సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆమనగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమణారెడ్డి


నవతెలంగాణ-ఆమనగల్: ఆమనగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఇటికాల రమణారెడ్డి ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నట్టు ఆయన చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం చేపట్టిన సకల జనుల సమ్మెలో ఉద్యమ కారులతో సమానంగా ఉద్యమంలో పాల్గొనడంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రజల మనోభావాలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించినట్టు రమణారెడ్డి తెలిపారు. ఈవిషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు త్వరలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు కార్యాచరణను రూపొందిస్తామని హామీ ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.