అమర్‌ రాజా భారీ పెట్టుబడులు

రూ.9,500 కోట్లతో ఈవీ, న్యూ ఎనర్జీ హబ్‌ ఏర్పాటు ొ భవిష్యత్‌లో మరింత విస్తరణకు ప్రణాళిక ొ సీఎం రేవంత్‌రెడ్డితో కంపెనీ చైర్మెన్‌ గల్లా జయదేవ్‌ చర్చలు – రూ.9,500 కోట్లతో ఈవీ, న్యూ ఎనర్జీ హబ్‌ ఏర్పాటు
– భవిష్యత్‌లో మరింత విస్తరణకు ప్రణాళిక
–  సీఎం రేవంత్‌ రెడ్డితో కంపెనీ చైర్మెన్‌ గల్లా జయదేవ్‌ చర్చలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అమర్‌ రాజా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధ్వర్యంలో రాష్ట్రంలో తల పెట్టిన పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబుతో ఆ కంపెనీ చైర్మెన్‌ గల్లా జయదేవ్‌ సంప్రదింపులు జరిపారు. బుధవారం సచివాలయంలో వారిని కలిసి అమర రాజా ప్రాజెక్టుల పురోగతిపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో అమరరాజా కీలక భాగస్వామి అని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఆ కంపెనీ తలపెట్టిన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందిస్తుందని భరోసా ఇచ్చారు. అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ గిగా ఫ్యాక్టరీ, ప్యాక్‌ అసెంబ్లీ, ఇ పాజిటివ్‌ ఎనర్జీ ల్యాబ్‌ల నిర్వహణకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. క్లీన్‌ ఎనర్జీకి తెలంగాణ కట్టుబడి ఉందనీ, కొత్త పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సీఎం తెలిపారు. తమ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి జయదేవ్‌ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. దివిటిపల్లిలో లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు, బ్యాటరీ ప్యాక్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌, శంషాబాద్‌లోని ఇ-పాజిటివ్‌ ఎనర్జీ ల్యాబ్స్‌ మొదలగు పరిశ్రమల కోసం మొత్తం రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు. దాదాపు 4,500 మందికి ప్రత్యక్షంగా మరో 4,500కి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వివరించారు. బ్యాటరీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌తో పాటు వివిధ రంగాలలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తమ కంపెనీ సిద్ధ్దంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, ఇన్వెస్ట్‌ మెంట్‌ ప్రమోషన్‌ స్పెషల్‌ సెక్రటరీ విష్ణువర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.