ఫ్యూడల్ నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ పడిన వేదనను, యాతనను నేపథ్యంగా తీసుకుని ‘ప్రజల మనిషి’, ‘గంగు’ అన్న రెండు అద్భుతమైన నవలలు రాసిన రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి (1915-1961). తెంగాణ గోర్కీగా చెప్పుకోవలసిన ఆళ్వారుస్వామికి సాహిత్య చరిత్రలో రావలసినంత గుర్తింపు రానేలేదు. ఆయన రచనల మీద జరగవలసినంత పరిశీలన, పరిశోధన జరగనేలేదు. ‘జైలులోపల’ పేరుతో ఆయన ప్రచురించిన జైలు కథలు, అక్కడక్కడా పత్రికల్లో ప్రచురితమై పుస్తకరూపం తీసుకోని 15కు పైగా కథలు ఇప్పుడు పాఠకులకు అలభ్యం. ‘ప్రజల మనిషి’ నవల కూడా పునర్ముద్రణ కోసం సుదీర్ఘ కాలంగా వేచి ఉన్నది. రచయితగానే కాక, ప్రచురణకర్తగా, సాహిత్య కార్యకర్తగా, కమ్యూనిస్టుగా ఆళ్వారుస్వామి వ్యక్తిత్వం తెలుగు పాఠకులకు మరింత విస్తతంగా పరిచయం కావలసి ఉన్నది. భార్యాభర్తల మధ్య ఉండే ‘ఆర్థిక’ సంబంధాన్ని ప్రతిభావంతంగా వ్యాఖ్యానించిన ‘ఆలు-కూలి’ కథ ఆళ్వారుస్వామిని కొత్తగా పరిచయం చేస్తుంది.
”ఎంతైనా బస్తీ ఆడవాండ్లు.. నమ్మడం కష్టం” అంటూ, రైస్ మిల్లుకు వెళ్ళ సన్నాహపడ్తూ చేతి కర్రను చేతబట్టాడు గోవిందరావు.
భార్య పార్వతమ్మ ఒళ్లు జలదరించింది. ”ఎంత మందికి ప్రేమలేఖలు వ్రాసి తుదకు నా మెడ బడ్డావు” గోవిందరావు మోపిన ఈ నింద అబద్ధమని ఎట్లా ఒప్పించడం?
పార్వతమ్మ తహతహ చెందింది. పార్వతమ్మ పుట్టింటి నుండి వెంట తెచ్చుకున్న కొన్ని పుస్తకాలే గోవిందరావు కోతిగా ఎగురడానికి ప్రధాన కారణము.
కోపంతో గోవిందరావు ఆ పుస్తకాలు తిరగ వేస్తుండగా పైగా ఈ చీటి దొరికింది.
బాల్యము నుండి కలిసి చదివిన నిన్ను విడచి ఒక పల్లెటూరుకు పోతున్నాను. తిరిగి నిన్ను ఎట్లా కలుసుకుంటానో! నీకు పల్లెటూరు సంబంధం మాత్రం కలుగవద్దని దేవునికి వేయి దండాలు పెడుత.
నీ ప్రియ పార్వతి”
చీకిపోయిన కాగితం పై ఉన్న ఆ వ్యాసాలు (వ్యాఖ్యలు) విషపు కోరలతో బుస కొడ్తూ పైకి వస్తున్న తాచుపాములన్నంత అదరిపోయాడు గోవిందరావు. చీటిపై నలిగి చచ్చి ఉన్న పురుగును చూచి, అది పార్వతమ్మ వలచి వెంట తెచ్చుకున్న ప్రియునిగా తలచి గాభరాపడ్డాడు. కొట్టాలన్నంత ఉగ్రతతో పార్వతమ్మ పైకి చేతికర్ర లేపాడు.
‘బస్తీ వాండ్లను నమ్మకూడదు. సాహసించి ఏమైనా చేస్తారు’ హదయం హెచ్చరించింది.
”ఆ చీటి వెనుకనున్న ఆ రెండు ముక్కలు కూడా చూడండి. అది స్నేహితునికి కాదు వ్రాసింది. స్నేహితురాలుకు” పార్వతమ్మ సహింపరాని ఆవేదనను అణచి పెట్టి ప్రతివాదముగా ఏమి చేయలేని నిస్సహాయ ధ్వనితో అంటూ. ఆ చీటి వెనుక భాగం తానే చదువసాగింది.
