారిగా గెజిట్ ర్యాంక్ ఆఫీసర్ల కోసం 459 ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ ఖాళీలు భర్తీ చేయబడ్డాయి. ఈ రోజుకూ మీనా చెన్నైలోని పులియంతోప్‌లోని తన మురికివాడలోని ఒక తరం యువతులను వారి కలలను అనుసరించడానికి ప్రేరేపిస్తుంది. ఆమె వారి విద్యకు నిధులు సమకూరుస్తుంది. వారికి క్రీడలలో శిక్షణ ఇస్తుంది. అణగారిన వర్గాల కేసులపై పోరాడేందుకు ఆమె తన లా డిగ్రీని కూడా పూర్తి చేసింది.