భావ సారూప్య పార్టీలతో పొత్తు

Alliance with like-minded parties– బీజేపీ ప్రమాదాన్ని నివారించడమే లక్ష్యం
– ఇండియా కూటమితో మోడీకి భయం
– బీఆర్‌ఎస్‌ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు
– మా పార్టీ నిర్ణయించిన స్థానాల్లో పోటీ చేస్తాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ – నిడమనూరు
”మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా సీపీఐ(ఎం) మొదటి నుంచి ఖచ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉంది.. ఈ దేశానికి ప్రమాదకరమైన బీజేపీ ఎదుగుదలను నిలువరించడమే మా లక్ష్యం.. బీజేపీ, దాని అనుబంధ సంఘాల విధానాలకు, మోడీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది.. మాతో భావ సారూప్యం గల పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో మోడీ పతనం ప్రారంభమైందన్నారు. ఇండియా కూటమి విధానాలతో మోడీకి భయం పట్టుకుందని చెప్పారు. దేశం పేరును మార్చి భారత్‌ అని పిలవాలని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి భయానికి నిదర్శనమన్నారు. ఇండియా కూటమి పేరును ఉచ్చరించడానికే భయపడుతున్నారన్నారు. దేశం పేరు మారిస్తే దేశ ప్రజల బతుకులు మారవన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు తీసుకురావడం హర్షనీయమైనప్ప టికీ అమలుకు కాలయాపన సరైనది కాదన్నారు. ఈ బిల్లు పేరుతో మహిళల్లో సానుభూతి పొందాలన్న ఆలోచన తప్ప దాని అమలులో చిత్తశుద్ధి లేకపోవడం దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. జన గణనతోపాటు కుల గణన జరగాలని కోరారు. గతంలో బీజేపీ తెలంగాణలో పాగా వేసి అధికారంలోకి రావాలని కుట్రలు చేసిందని, దానిని కమ్యూనిస్టులు అడ్డుకున్నారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు బీజేపీికి వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. బీజేపీకి అనుకూ లంగా ఇప్పుడు కేసీఆర్‌ మాట్లాడుతున్నారని, ఎన్డీఏ అధికారంలోకి వస్తే మా భాగస్వామ్యంతోనే సాధ్యమనే విధంగా బీఆర్‌ఎస్‌ పార్టీ మంత్రులనోట వింటున్నామని అన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్‌ ద్వంద్వ వైఖరిని గమనిస్తున్నార న్నారు. ఇండియా కూటమిలోని ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలతో బీఆర్‌ఎస్‌ బెంబేలు ఎత్తుతుందని, కాంగ్రెస్‌ హామీలను విమర్శించడం తప్ప కొత్తగా హామీలు ఇవ్వలేకపోతోందని చెప్పారు. దీనికి కారణం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడమేనన్నారు. సీపీఐ(ఎం) దేశవ్యాప్తంగా ఇండియా కూటమితో కలిసి పనిచేస్తుందని, తెలంగాణలో పార్టీ నిర్ణయించుకున్న స్థానాల్లో పోటీలో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూల కంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, బండ శ్రీశైలం, చినపాక లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, ఎండి హషం తదితరులు పాల్గొన్నారు.