– కల్వకుంట్ల కవిత దరఖాస్తు
నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్‌లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టు(ట్రయల్ కోర్టు)ను ఆశ్రయించారు. గతంలో ట్రయల్ కోర్టు విధించిన జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల 7తో ముగియనున్న నేపథ్యంలో… తనను కోర్టులో నేరుగా హాజరుపరిచేలా అనుమతివ్వాలని అప్లికేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్రయల్ కోర్టును ఆశ్రయించినట్టు ఆమె తరపు న్యాయవాది మోహిత్ రావు తెలిపారు. గత నెల 23న జ్యుడీషియల్ కస్టడీపై పొడిగింపు సందర్భంగా తీహార్ జైలు నుంచే వర్చువల్ మోడ్‌లో కవిత కోర్టులో హాజరైనట్లు తెలిపారు. అయితే ఈ సారి ఆమె కోర్టు ముందు నేరుగా హాజరుకావాలని కోరుకుంటున్నట్టు మోహిత్ రావు కోర్టుకు సమర్పించిన దరఖాస్తులో మెన్షన్ చేశారు. కాగా లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈ ఏడాది మార్చి 15 న ఈడీ, ఏప్రిల్ 11 న సీబీఐలు కవితను అరెస్ట్ చేశాయి. అనంతరం ఆమెకు ట్రయల్ కోర్టు 14 రోజులు చొప్పున మొత్తం మూడుసార్లు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం తీహార్ జైల్‌లో ఉన్న కవిత ఈడీ, సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా స్పెషల్ జడ్జ్ కావేరి బవేజ ఈ నెల 6 కు తీర్పు రిజర్వ్ చేశారు. అయితే 6న ఆమెకు బెయిల్ మంజూరు రాకపోతే, 7న ఆమె జ్యుడీషియల్ కస్టడీపై విచారణ జరగనుంది.
మరోవైపు ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరిస్తే, ఢిల్లీ హైకోర్టుకు వెళ్లేందుకు ఆమె తరపు న్యాయవాదులు యోచిస్తున్నట్లు తెలిసింది. గతంలో మైనర్ కొడుకు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేయగా, ఈ బెయిల్ ఇచ్చేందుకు ఇది సరైన కారణం కాదంటూ ట్రయల్ కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది.