రాష్ట్రానికి సరిపడా కందిపప్పు కేటాయించండి

– రూ.1,187 కోట్ల పెండింగ్‌ నిధులను విడుదల చేయండి
– పీఎంయూవై కింద 60 లక్షల దీపం కనెక్షన్లను మార్చండి : కేంద్ర మంత్రులకు ఏపీ మంత్రి నాదెండ్ల వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్రానికి సరిపడా కందిపప్పు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ కోరారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కలిశారు. ఈ మేరకు ఆయన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి కందిపప్పు కేటాయింపులు చేయాలని కోరినట్టు తెలిపారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కవరేజీ కాకుండా లబ్దిదారుల కవరేజీని మరింత పెంచాలని కోరినట్టు చెప్పారు. రాష్ట్రంలో మరో ఎనిమిది ప్రెస్‌ రిపోర్టింగ్‌ కేంద్రాలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ధరల స్థిరీకరణకు రూ.532 కోట్ల నిధులను కేటాయించాలని కోరినట్లు చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.1,187 కోట్ల పెండింగ్‌ నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని డిమాండ్‌ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో 11 సిలో గోడౌన్ల నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన తరువాత ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఈ అంశాలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని మంత్రి మనోహర్‌ తెలిపారు. ఏపిలో ప్రస్తుతం ఉన్న 60 లక్షల దీపం కనెక్షన్లను పీఎంయూవై పథకం కింద వచ్చే విధంగా మార్చాలని కేంద్ర పెట్రోలియం మంత్రిని కోరినట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు రాసిన లేఖను కేంద్రమంత్రికి అందజేశానని అన్నారు. ఈ అంశాన్ని పరిశీలించి, చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని మంత్రి మనోహర్‌ పేర్కొన్నారు.