– మిత్తీలు పెరిగి తలలు పట్టుకుంటున్న కాంట్రాక్టర్లు
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి మండల ప్రజా పరిషత్ పనుల బిల్లులు చెల్లింపులో ఎక్కువ ఆలస్యం కావడంతో వివిధ విభాగాల్లో గుత్తా పనులు చేపట్టిన పలువురు నిర్వాహకులు చెక్కు డబ్బులు రాక కొన్ని నెలలుగా వడ్డీకి తెచ్చిన డబ్బులకు మిత్తీ(వడ్డీ)లు కట్టలేక తలలు పట్టుకుంటున్నారు. ఆరు నెలల క్రితం ఆళ్లపల్లి మండల పరిషత్ లో ఉన్న నిధుల ద్వారా పనులు చేపట్టేందుకు నలుగురు ఎంపీటీసీలు సమావేశమై వారి పరిధిలో ఉన్న సమస్యపై దృష్టిపెట్టి ఆయా నిధులతో పనులు చేపట్టేందుకు ఎంపీడీవో ఆధ్వర్యంలో కొందరు వ్యక్తులకు నియమించుకుని వారికి పనులు అప్పగించారు. కాగా, అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం పనులు పూర్తి చేసినప్పట్టికి రెండు నెలలుగా ఎంపీడీవో కార్యాలయంలో సంబంధిత బిల్లుల చెక్కులు జారీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు మండలంలో గుత్తేదారుల, ప్రజల నోట వినికిడి. దాంతో పనులు చేపట్టిన గుత్తేదారులు చేసిన పనులపై పెట్టిన పెట్టుబడి వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల ఆలస్యంపై ఎంపీపీ, వైస్ఎంపీపీ పలు దఫాలు గత, ప్రస్తుత ఎంపీడీవోలతో సమావేశాలు జరిగినప్పటి అనేక సాకులు చెప్పుకొస్తు దాటవేసినట్టు విశ్వసనీయ సమాచారం. మండలంలో పనికాదని భావించిన ఆళ్ళపల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి బిల్లుల విషయంపై జిల్లా అధికారులను ప్రశ్నించగా, ఉన్నపళంగా జిల్లా అధికారులు ఆళ్ళపల్లి ఎంపీడీవోకు ఫోన్ చేసి, రికార్డులు పరిశీలించి తక్షణం చెక్కుల విషయంలో ఆలస్యం చేయవద్దని ఆదేశించారు. అయినా రెండు వారాలు గడిచాయే గాని, చెక్కుల విషయంలో మండల పరిషత్ అధికారులు మౌనం వీడలేదు, గుత్తేదారుల బిల్లుల సమస్య తీరలేదు. ఈ నేపథ్యంలో పనులు జరుగుతున్న సమయంలో ఉన్న ఎంపీడీవో బదిలీపై మరోచోటికి వెళ్ళడం, ప్రస్తుత ఎంపీడీవో సెలవు పెట్టడం, మరోదారి లేక ఇటీవల స్థానిక ఎంపీఓను ఎంపీడీవోగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఉత్తర్వులు ఇవ్వడం వెరసి స్థానిక మండల ప్రజా పరిషత్ అభివృద్ధి నిధులతో పనులు చేపట్టిన గుత్తేదారుల బిల్లుల సమస్య మరింత జాప్యం అయ్యేలా కనిపిస్తోంది. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి మా బిల్లులు మంజూరు చేయాలని గుత్తేదారులు వేడుకుంటున్నారు.