బీసీ సంక్షేమానికి రూ.20 వేలకోట్లు కేటాయించండి

– ఆర్థిక శాఖ మంత్రి భట్టికి ఎమ్మెల్సీ కవిత లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీసీ సంక్షేమం కోసం 2024-25 బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె లేఖ రాశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత, బీసీ సంక్షేమానికి రానున్న ఐదేండలో రూ. లక్ష కోట్ల కేటాయింపు, ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రతి జిల్లా కేంద్రంలో రూ.50 కోట్ల వ్యయంతో ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ బీసీ ఐక్యత భవనాల నిర్మాణం, తదితర హామీలను ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ హామీల అమలును ఈ బడ్జెట్‌ నుంచే చేపట్టాని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హమీలు అమలు కావాలంటే ప్రతి ఏటా రూ. 20 వేల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.