నవతెలంగాణ – భువనగిరి
మూసి కాలుష్యం వల్ల భువనగిరి, నల్లగొండ, సూర్యపేట జిల్లాల లక్ష ఎకరాల్లో పంటలు కలుషితం కావడమే గాక ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని మూసి కాలుష్య నివారణకు ప్రత్యామ్నాయాలు అమలు చేయాలని అఖిలభారత కిసాన్ సంఘం జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. శనివారం స్థానిక సుందరయ్య భవనంలో కొండమడుగు నరసింహ, మేక అశోక్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మూసీ ప్రక్షాళన, కృష్ణ గోదావరి జలాల సాధనకై జరిగిన చర్చా గోష్టిలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మూసి నీటితో పండిన పంటను తినడం వల్ల క్యాన్సర్, చర్మ వ్యాధులు, మహిళలకు గర్భకోశ వ్యాధులు అదేవిధంగా అంతుచిక్కని వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు. గత మూడు దశాబ్దాలుగా మూసి కాలుష్య నివారణ కొరకు బడ్జెట్ కేటాయిస్తున్నప్పటికీ, ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నప్పటికీ కాలుష్య నివారణ జరగకపోగా దినదినం కాలుష్యం పెరుగుతున్నదన్నారు. హైదరాబాద్ పట్టణ జనాభా పెరుగుతుండడంతో పరిశ్రమలు పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తున్నారు ప్రధానంగా ఫార్మా, రసాయనిక పరిశ్రమలు, సింథటిక్ బట్టల పరిశ్రమలు, ప్లాస్టిక్ వినియోగం మానవ విసర్జితం అంతా మూసి కాలుష్యాన్ని పెంచుతున్నదన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదివేల కోట్లు మూసి కాలుష్య నివారణకు బడ్జెట్ కేటాయించిన మూసి కాలుష్య నివారణ చేసిన దాఖలాలు లేవని వారు అన్నారు. ఫార్మా కంపెనీలతోపాటు కాలుష్యాన్ని కలిగించే భారీ పరిశ్రమల యజమానులు ప్రభుత్వాన్ని తమ చెప్పు చేతులలో పెట్టుకుని ప్రభుత్వ పథకాల అమలును బలహీనం చేస్తున్నారని తెలిపారు. మరోవైపు భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంగ్లాండ్ లోని ఈతేమ్స్ నది మాదిరిగా ఇక్కడ కాలుష్య నివారణ చేస్తామని ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చివరికి మూసీ నది అక్రమణ పెరగడంతో కాలుష్యం మరింత పెరుగుతున్నదన్నారు.
ప్రస్తుతం మూసి ఆధారితంగా సాగు అవుతున్న పంటలకు బస్వాపురం ప్రాజెక్టు నుండి గోదావరి జలాలు, ఉదయసముద్రం నుండి కృష్ణా జలాలను ప్రత్యామ్నాయంగా అందించాలన్నారు. మూసీ రోజుకు 1650 మిలియన్ గ్యాలరీ లీటర్స్ కాలుష్య నీరు విడుదల చేస్తుండగా 700 మిలియన్ గ్యాలరీ లీటర్స్ నీటిని మాత్రమే శుద్ధి చేస్తున్నారు. శుద్ధి చేసిన నీరు తిరిగి మళ్లీ కాలుష్య నీటిలో కలవడం వల్ల ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. నదిలో ప్రవహిస్తున్న నీటిని పరిశీలిస్తే తెల్లటి నురగలు గాలిలో కలవడం వల్ల గ్రామాల మీద చేరి గ్రామాలలో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయన్నారు. ఇంతటి ప్రమాద కాలుష్య నివారణకు ప్రభుత్వాలు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టడం లేదు, మూసి నీటిలో గల కాలుష్యాన్ని తొలగించి ప్రత్యమ్యంగా స్వచ్ఛమైన త్రాగునీటిని గ్రామాలకు అందించాలన్నారు. కాలుష్య నివారణకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి బడ్జెట్ అమలుకు చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. మూసిపై అధ్యయనం చేసిన పిట్టల శ్రీశైలం మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మూసీ నది ప్రవహిస్తూ ప్రజల జీవన విధానాలను మారుస్తుందని దానివల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిని తొందరగా ప్రాణాలు విడిచే అవకాశం ఉందన్నారు. దీనిపై అఖిలపక్షాలుగా పోరాటం సాగించాలని వారు సూచించారు.మనుషులతో పాటు జీవజాలం చివరకు భూమిలో భూసారం అంతరించి అవకాశం మూసి కాలుష్యంతో ఉందన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా భూసి కాలుష్య నివారణకు అనేక పోరాటాలు నిర్వహించిన పాలకులలో మాత్రం చలనం లేకుండా పోయిందన్నారు. .భవిష్యత్తులో మూసి కాలుష్య నివారణకు కృష్ణా, గోదావరి జలాల సాధనకై దఫళ వారి ఉద్యమాలు చేపడతామని ప్రజలంతా కృష్ణా, గోదావరి జలాల సాధనకై సిద్ధపడాలని వారు పిలుపునిచ్చారు. మూసి పరివాహక ప్రాంత ప్రజలకు మూసి కాలుష్యంతో నష్టాలను వివరించి చైతన్య పరచాలన్నారు. ఈ చర్చ గోస్ట్ లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరు మల్లేశం, దాసరి పాండు, సామాజికవేత్త చెన్నయ్య, బట్టు రామచంద్రయ్య, హమిద్, నాయకులు సిర్పంగి స్వామి, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేష్, బొలగాని జయరాములు,గడ్డం వెంకటేష్, వనం ఉపేందర్,ఈర్లపల్లి ముత్యాలు, గాడి శ్రీనివాస్, బోడ భాగ్య, లావుడ్య రాజు,గంటెపాక శివ, తుర్కపల్లి సురేందర్, రాగీరు కిష్టయ్య, మామిడి వెంకట్ రెడ్డి, పొట్ట శ్రీను, బల్గురి అంజయ్య, పబ్బు నారాయణ, చెర్క వెంకటేష్, కోట రామచంద్రారెడ్డి, ప్రసాదం విష్ణు, ఓవల్దాసు అంజయ్య, హన్మంతు, కవుడే సురేష్, మంచాల మధు, దేవేందర్ రెడ్డి, బుచ్చయ్య పాల్గొన్నారు.