నీ తహతహ సహజము. కాని దేశానికి ప్రాణబిక్ష పెట్టే గ్రామాలంటే నీకున్న భావాలతో నేనేకీభవించను. నీకు గల విద్యా సంస్కారము ద్వారా గ్రామీణుల జీవితమును ప్రకాశవంతము చేయు.
నీ ప్రియ కాంతం.
గోవిందరావు చీటిని అమాంతంగా లాక్కొని పట్టలేని ఉక్రోషాన్ని చెప్పులపై కేంద్రీకరించి, మడిమెలు బలంగా నేలకు గుద్దుతూ, ”చస్తూ చస్తూ నాకొక శనినంటగట్టి పోయాడు” చచ్చిన తండ్రిని సన్మానిస్తూ చీటి జేబులో వేసికొని రైసిమిల్లుకు వడిగా పోవసాగాడు.
దారి నడుస్తూనే, జేబులోని చీటికై కుడి చేయి వేశాడు.
పార్వతమ్మ తన ప్రియునితో సరస సల్లాపాలాడుతూంటే చూడలేక వెనుకడుగేసినట్టు. చీటికి వేళ్ళు తగలగానే ఏదో కాటు వేసినంత బాధతో చెయ్యిని బయటికి తీశాడు.
అప్రయత్నంగా ఎడమ చేయి జేబును బలంగా నలుపసాగింది. జేబులోని బీడీలు, అగ్గిపెట్టె పటపట చప్పుడుతో పొడిపొడి అవుతుంటే తన ప్రాణ శత్రువుల ఎముకలు నుసి అవుతున్నంత ఆనందం అనుభవించాడు గోవిందరావు.
గోవిందరావు పెట్టిన చివాట్లను ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ, ఆ విధంగా ఆత్మాభిమానం, వ్యక్తిత్వం చంపుకొని కాలం గడపటానికి చేసిన నేరమేమిటో పార్వతమ్మకు వెంటనే అర్థం కాలేదు.
ఆలోచించి, ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చింది. తాను ఆడది కావడమే అందుకు కారణమని తేల్చుకుంది.
”అయితే దీనికి విరుగుడు లేదా?”
చప్పుడు లేని ఆ ప్రశ్నపై తీవ్రంగా ఆలోచించసాగింది.
గోవిందరావు పెట్టిన చీవాట్లు తిరిగి చెవులో గింగురు మనసాగాయి.
గోవిందరావు దాంపత్య అనైక్యత నెరిగిన పక్కయింది పాపమ్మ వచ్చి, ”మగవారి అనుమానం చాలా చెడ్డది. ఏ విధంగానైనా ఆయన అనుమానం పోవడానికి ప్రయత్నం చేయాలె” పరామర్శ ధోరణిలో పార్వతమ్మ పలకరించింది.
”మీవంటి బానిసలుండబట్టే మగవాండ్లకు అంత తలబిరుసుతనం” అన్నట్టు పాపమ్మ వైపు అసహ్యంగా చూచింది పార్వతమ్మ.
బస్తీ అంటే గోవిందరావు కెంత అవిశ్వాసమో పల్లెటూరు అంటే పార్వతమ్మ కంత అసహ్యం కలిగింది. కాని ఏం చేస్తుంది. కుడితిలోని ఎలుకవలె తల్లడిల్ల సాగింది. ఆడపిల్లను చిన్నప్పుడెంత గారాబంగా పెంచినా పెద్దకాగానే పీడ వదిలించుకుందామనే తల్లిదండ్రుల ప్రవృత్తిపై పార్వతమ్మకు విస్మయం కలిగింది.
”నేటి సమాజములో కన్నవాండ్లకే ఆడదంటే కనికరము లేనపుడు భర్త కెట్లా ఉంటుంది?” అవ్యక్త ధ్వని వినిపించింది.
దేబె ముఖంతో రైస్ మిల్ నుండి రంగడు వచ్చి పార్వతమ్మ మంచం ముందట తలపట్టుకొని కూర్చున్నాడు.
