విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరం

Along with studies, sports are essential for students– మండల విద్యాశాఖ అధికారి నర్సమ్మ. 
నవతెలంగాణ – రాయపోల్ 
విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో కూడా రాణిస్తే జీవితంలో అనతి కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని మండల విద్యాశాఖ అధికారి బండి నర్సమ్మ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శరీర దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే చదువుతోపాటు క్రీడలలో రాణిస్తే వారి జీవితంలో నాయకత్వ లక్షణాలతో పాటు అనతికారంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఆస్కారం ఉంటుందన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు మొదటి రోజు వాలీబాల్, ఖో- ఖో క్రీడా పోటీలు వ్యాయామ ఉపాధ్యాయులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పోటీలలో అనాజీపూర్, రాయపోల్, రామారం, వడ్డేపల్లి బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, కేజీబీవీ రాయపోల్ విద్యార్థులు అండర్ -14, అండర్ -17 విభాగాలలో బాల బాలికలకు క్రీడా పోటీలు నిర్వహించబడ్డాయి. రెండవ రోజు శనివారం మిగతా పోటీలు నిర్వహించబడతాయి అనంతరం గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో  మండల నోడల్ ఆఫీసర్ ఏ. సత్యనారాయణ రెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నాగరాజు, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు.