– ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో హైదరాబాద్
ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. సర్వే నెంబర్.837/1లో 211 ఎకురాల 26.5 గుంటల భూమిని కేటాయిస్తూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం జీవో నెంబర్ 114 జారీ చేశారు. తెలంగాణ విభజన చట్టంలో ఇచ్చిన హమీ మేరకు మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఉన్నత విద్యా శాఖ) ఆధ్వర్యంలో పూర్వపు వరంగల్ జిల్లాలో (ప్రస్తుతం ములుగు జిల్లా) గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లుగా యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రానికి ఎన్ని వినతులు చేసినా ముందు కు సాగలేదు. తాజాగా ఏర్పడిన రేవంత్ సర్కార్ చొరవతో ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఈ క్రమంలో రూ.10 కోట్లకు పైగా విలువ గల భూమిని గిరిజన విశ్వవిద్యాలయానికి ఉచితంగా కేటాయిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.