త్రాగు నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం: సీ.ఈ శ్రీనివాస్

నవతెలంగాణ – అశ్వారావుపేట
మిషన్ భగీరథ నీటి సరఫరాలో దీర్ఘకాలిక అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ద్వారా మంచినీటి సౌకర్యం కల్పిస్తామని ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ కాషా శ్రీనివాస్ స్పష్టం చేసారు.ఆయన శనివారం మండలంలోని నీటి ఎద్దడి తో బాదపడుతున్న 12 ఆవాసాలు ను పరిశీలించారు. ఇటీవల ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మండలంలో పర్యటించిన సందర్భంగా పలు గ్రామాల ప్రజలు మంచినీటి ఎద్దడిపై విజ్ఞప్తి చేసారు. ఈ విషయాన్ని ఆయన మిషన్ భగీరథ ఉన్నతాధికారులకు పరిష్కారం కోసం రాసారు. ఆయన పిర్యాదు మేరకు శ్రీనివాస్ క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ విద్యుత్ అంతరాయం తోనే మి‌షన్ భగీరథ నీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని తేలిందని అన్నారు. ఇతరాత్రా కారణాలతో నీటి సరఫరా జరగకపోతే ప్రత్యామ్నాయం చూస్తామని అన్నారు. ఆయన వెంట ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుమలేశ్, డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ సలీం, ఎ.ఈ లక్ష్మీలు ఉన్నారు.