– ప్రస్తుతం కోట్ల రూ భూమిని విక్రయిస్తాం అంటున్నారు
– తహశీల్దార్ కు వినతి పత్రం అందజేసిన స్థానికులు
నవతెలంగాణ – రాయపర్తి
దళిత గిరిజన వెనుకబడిన వర్గాల వారికి చదువుకోవడానికి సరైన సౌకర్యాలు లేవని గ్రహించి ఉచిత వసతితో కూడిన పాఠశాలను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడతామని కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని సొంతం చేసుకొని ప్రస్తుతం విక్రయించేందుకు సన్నహాలు చేస్తున్నారని గ్రహించి స్థానిక ప్రజలు శుక్రవారం మండల కేంద్రంలోని మండల మెజిస్ట్రేట్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కిష్టాపురం, మోరిపిరాల గ్రామస్తులు మాట్లాడుతూ 23 సంవత్సరాల క్రితం యేర్రంరెడ్డి లవకుశ రెడ్డి వారి తల్లిదండ్రులైన రామచంద్ర రెడ్డి – నర్సమ్మ జ్ఞాపకార్థం గ్రామ శివారులోని 446 సర్వే నెంబర్ లో 13 ఎకరాల 26 గుంటలను జియ్యర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారికి భూదానం చేసినట్టు తెలిపారు. భూదానానికి ముఖ్య కారణం గ్రామీణ ప్రాంతంలో వెనుకబడిన యువత కోసం గురుకుల ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను చేపడతామని చెప్పడంతో భూమిని వారికి ఇచ్చినట్లు వివరించారు. గతంలో జియ్యర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు గ్రామాల నుండి 20 మంది యువకులను ఉపాధ్యాయ శిక్షణ కొరకు విజయవాడలోని జియ్యర్ ఆశ్రమానికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అందులో ఒక యువకుడు గల్లతు కాగా ఇప్పటి అతని ఆచూకీ లేదని చెబుతూ వాపోయారు. తదుపరి సంవత్సరాలు గడుస్తున్న భూదానం చేసిన స్థలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు చివరికి 8 సిమెంట్ పిల్లర్లు ఏర్పాటు చేసి వదిలిపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలియడంతో విక్రయించకుండా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. జియ్యర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు భూమిని విక్రయించకుండా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను, పేద విద్యార్థులకు విద్యా బోధన, వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో వాంకుడోత్ సజ్జన్, కనగంటి కృష్ణ రెడ్డి, యాకుబ్ రెడ్డి, అశోక్, వెంకట్రామ్, భూక్య రవి, కే శ్రీను, విష్ణుమూర్తి, గద్దె ఎల్లయ్య, వల్లపు వెంకన్న, సోమనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.