ఆరునెలలు సాము చేసిన సీఎం రేవంతరెడ్డి సర్కార్ గురువారం నాడు సమర్పించిన బడ్జెట్ తీరు చూస్తే అమలు మీద ఎవరికైనా సందేహం కలుగుతుంది.గతంలో బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన జిమ్మిక్కుల కొనసాగింపుగానే కనిపిస్తున్నది. మార్చినెలతో ముగిసిన సంవత్సర బడ్జెట్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.రెండు లక్షల 90వేల కోట్లతో ప్రవేశపెట్టింది.ఇప్పుడు రేవంత్‌రెడ్డి మరోవెయ్యి కోట్లు ఎక్కువ చేసి ప్రతిపాదించారు.బీఆర్‌ఎస్ బడ్జెట్‌లో 64వేల కోట్ల మేరకు కోత పెట్టి రెండు లక్షల 26వేల కోట్లకు సవరించారు. గతేడాది రాబడి రెండులక్షల 16వేల కోట్లని అంచనా వేస్తే, వచ్చింది 1.69లక్షల కోట్లే అయినా కాంగ్రెస్ సర్కార్ 2.21లక్షల కోట్లు రాబడతామని పేర్కొన్నది. అందుకే ఇది వాస్తవాల ప్రాతిపదికన లేదని చెప్పాల్సి వస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాల అమలుకు నిధులెక్కడి నుంచి తెస్తారన్నపుడు ‘మా ఆలోచనలు మాకున్నాయి, చూస్తారుగా, మనసుంటే మార్గం ఉంటుంది’ అంటూ దాటవేశారు. వాటి సంగతేమోగానీ ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క చెప్పినదాని ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 35,118 కోట్ల రుణాలు తెచ్చి గత ప్రభుత్వం చేసినదానికి గాను 42,892 కోట్ల అప్పుతీర్చారు. పరిస్థితి ఈ విధంగా ఉన్నపుడు చేసిన వాగ్దానాలను ఎలా అమలు జరుపుతారన్నదే ప్రశ్న. ఇక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుల రుణాల రద్దుకు చేసిన కసరత్తును చూస్తే మిగతా చోట్ల కోతలు పెట్టి దానికి కేటాయింపులు చేశారు తప్ప మంత్రదండంతో రాబడిని సృష్టించే తీరు కనిపించలేదు. రుణమాఫీ మొత్తం ఉన్న కారణంగా వ్యవసాయం-సహకార రంగానికి కేటాయింపు 28,594 కోట్ల నుంచి 49,383 కోట్లకు పెంచారు. ఇది హర్షణీయమే, కానీ దీని కోసం చేసిన గారడీ ఏమిటి? సంపదలను సృష్టించేందుకు చేసే మూలధన వ్యయం గతేడాది చేసిన 44,252 కోట్లను 33,486కు తగ్గించారు. సాగునీటి ప్రాజెక్టుల పద్దులో గతేడాది సవరించిన బడ్జెట్ మొత్తం 29,766 కోట్లకు గాను ఈ ఏడాది 22,285 కోట్లకు కోత పెట్టారు. ఈ తీరుతో సాగునీటి ప్రాజెక్టులు రానున్న రోజుల్లో నత్తనడక నడుస్తాయి.రుణమాఫీతో రైతాంగానికి ఒకేడాది లబ్ది చేకూరితే ప్రాజెక్టులు పూర్తిగాకపోతే కొన్నేండ్లపాటు నష్టపోతారని వేరే చెప్పనవసరం లేదు.
పేదలు, బడుగు వర్గాలు కార్పొరేట్ ఆసుపత్రుల వైపు చూస్తే లేని రోగాలు వస్తాయని భయపడుతున్న స్థితి. అందువలన వైద్య, ఆరోగ్యరంగాలకు బడ్జెట్ పెంచితేనే ప్రభుత్వ ఆసుపత్రులు, వాటిలో పరికరాలు, ఔషధాల సరఫరాకు వీలుంటుంది. కానీ చేసిందేమిటి? గత బడ్జెట్‌లో 12,161 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది 9,135 కోట్లే, ఈ ఏడాది కేటాయింపే 11, 468 కోట్లు చేశారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖలో కూడా ఇంతే, 4,037 కోట్లు కేటాయించి చేసిన ఖర్చు కేవలం 567 కోట్లు కాగా ఈ ఏడాది ప్రతిపాదనే 2,762 కోట్లకు కుదించారు. పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖలో గతేడాది ఏడువేల కోట్లు కోతపెట్టారు. ఇలా అనేక రంగాల్లో జరిగింది. దీనికి బాధ్యతను కేవలం కాంగ్రెస్ సర్కార్ మీదనే మోపటం లేదు. బీఆర్‌ఎస్ సర్కార్ గత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలలు అధికారంలో ఉంది. ఎన్నికల సంవత్సరం గనుక బడ్జెట్‌ను గొప్పగా భారీ మొత్తంతో రూపొందించింది. అంతకు ముందు సంవత్సరలో ఖరారైన బడ్జెట్ 2.04లక్షల కోట్లే అయినా ఓటర్లను ఆకర్షించేందుకు 2.9లక్షల కోట్లతో జనాన్ని ఊరించింది. రేవంత్‌రెడ్డి బడ్జెట్‌లో కూడా ఆ ఛాయలు ఉన్నాయి. త్వరలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ కసరత్తు చేశారని వేరే చెప్పనవసరం లేదు.
గత ప్రభుత్వం భారీ మొత్తంలో అప్పులు చేసిన మాట వాస్తవం. ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నది. ఈ ఏడాది 62వేల కోట్ల మేర రుణాలు తీసుకోనున్నట్లు ప్రతిపాదించారు. ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలకు లోబడి తీసుకున్న రుణాలు మార్చి నెలాఖరుకు 4.02లక్షల కోట్లుంటే వచ్చే మార్చి ఆఖరుకు 4.51లక్షల కోట్లకు చేరతాయని అంచనా వేశారు. ‘లంకెబిందెలు ఉన్నాయనుకొని చూస్తే అలాంటివేమీ లేవని’ వ్యాఖ్యానించిన రేవంత్‌రెడ్డి దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదని తేలింది. ఈ ఏడాది బడ్జెట్‌లోటు 49వేల కోట్లు, పన్నేతర ఆదాయం 23,819 కోట్ల నుంచి 35,208కోట్లకు పెంచుతామన్నారు. భూము లమ్ముతారా? మద్యం రేట్లు పెంచుతారా? మరేదైనా చేస్తారో తెలియదు.గత ప్రభుత్వం గ్రాంట్ల ద్వారా 41,259 కోట్లు వస్తా యని చూపితే వచ్చింది కేవలం 9,729కోట్లు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని 21,636కోట్లకు పెంచింది. రైతుల రుణమాఫీకే నిధుల సమీకరణకు నానా తిప్పలు పడుతున్న కారణంగానే అనేక ఎన్నికల వాగ్దానాల ఊసే ఈ బడ్జెట్‌లో లేదు. కేటాయింపులు భారీగా చేసి, ఆ నిధులను ఖర్చు చేయకపోతే ఏం ఉపయోగం?