– మండల స్థాయి అధికారులకు పలు సూచనలు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 5 నుండి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన నల్గొండ నుండి మండల స్థాయి అధికారులతో స్వచదనం పచ్చదనం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.స్వచదనం, పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, మొక్కలు నాటడం, తాగునీరు, వివిధ సంస్థల పరిశుభ్రత,వీధి కుక్కల బెడద తగ్గించడం వంటి అంశాలను చేపట్టాలన్నారు. అన్ని గ్రామాలలో నీటి నిల్వ కట్టడాల ను నిర్మించాలని, ప్రతి 1,000 మంది జనాభా కు ఒక కమ్యూనిటీ సోక్ పిట్ నిర్మాణం చేపట్టాలని, శ్రమదానం ద్వారా పల్లెలను పరిశుభ్రం చేయాలని చెప్పారు. ఈ నెల 7 వ తేదీన పల్లెనిద్ర చేసి 8వ తేదీన అన్ని గ్రామాలలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని, గ్రామంలో ఉన్న అన్ని రకాల ట్రాక్టర్లు బుల్డోజర్ వంటి వాటిని ఉపయోగించుకుని పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. అలాగే గ్రామంలో నీరు నిలువ ప్రదేశాలన్నింటిని గుర్తించి నీరు నిల్వ ఉండకుండా పూడ్చి వేయాలని,దోమలు రాకుండా అరికట్టాలని చెప్పారు. ప్లాస్టిక్ వినియోగంపై ప్రజల ల్లో అవగాహన కల్పించి ప్లాస్టిక్ వాడకుండా చూడాలని అన్నారు. ఎక్కడైనా తాగునీటి లీకేజీలు ఉన్నట్లయితే వెంటనే వాటిని అరికట్టాలని, కుక్కల బెడద ఇటీవల ఎక్కువైనందున ప్రజలు కుక్కల బారిన పడకుండా చూడాలని అన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో అన్ని ఇండ్లకు మిషన్ భగీరథ తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు వచ్చే ఆస్కారం ఉన్నందున అన్ని పాఠశాలలు, అంగన్వాడీలలో విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం అవకాశం ఉన్నచోట దాతల సహకారం తీసుకోవాలని, ప్రత్యేకించి పురాతన కట్టడాలను పరిశుభ్రం చేయటం, వాటిని పరిరక్షించడం చేయాలని, గ్రామాలలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ కింద కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.స్వచదనం, పచ్చదనంపై ఈ నెల 3 న అన్ని గ్రామాలలో సంబంధిత సిబ్బందితో సమావేశం నిర్వహించి కార్యక్రమ ప్రణాళిక రూపొందించి రూపొందించాలని ఆదేశించారు. స్వచ్చదనం,పచ్చదనం కార్యక్రమంలో అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలని ఆయన ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, డి ఎఫ్ ఓ రాజశేఖర్, ఇతర జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, తదితరులు ఈ వీడియో కాన్ఫెరెన్స్ కుహాజరయ్యారు.