నవతెలంగాణ మల్హర్ రావు కాటారం: కాటారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమవుతుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక వైటీసీలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుకు పూనుకోగా, వారం రోజుల్లో కార్యాలయాన్ని ముస్తాబు చేశారు. ఐటీడీఏ నిధులతో వైటీసీలో గదుల ఆధునీకరణ, విద్యుత్, తాగు నీటి ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.
కాటారం సబ్ కలెక్టర్గా ప్రభుత్వం ఐఏఎస్ అధికారి మయాంక్ సింగ్ ప్రభుత్వం నియమించడంతో శుక్రవారం ఆయన జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. దీంతో కార్యాలయం ప్రారంభం త్వరలోనే జరిగే అవకాశం ఉంది. ఇదే క్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు సిబ్బందిని సమకూర్చారు. జిల్లాలోని పలు మండలాల్లో పనిచేస్తున్న ఆయా కేటగిరీలకు చెందిన సుమారు 15మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇందులో డీఏఓ(ఎఫ్ఎసీ), ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఒక్కరు డిప్యూటీ ఎస్ఓ, ముగ్గురు జూనియర్ అసి స్టెంట్లు, ఒక టైపిస్ట్, ఇద్దరు రికార్డ అసిస్టెంట్లు, లుగురు ఆఫీస్ సబార్డినేట్స్, ఒక డ్రైవర్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి డిప్యూటేషన్ చేస్తూ కలెక్టర్ రాహుల్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు.