ప్రాచీన కాలంలో భారతదేశం చాలాకాలం ప్రపంచానికే అనేక విషయాల్లో కేంద్రంగా ఉండేది. విద్యా, కళలు సాహిత్యం, సంస్కృతి కొన్ని మతాలకు జన్మస్థలంగా వర్ధిల్లింది. ప్రపంచానికే విద్యా కేంద్రంగా ‘నలంద విశ్వవిద్యాలయం’ పేరుగాంచగా, బౌద్ధ మతానికి పుట్టినిల్లుగా భారత్ భాసిల్లింది. ఈ కాలంలోనే అనగా క్రీస్తు శకం 2వ శతాబ్దంలోనే బౌద్ధ మతం ఆధిపత్యంగా ఉన్న సమయంలో అనేక కట్టడాలు, నిర్మాణాలకు అంకురార్పణ జరిగింది. ఈ కోవలోనే బౌద్ధ విహారాలు, బౌద్ధ స్థూపాలు, నిర్మాణాలు చేపట్టారు. 8వ శతాబ్దం వచ్చేసరికి హిందూ మతం పునరుజ్జీవనం పొందటం, హిందూ మత పాలకులు ఆధిపత్యంలోకి రావడం ద్వారా అద్భుతమైన కట్టడాల నిర్మాణం ప్రారంభమైంది. రాజస్థాన్ లోని రాజపుత్రులు పలు కోటలు నిర్మించారు. 11వ శతాబ్దం వచ్చేసరికి ముస్లిం రాజుల దండయాత్రలతో హిందూ రాజులు నిర్మించిన అనేక కట్టడాలు ధ్వంసం చేసి, నేలమట్టం చేశారు. అయినా నేటికీ అక్కడక్కడ ఆనాటి నిర్మాణాలు, దేవాలయాలు మన కళ్ళ ముందు ప్రత్యక్ష సాక్షులుగా కనపడుతూ అనేక ప్రత్యేకతలు ప్రదర్శిస్తూ అబ్బురపరుస్తున్నాయి.
శిథిలావస్థకు చేరుతున్నా, ఆనాటి కళానైపుణ్యం, వాస్తు, నిర్మాణశైలి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, నీటి పారుదల సౌకర్యాలు, ఖగోళ విషయాలు మనలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తదుపరి మనదేశాన్ని పాలించిన మొఘలులు, పోర్చుగీసు, ఫ్రెంచ్, బ్రిటిష్ వారి పాలనలో నిర్మించిన వివిధ నిర్మాణాలు, కట్టడాలు శతాబ్దాలు గడుస్తున్నా, ప్రకృతి విపత్తులు సంభవించినా నేటికీ అవి సజీవంగా, మనందరినీ ఆకర్షిస్తున్నాయి. 2వ శతాబ్దం నుంచి దాదాపు 18వ శతాబ్దపు మధ్యకాలంలో నిర్మించిన కొన్ని నిర్మాణాలు, దేవాలయాలు గురించి తెలుసుకుందాం.
నలందా విశ్వవిద్యాలయం: క్రీ.శ 5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు ప్రపంచానికే విద్యా కేంద్రంగా భాసిల్లిన నలందా విశ్వవిద్యాలయం బీహార్‌లో నిర్మించారు. సుమారు పది వేల మంది విద్యార్థులు వివిధ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి విద్యనభ్యసించే వారని చరిత్ర చెబుతోంది. సుమారు 1000 మంది ఉపాధ్యాయులు పలు అంశాలను బోధించేవారు. చైనా, కొరియా, టిబెట్, సెంట్రల్ ఆసియా నుంచి వచ్చి ఇక్కడ బౌద్ధ మత అంశాలను నేర్చు కునేవారు. గుప్త, పాల రాజులు ఈ విశ్వవిద్యాలయానికి ఎనలేని సేవలు అందించారు. ఇంతమంది ఒకచోట చేరి అభ్యసించడానికి నిర్మించిన నలందా విశ్వవిద్యాలయం ఎంత పెద్దదో ఊహించుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. నేటికీ విశ్వవిద్యాలయం శిథిలాలు బీహార్‌లోని రాజగర్‌లో చూడవచ్చు.
అజంతా – ఎల్లోరా గుహలు: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో క్రీ.శ 2వ శతాబ్దంలో నిర్మించిన రాక్ – కట్ పుణ్యక్షేత్రాలు. సుమారు 33 దేవాలయాలు నిర్మించగా, దాదాపు అన్నీ బౌద్ధ మత అంశాలను తెలుపుతాయి. అయితే, 16వ గుహ వద్ద నిర్మించిన ‘కైలాస దేవాలయం’ నేటికీ అందరినీ ఆకట్టుకుంటుంది. బౌద్ధ, జైన, హిందూ మతానికి సంబంధించిన అనేక చిత్రాలు దర్శనమిస్తాయి. ఆనాటి కళానైపుణ్యానికి నిదర్శనం ఈ గుహలు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది.
సిర్పూర్ దేవాలయం : ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రాంలో 7వ శతాబ్దంలో ఇటుకలతో నిర్మించిన ‘లక్ష్మణ ఆలయం’ నేటికీ మనలను అబ్బురపరుస్తున్నది. ముఖ్యంగా సముద్ర మట్టానికి 30 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ దేవాలయం అనేక ప్రకృతి విపత్తులను తట్టుకుని నేటికీ నిలబడింది. ఎంత నాణ్యతతో నిర్మించారో…. కదా! వేదిక్ ఆర్కిటెక్చర్‌తో నిర్మించినట్లు ఇంజనీర్లు చెబుతున్నారు.1872 కాలంలోనే ఈ దేవాలయం బయట ప్రపంచానికి పరిచయమైంది.
