అల్లు అర్జున్‌కు బెయిల్‌ మంజూరు

– నాంపల్లి కోర్టు ఆదేశాలు
– షరతులు వర్తింపు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి / సిటీబ్యూరో
సంధ్య థియేటర్‌లో పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటనకు సంబంధించిన కేసులో నిందితుడైన నటుడు అల్లు అర్జున్‌కు శుక్రవారం నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించటంతో పాటు.. రూ.50 వేల పూచీకత్తును చెల్లించాలని షరతులు విధించింది. కాగా, అల్లు అర్జున్‌కు బెయిల్‌ మంజూరు చేయరాదంటూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) వాదించగా.. ఈ కేసులో అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధాలూ లేవనీ, మరోవైపు డిఫెన్స్‌ న్యాయవాదులు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు. మరోవైపు, ఈ కేసుపై హైకోర్టులో విచారణ సాగుతున్నది.