బీఫార్మసీలో 8,649 మందికి సీట్ల కేటాయింపు

– సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు 11
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, ఫార్మాసూటికల్‌ సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎప్‌సెట్‌ బైపీసీ అభ్యర్థులకు తుది విడత కౌన్సెలింగ్‌లో సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎప్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎప్‌సెట్‌లో 82,163 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని వివరించారు. వారిలో 17,201 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారని తెలిపారు. 10,612 మంది వెబ్‌ఆప్షన్లను నమోదు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 11,060 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. తుది విడత కౌన్సెలింగ్‌లో 10,692 (96.7 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని తెలిపారు. ఇంకా 368 (3.3 శాతం) సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. 127 కాలేజీల్లో 9,002 బీ ఫార్మసీ సీట్లుండగా, 8,649 (96.1 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. ఇంకా 353 (3.9 శాతం) సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. ఎనిమిది విశ్వవిద్యాలయ, ఒక ప్రభుత్వ, 51 ప్రయివేటు కాలేజీలు కలిపి 60 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని వివరించారు. సీట్లు పొందిన అభ్యర్థులకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు ఈనెల 11 వరకు ఉందని తెలిపారు. కాలేజీల్లో రిపోర్టు చేసే గడువు ఈనెల 12 వరకు ఉందని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం https://tgeapcetb.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.