తన ప్రతిబింబమే రంగని రూపంలో వచ్చి తన దీనస్థితిని కండ్లారా చూడమంటున్నట్టున్న రంగడిని పార్వతమ్మ గంభీరంగా చూడసాగింది.
రంగడి కంట్లో నుండి బొటబొట నీళ్లు కారాయి.
పార్వతమ్మ బావురుమని ఏడ్వసాగింది.
రంగడు కూడా పెద్దగా ఏడ్చాడు.
వెంటనే ప్రయత్నపూర్వకంగా ఏడుపు నాపుకొని పిచ్చిదానిలా రంగని వైపు చూడసాగింది.
జంట ఏడుపు అకస్మాత్తుగా ఆగిపోవడంతో రంగడు పార్వతమ్మ వైపు వింతగా తల తిప్పి ”ఛ ఇంతట్లోనే మీ ఏడుపు ఆగిపోయిందా” అన్నట్లు పార్వతమ్మను చూడసాగాడు.
”ఎందుకట్లా ఆడదానిలా ఏడుస్తున్నావు?” పార్వతమ్మ ఆదరంగా అడిగింది.
”పుట్టుకకు మొగాడినే కాని ఆడోళ్ళకంటే నాకున్న గొప్పేంటమ్మగారు?” గద్గద స్వరంతో రంగడు అన్నాడు.
”ఏమిటి రంగడు. ఏం సంగతి?”
”ఇష్టంలేని పెళ్ళాన్ని ఇంటినుంచి గెంటేసినట్లు నన్ను మిల్లులోంచి వెళ్ళగొట్టిండు అయ్యగారు”
గోవిందరావు రంగడిని వెళ్ళకొట్టినట్టు తనను కూడా వెళ్ళకొడ్తాడేమో యని పార్వతమ్మ బెదిరిపోయింది.
”అయితే కోపం వస్తే అయ్యగారు నన్ను కూడా వెళ్ళగొడ్తాడంటావా?” అవేదనతో పార్వతమ్మ అడిగింది.
”ఆస్తికి, అధికారానికి అవకాశముంటే ఏదైనా చేస్తారు. మీకు చెప్పానో లేదో నేను కొన్నాళ్ళు పట్నం బట్టల మిల్లులో పనిచేసినోడిని. మా కూలోళ్ళ సభలో మా సంఘం పెద్ద ఏమన్నాడంటే, అధికారమున్నోడికి ఆలన్నా, కూలన్నా ఒకటేనని” రంగడు అన్నాడు.
పార్వతమ్మ గంభీరంగా ఆలోచిస్తూనే.. ”ఇంతకూ నీవు చేసిన తప్పేంటి రంగడూ?” పరధ్యాన్నంలో పార్వతమ్మ అడిగింది.
”మా సంఘం పెద్ద అంటినే. ఆయన పట్నం నుంచి ఉత్తరం రాసిండు. అయ్యగారు ఇప్పిసూస్కొని కుప్పి గంతు లేసిందు. అంతే. దీంట్లో నాదేం తప్పు చెప్పండి. కూలోళ్ళ మంచికే రాసుంటడు ఆ పెద్దమనిషి, అదే అయ్యగారి ఆగ్రానికి కారణముండొచ్చు.”
”ఒకడి మంచి ఇంకొకడి అసూయకు కారణంగా పరిణమించడం అన్యాయం” పార్వతమ్మ తూచినట్టు పదాలను పలికింది.
”అమ్మగారూ! తెలియకడుగుత. మేమంటే కూలి చేస్కొని బతికేటోల్లం, మాకు యజమాన్లకు పనిచేసేంత సేపే సంబంధం. మేమేది కావాలన్నా, వాండ్ల లాభాలు తగ్గుతయని భయమనుకుందాం. మాదేందిగాని, ఒక సంగతి అడుగత. మీరు తెలిసినోరు, చేసుకున్న పెళ్లామైనా, తోబుట్టు అడదైనా, కని పెంచిన తల్లైనా మొగోడి కింద పనికిరాదు. ఎంత పక్కల్లో, రెక్కల్లో కాళ్లల్లో, వేళ్లలో మెలిగినా, జిట్టెడు మొగోడు గుట్టంత ఆడదాన్ని గోటికింద కట్టేస్తాడు. దీన్నేమనాలె? రంగడు ప్రశ్నించాడు.
