– 22 నుంచి 25 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువు
– ఇప్పటి వరకు 79,505 మంది ప్రవేశం
– ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
– ఆగస్టు 1 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడతలో 72.949 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ, వైస్ చైర్మెన్లు వి వెంకటరమణ, ఎస్‌కె మహమూద్, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు దోస్త్ మూడో విడత సీట్లను గురువారం కేటాయించారు. ఇంట్రా కాలేజీ, ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఒక ప్రకటనలో విడుదల చేశారు. దోస్త్ మూడో విడతలో 79,356 మంది వెబ్‌ఆప్షన్లు నమోదు చేశారని వివరించారు.
మొదటి ప్రాధాన్యత ద్వారా 55,313 మంది, రెండో ప్రాధాన్యత ద్వారా 17,636 మంది విద్యార్థులు సీట్లు పొందారని తెలిపారు. తక్కువ వెబ్‌ఆప్షన్లు నమోదు చేయడం వల్ల 6,407 మంది సీట్లు పొందలేకపోయారని పేర్కొన్నారు. సీట్లు పొందిన వారిలో ఆర్ట్స్ 10,939 మంది, కామర్స్ (బీబీఏ కలిపి) 32,209 మంది, లైఫ్ సైన్సెస్ 16,859 మంది, ఫిజికల్ సైన్సెస్ 12,620 మంది, డీ పార్మసీ 235 మంది, ఇతరులు 87 మంది కలిపి మొత్తం 72,949 మందికి సీట్లు కేటాయించామని వివరించారు. సీటు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ శనివారం నుంచి ఈనెల 25 వరకు చేయాలనీ, కాలేజీల్లో సీసీఓటీపీ సమర్పించి సీటును ధ్రువీకరించుకోవాలని సూచించారు. ఈనెల 27 నుంచి 29 వరకు దోస్త్ ఇంట్రా కాలేజీ విడత ద్వారా వెబ్ ఆప్షన్లను నమోదు చేయాలని తెలిపారు. 31న సీట్లను కేటాయిస్తామని వివరించారు. కాలేజీల్లో సీట్లు ధ్రువీకరించుకున్న విద్యార్థులకే ఇంట్రా కాలేజీ విడతకు అర్హులని స్పష్టం చేశారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రత్యేక విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. అదేనెల 11 వరకు గడువుందని పేర్కొన్నారు. వచ్చేనెల ఒకటి నుంచి 12 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఉంటుందని వివరించారు. 16న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. 16 నుంచి 19 వరకు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. 17 నుంచి 19 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు. అయితే మొదటి విడతలో 45,690 మంది, రెండో విడతలో 33,815 మంది కలిపి 79,505 మంది సెల్ఫ్‌రిపోర్టింగ్ చేశారని వివరించారు. కాగా ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎస్ మహమూద్ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కలిశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ వి వెంకటరమణ పాల్గొన్నారు. ఉన్నత విద్యామండలి మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు.