పెద్దన్న పాత్రతోనే తంటా విడిపోతున్న మిత్రపక్షాలు

It kicks with the older character Parting allies– కొత్త పొత్తుల కోసం కమలదళం వెంపర్లాట
– బీజేడీ, టీడీపీతో చెలిమి
– ‘వైనాట్‌ 400’ కోసం శత్రువులే మిత్రులవుతున్న వైనం
లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి భాగస్వామ్య పక్షాలతో బీజేపీ జరుపుతున్న చర్చలు ఓ అడుగు ముందుకు… రెండు అడుగులు వెనక్కి అనే తరహాలో సాగుతున్నాయి. తాజాగా హర్యానాలో మిత్రపక్షమైన జన్‌నాయక్‌ జనతా పార్టీ (జేజేపీ)తో చర్చలు విఫలం కావడంతో ఖట్టర్‌ ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. స్వతంత్ర సభ్యుల మద్దతుతో ప్రస్తుతానికి బీజేపీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకో గలిగింది. అధికార కూటమిలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ బీజేపీ నేతలు ప్రతిపక్ష ఇండియా కూటమిని వేలెత్తి చూపుతున్నారు. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య లుకలుకలు తలెత్తాయని చెప్పుకుంటూ సంబరపడిపోతున్నారు.
న్యూఢిల్లీ : బీజేపీ కొత్త పొత్తుల కోసం వెంపర్లాడుతోంది. తాజాగా హర్యానాలో అధికార బీజేపీ, జేజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తడంతో మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ సర్కారు పతనమైంది. లోక్‌సభ ఎన్నికల్లో తనకు ప్రతిష్టాత్మక రోహ్తక్‌ సహా రెండు స్థానాలు కేటాయించాలని జేజేపీ కోరగా బీజేపీ అందుకు అంగీకరించలేదు. దీంతో కూటమి విచ్ఛిన్నమైంది. ఇలాంటి పరిస్థితులు మరెక్కడ ఏర్పడతాయోనన్న భయం పెద్దలను వెంటాడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకి 400 స్థానాలు లభిస్తాయని బీరాలు పలుకుతున్న ప్రధాని మోడీకి ఈ పరిణామం ఎదురు దెబ్బేనని చెప్పాలి.
విపక్షాలతో చేతులు కలిపి…
లక్ష్య సాధన కోసం ఇప్పటి వరకూ విపక్షాలుగా ఉన్న బిజూ జనతాదళ్‌ (ఒడిషా), తెలుగుదేశం (ఆంధ్రప్రదేశ్‌) పార్టీలకు కమలదళం స్నేహహస్తం అందించింది. ఒడిషాలో నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌ పార్టీ ప్రభుత్వాన్ని బీజేపీ ఎప్పటి నుండో విమర్శిస్తూ వస్తోంది. ఆ రాష్ట్రంలో ఎలాగైనా ప్రతిపక్ష స్థానాన్ని సొంతం చేసుకోవాలని పావులు కదుపుతోంది. అయితే ఇప్పుడు పార్టీ రాష్ట్ర నేతల అభిప్రాయాలను బేఖాతరు చేస్తూ ఒడిషాలో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీజేడీతో చేతులు కలిపేందుకు మోడీ-షా ద్వయం ప్రయత్నిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో 2018లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. అప్పటి నుండీ టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించే ఏ అవకాశాన్నీ బీజేపీ రాష్ట్ర నేతలు వదులుకోలేదు. ఆయనను అవినీతిపరుడని, నైతికత లేని వ్యక్తి అని, అవకాశవాది అని నిందించారు. అవినీతి ఆరోపణలపై చంద్రబాబును జగన్మోహన రెడ్డి ప్రభుత్వం అరెస్ట్‌ చేసినప్పుడు బీజేపీ సహకరించిందన్న ఊహాగానాలు కూడా వినవచ్చాయి. అయితే తాజాగా ఆ రాష్ట్రంలో సీను మారిపోయింది. జగన్మోహన రెడ్డిని వదిలేసి చంద్రబాబును భాగస్వామిగా బీజేపీ ఎంచుకుంది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో టీడీపీతో సీట్ల సర్దుబాటు కుదుర్చుకుంది.
