
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆళ్ళపల్లి మండలంలో నెలకొన్న నీటి పారుదల, విద్య, వైద్య, వ్యవసాయ, తదితర శాఖల సంబంధిత సమస్యలను స్థానిక ఎంపీపీ, జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షురాలు కోండ్రు మంజు భార్గవి లేవనెత్తారు. ఆయా శాఖల పనితీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగా ప్రస్తుత సీజన్లో మండలంలోని రైతులు సాగు పరంగా ఎదుర్కొంటున్న కలుపుమందు పిచికారి సమస్యల్ని, పీఏసీఎస్ లో యూరియా కొరత, తదితర సమస్యలను వివరించారు. అలాగే కొందరు గ్రామీణ వైద్యులు పరిధికి మించి వైద్యం చేసి ప్రాణాలు తీస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వాటితో పాటు మండలంలో సుమారు 6 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు వెలుగులోకి తెచ్చి, రికవరీ చేయాలని, సంబంధిత బాధ్యులపై చర్యలు చేపట్టాలని లోపాలు తెలిపారు. దాంతో పాటు మండల కేంద్రంలో 200 మంది బాలికలు ఉన్న కేజీబీవీ నూతన భవనానికి సౌకర్యం, రక్షణగా ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టాలని, ప్రభుత్వ ఆసుపత్రి పని గంటలను 12 నుంచి 24 గంటలు చేయాలని, మండలంలో గోడౌన్ ఏర్పాటు చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన పలు శాఖల అధికారులు, ఉద్యోగులపై, తదితర అంశాలపై కలెక్టర్ ప్రియాంక ఆలకు ఫిర్యాదు రూపంలో వినతి పత్రం అందజేశారు.