”పట్నంలో ఎన్నాళ్ళున్నావు రంగడూ?” పార్వతమ్మ గంభీరంగా అడిగింది.
”ఉండటానికేం. మస్తుగున్న, కొత్త గిర్నీ రంగడంటే లష్కరంతా తెలుసు” రంగడు ఉత్సాహంతో అన్నాడు.
వేలమంది కూలీల్లో నిటారుగా నిలబడి జయనినాదాలు కొట్టడం, జెండా పట్టుకొని ఊరేగింపులో ముందు నడవడం, జెండా లాగుకొనవచ్చిన పోలీసు వాడిని అదిలిస్తే అంతదూరాన పడిపోవడం. అంతా హేళనగా నవ్వుతుంటే గర్వంతో ముందుకు నడవడం- అన్నీ క్షణం పాటులో రంగడి కండ్ల ముందు ప్రత్యక్షమైనాయి.
”మీరేమనుకోకపోతే, ఓ సంగతడుగుత. మీరు బాగా సదువుకొన్నారని ఇన్నా. మీరు సదువుకున్నపుడు నాటకాలు, నాచల్ చేసిన్రా. ఎందుకంటే, మా కూలి సంఘం పెద్ద ఓసారి ఓ పెద్ద బడికి తీస్కపోతే ఆడోళ్లు ఆడిన నాటకం, నాచ్ చూసిన” రంగడు ముసి ముసిగా నవ్వుతూ అడిగాడు.
పార్వతమ్మ తను చదువుకున్న రోజుల జీవితాన్ని తలచుకొంది. నాటకములో మొదటి బహుమతి పొందిన బంగారు పతకాన్ని చూచుకొని నాడెంత మురిసి పోయిందో నేడు ఆ సంగతి జ్ఞప్తికి రాగానే అంత కలవరపడ్డది. ఆ సంగతి గోవిందరావుకు యింకా తెలియలేదు. ఆ విషయం అతని దృష్టికి రాకుండా దాస్తూ వస్తూ ఉంది.
”నేను నాటకాలు వేశాను. నాకు మొదటి బహుమానం దొరికింది. బంగారు పతకం” పార్వతమ్మ అన్నది.
”ఆ రోజుల్లోనే మా కూలి సంఘములో నేను ఎక్కువమందిని చేర్చిస్తే అయిదు మూలల బిళ్లొకటి నాకిచ్చారు మా సంఘమోళ్లు. అదెక్కడ పోయిందో” రంగడు విచారంగా అన్నాడు.
”మనం పట్నం ఎప్పుడు పోదాం రంగడూ?” అప్రయత్నంగా పార్వతమ్మ నోటనుండి వాక్యం వెళ్లింది.
”పోదామంటారా” రంగడు పార్వతమ్మ వైపు మెడతిప్పి ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు.
”అవును రంగడు, అధికారమున్న ఈ మగవాండ్లకు అలన్నా ఒకటే, కూలన్నా ఒకటే- పార్వతమ్మ వెంటనే అన్నది.
ఎప్పుడు వచ్చాడో ఏమో, తలుపు చాటున నిలుచుండి సంభాషణ వింటున్న గోవిందరావు వడిగా ముందుకు వచ్చి, చేతి కర్రతో బలంగా ఇద్దరిని కొట్టసాగాడు.
పార్వతమ్మ పైనబడే దెబ్బలు తప్పించుటలో ఎక్కువ దెబ్బలు రంగడే తిన్నాడు.
ఈ అలజడికి చుట్టుప్రక్కల జనం కూడారు. జనం కూడటంతో గోవిందరావు అభిమానపడి ఇంట్లోకి వెళ్లిపోయాడు.
రంగని రక్షణలో నిలుచుండి కుమిలి కుమిలి ఏడుసున్న పార్వతమ్మను చూచి వచ్చిన జనం విస్తుపోయి ముక్కుమీద వేను(లు) వేసుకొని వెళ్లిపోయారు.
”అందుకే మరి ఆయనకు అనుమానం” అని ఒక స్త్రీ గొణిగింది.
వట్టికోట ఆళ్వారుస్వామి