అక్కున చేరిన నితీష్‌
బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌పై రెండు సంవత్సరాల పాటు తీవ్ర విమర్శలు గుప్పించిన బీజేపీ పెద్దలు ఇటీవలే ఆయనను అక్కున చేర్చుకున్నారు. ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నితీష్‌తో చేయి కలిపేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు. నితీష్‌ నేతృత్వంలోని ఐక్య జనతాదళ్‌ను చీల్చి, ఆయన ప్రభుత్వాన్ని కూలదోసిన విషయాన్ని మరిచిపోయారు. బీహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోందంటూ చేసిన ఆరోపణలనూ విస్మరించారు. ఏ మాత్రం రెండో ఆలోచన లేకుండా నితీష్‌ను ఎన్డీఏలో చేర్చుకుంది.
నాడు వదిలేసిన వారికే స్నేహహస్తం
నిజం చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీల కంటే బీజేపీయే నూతన భాగస్వాముల ఎంపికలో ముందు నిలిచింది. అయితే వాటిని గౌరవించే విషయంలో మాత్రం దారుణంగా వ్యవహరించింది. 2017లో జరిగిన ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తన ఓబీసీ భాగస్వాములైన ఓం ప్రకాష్‌ రాజ్‌భర్‌, స్వామి ప్రసాద్‌ మౌర్యలను కరివేపాకులా తీసిపారేసింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి రాజ్‌భర్‌తో మరోసారి చేయి కలిపింది. మౌర్యను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
దూరమవుతున్న మిత్రపక్షాలు
ఎన్డీఏలో బీజేపీ పోషిస్తున్న పెద్దన్న పాత్ర కారణంగా మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా ఆ పార్టీకి దూరమవుతున్నాయి. శివసేన, శిరోమణి అకాలీదళ్‌ (బాదల్‌), ఒకప్పుడు ఐక్య జనతాదళ్‌ ఈ కోవలోకే వస్తాయి. మిత్రులు దూరమవుతున్నప్పటికీ బీజేపీ తన నిరంకుశ పోకడలు విడనాడడం లేదు. పైగా వాటిని భయపెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది. ఆయా పార్టీలను చీల్చే ప్రయత్నం చేస్తోంది. రాజకీయంగా సంక్షోభాలు ఏర్పడినప్పటికీ ధనబలం, మందబలంతో వాటిని ఎదుర్కోగలనని ధీమాగా ఉంది.
మోడీ నేతృత్వంలోని బీజేపీ కార్యకలాపాలలో సిద్ధాంతాలు, విలువలకు చోటే ఉండదు. చిన్న చిన్న పార్టీలే అయినప్పటికీ కీలక రాష్ట్రాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న పక్షాలను కమలదళం దువ్వుతుంటుంది. ఆ తర్వాత ఆయా పార్టీలతో బీజేపీ వ్యవహరించే తీరుకు హర్యానా ఉదంతమే తాజా ఉదాహరణ. మహారాష్ట్రలో సైతం బీజేపీ, మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. బీజేపీ 30-32 స్థానాలలో పోటీకి దిగుతోందని, షిండే వర్గానికి 11-12 సీట్లు, అజిత్‌ పవార్‌ వర్గానికి 4-5 సీట్లు ఇవ్వబోతోందని వార్తలు వస్తున్నాయి. ఆరు స్థానాలపై మాత్రం మూడు పార్టీల మధ్య అంగీకారం కుదరడం లేదు.
బీజేపీ తనకున్న వనరుల కారణంగా భాగస్వామ్య పక్షాలను సమకూర్చుకోగలుగుతోంది. అయితే వాటి స్వతంత్ర డిమాండ్ల విషయంలో అలసత్వాన్ని ప్రదర్శి స్తోంది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో సంబంధాలు పుటుక్కు మని తెగిపోతున్నాయి. భాగస్వామ్య పక్షానికే వెన్నుపోటు పొడిచిన ఉదంతాలు బీజేపీ చరిత్రలో మనకు కన్పిస్తాయి.