– గుండాలలో ఒకరు మృతి
– తిరుమలాయపాలెంలో ఇద్దరి పరిస్థితి విషమం
నవతెలంగాణ-గుండాల /తిరుమలాయపాలెం
రోజువారి వ్యవసాయ కూలీ పనులకు వెళ్తే గాని పూట గడవని నిరుపేద కూలీలు పిడుగుపాటుకు గురి కావటంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కొడవటంచ గ్రామానికి చెందిన రైతు గొగ్గెల రామస్వామి.. మంగళవారం సాయంత్రం తన పశువులను మేపుకొని ఇంటికి వస్తున్న క్రమంలో అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. అదేసమయంలో రైతు సమీపంలో పిడుగు పడటంతో రైతు అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. దాంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన రైతు మద్ది వీరయ్య వ్యవసాయ భూమిలో మిర్చి పంటలో కలుపు తీసేందుకు మంగళవారం అదే గ్రామానికి చెందిన 8 మంది కూలీలు వెళ్లారు.
మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురవటంతో ఒక్కసారిగా కూలీలంతా దగ్గరలో ఉన్న వేప చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో కూలీలంతా సొమ్మసిల్లిపోయారు. దగ్గర్లో ఉన్న రైతులు వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మద్ది వరమ్మ, గోకనపల్లి సావిత్రి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. పిడుగుపాటుకు గురైన కూలీలకు ప్రకృతి విపత్తు కింద ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని రైతు సంఘం నాయకులు తుళ్లూరు నాగేశ్వరావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొమ్ము శీను ప్రభుత్వాన్ని కోరారు.