కేసీఆర్‌ ప్రభుత్వంలో గ్రామాలన్నీ సస్యశ్యామలం

– ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి
– పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుతో త్వరలో సాగునీరు ఎలిమినేడులో అభివృద్ధి పనులు ప్రారంభం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంలో గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతున్నాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో వివిధ అభివృద్ది పనులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతో అధిక నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. గత పాలకుల తీరుతో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు తెలంగాణ ప్రభుత్వంలో రూపురేఖలు మార్చుకున్నాయన్నారు. అభివృద్ధిలో పట్టణాలకు ధీటుగా పోటీ పడుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ ఫలాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు కేసీఆర్‌ రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, దళితబంధు ఇలా ఎన్నో పథకాలు తెచ్చారని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో త్వరలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సాగునీరు అందునున్నట్టు తెలిపారు. త్వరలో ఫాక్స్‌ కాన్‌ కంపెనీలో యువతకు 30 వేల ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రభుత్వం హ్యాట్రిక్‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్‌ సత్తు వెంకటరమణరెడ్డి, ఎంపీపీ కృపేష్‌, వైస్‌ ఎంపీపీ ప్రతాప్‌ రెడ్డి, సర్పంచ్‌ అశోకవర్ధన్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మహేందర్‌ రెడ్డి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.