అల్లు అర్జున్‌ మా అన్నయ్య అని చెప్పే రోల్‌ చేశా..

Allu Arjun did a role saying that he is my elder brother..రావు రమేష్‌ కథానాయకుడిగా రూపొందిన ‘మారుతి నగర్‌ సుబ్రమణ్యం’లో ఆయన కుమారుడిగా అంకిత్‌ కొయ్య నటించారు. దర్శకుడు సుకుమార్‌ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్‌ సినిమాస్‌, లోకమాత్రే సినిమాటిక్స్‌ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్‌ కార్య నిర్మించారు. లక్ష్మణ్‌ కార్య దర్శకత్వం వహించారు. ఈనెల 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత్‌ కొయ్య మీడియాతో పలు విశేషాలను పంచుకున్నారు.
– మాది విశాఖ. గీతం యూనివర్సిటీలో బీటెక్‌ చేశా. కాలేజీలో కల్చరల్‌ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్‌ చేశాను. అక్కడి నుంచి మెల్లగా యాడ్స్‌, సినిమాల్లోకి వచ్చాను. కాలేజీలో ఉండగా అల్లు అర్జున్‌తో ఓఎల్‌ఎక్స్‌ యాడ్‌లో నటించే అవకాశం వచ్చింది. ఆడిషన్‌ చూసి అల్లుఅర్జున్‌ స్వయంగా నన్ను ఎంపిక చేశారు.
– ‘మజిలీ’, ‘జోహార్‌’, ‘అశ్వత్థామ’, ‘తిమ్మరుసు’, ‘శ్యామ్‌ సింగ రారు’, ‘సత్యభామ’, రీసెంట్‌గా ‘ఆరు’తో పాటు ఇంకొన్ని సినిమాల్లో నటించాను. అలాగే రైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో కూడా వర్క్‌ చేశా. ఈ సినిమాలోని కొడుకు పాత్రకు ఇంద్రజ నన్ను సజెస్ట్‌ చేశారు. ఓ సినిమాలో మేం తల్లీకొడుకులగా చేశాం. ఆ మూవీ ఇంకా విడుదల కాలేదు.
– దర్శకుడు సుకుమార్‌ని కలిసే అవకాశం ఇంకా రాలేదు. అయితే మా సినిమా చూశాక ఆయన అందరి గురించి బాగా చెప్పారని దర్శకుడు లక్ష్మణ్‌ చెప్పారు. సుకుమార్‌, తబిత దంపతుల దృష్టికి వెళ్లేలా లక్ష్మణ్‌ సినిమా పబ్లిసిటీ చేశారు. నిహారికతో మా దర్శకుడు లక్ష్మణ్‌ ‘హ్యాపీ వెడ్డింగ్‌’ సినిమా చేశారు. ఆమె ఈ సినిమాని వదులుకోకు అని చెప్పారు. నిహారిక ‘పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌’కు వచ్చే కథలు ఫిల్టర్‌ చేసి ఆవిడ దగ్గరకు నేను పంపిస్తా. ‘ఆయ్’ విజయం ఈ సినిమాతోనూ కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నా.
చిన్నప్పుడు ఇంట్లో ఏడిపిస్తారు కదా… ‘నువ్వు మాకు పుట్టలేదు. ఎక్కడి నుంచో తీసుకు వచ్చాం’ అని! నా క్యారెక్టర్‌ ఏమిటంటే… ‘నేను ఈ ఇంట్లో పుట్టలేదు, అల్లు అరవింద్‌ కొడుకును. అల్లు అర్జున్‌ మా అన్నయ్య’ అనుకునే టైపు. ఇటీవల అల్లు అరవింద్‌ని కలిశా. ఆయన ఈ సినిమా ట్రైలర్‌ చూశారు. అందులో నేను అరవింద్‌ కొడుకును అని చెబుతా కదా! ‘ఏవయ్యా… నా కొడుకు అని చెప్పుకొని తిరుగుతున్నావ్‌ అంట. తెలిసింది’ అని సరదాగా అన్నారు. అల్లు ఫ్యామిలీకి, నాకు ఏదో కనెక్షన్‌ ఉందేమో! అల్లు అర్జున్‌తో ‘ఓఎల్‌ఎక్స్‌’ యాడ్‌ చేశా. అల్లు అరవింద్‌ బ్యానర్‌లో ‘ఆరు’ చేశా. ఈ సినిమాలో అల్లు ఫ్యామిలీ మెంబర్‌ అని చెప్పే రోల్‌ చేశా.
– హీరో అంకిత్‌ కొయ్య