ఖజురహో దేవాలయాలు: మధ్యప్రదేశ్‌లోని ఈ దేవాలయల శిల్పకళా నైపుణ్యానికి అందరూ ముగ్దులు కావాల్సిందే. 10, 11 శతాబ్దంలో ఛందేల రాజుల నిర్మించిన ఈ కట్టడం నేటికీ ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. 80కి పైగా ఉండవలసిన శిల్పాలు కాలానుక్రమంలో శిథిలావస్థకు చేరి నేటికీ 20 శిల్పాలు మాత్రమే మెరుగైన స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.
లేపాక్షి : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం సమీపంలో ఉన్న లేపాక్షి గ్రానైట్‌తో నిర్మించిన ఏకశిలా విగ్రహంగా ప్రఖ్యాతిగాంచినది. 16వ శతాబ్దంలో 16 అడుగుల ఎత్తులో నిర్మించినట్లు తెలుస్తోంది. సీతాపహరణం సమయంలో రావణుడిని అడ్డగించి తన ప్రాణాలను పణంగా పెట్టిన పక్షి ‘జటాయువు’గా పురాణ కథనంలో పేరుపొందింది. శ్రీరాముడు దర్శించి ”లే పక్షి’ అనే మాట కూడా అన్నట్లు ప్రాంతీయ కథనం.
వీరభద్రస్వామి ఆలయం : ఆంధ్రప్రదేశ్‌లో లేపాక్షి లోనే నిర్మించిన వీరభద్రస్వామి ఆలయం ఆనాటి కళానైపుణ్యానికి నిదర్శనంగా శతాబ్దాలుగా పేరుగాంచింది. ముఖ్యంగా ‘వేలాడే స్తంభం’ ఇక్కడి ప్రత్యేకత. ఈనాటికీ అంతుబట్టని రహస్యం. 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ నిర్మాణం నేటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధి శివాలయంగా విరాజిల్లుతోంది.
సూర్య దేవాలయం : ఒడిశాలోని భువనేశ్వర్‌కు దగ్గరలో ఉన్న సూర్య దేవాలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచినది. కోణార్క్ దేవాలయం అంటే ‘కొన’ అనగా మూల, ‘అర్క్’ సూర్యుడు అని అర్థం. ఆలయం మొత్తం 24 చక్రాలపై ఉంటుంది. సూర్య భగవానుడు రథంపై ఉన్నట్లు భావిస్తూ, 7 గుర్రాలు ఈ రథాన్ని లాగుతున్నట్లు నిర్మించిన ఈ దేవాలయం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కట్టడం. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద ప్రదేశంగా గుర్తించబడింది ఈ కట్టడం. సుమారు 2 లక్షల టన్నుల రాయిని ఈ దేవాలయ నిర్మాణంలో వాడినట్లు తెలుస్తోంది. ఆనాటి నిర్మాణ కౌశల్యానికి యావత్ ప్రపంచం అబ్బుర పడుతుంది. కైలాస పర్వతాన్ని తీసికొని వచ్చి, ఇక్కడ పెట్టారా అన్నట్లు ఉంటుంది. ఆకాలంలో డ్రిల్లింగ్, నీటి సరఫరా వ్యవస్థ వంటివి ఈ దేవాలయంలో కనపడుతుంది. ముఖ్యంగా ‘సూర్య గడియారం, చంద్ర గడియారం’ ప్రత్యేకమైనవి. పగలు రాత్రి సమయాలు, కాలాలు స్పష్టంగా తెలియజేస్తూ నిర్మించిన ఈ దేవాలయం ఒక మానవ నిర్మాణ అద్భుతమే. నేడు చాలా వరకూ శిథిలావస్థకు చేరుకుంది. మరికొన్నాళ్లు రక్షించే ఏర్పాటు ప్రభుత్వాలు నేడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో చర్యలు తీసుకోవాలి.
హోయ సోమేశ్వర ఆలయం: కర్ణాటక రాష్ట్రంలోని హలిబేడులో ఉన్న శివాలయం హోయశాల రాజుల కాలంలో నిర్మించబడిన అద్భుతమైన దేవాలయం. ఖగోళ విషయాలు, నీటి సరఫరా వ్యవస్థ వంటివి పరిగణనలోకి తీసుకుని నిర్మించారు. ‘విషవత్తులు, ఆయనాంతం’ వంటివి పరిగణనలోకి తీసుకుని నిర్మించారు. దేవాలయంలోకి వెలుతురు వచ్చేలా, ధ్వనులు స్పష్టంగా వినపడేలా నిర్మించిన ఈ నిర్మాణం ఆనాటి కళానైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.
హంపి: కర్ణాటక రాష్ట్రంలోని హంపి దేవాలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచినది. ముఖ్యంగా ‘ఏకశిలా రథం’ పేరు పొందింది. విఠలాలయం అందరినీ ఆకట్టుకుంటుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద ప్రదేశంగా గుర్తించబడింది. 56 రాతి స్తంభాలు రకరకాల ధ్వనులు వినిపిస్తాయి. విజయనగర సామ్రాజ్య కాలంలో 15వ శతాబ్దంలో ఈ దేవాలయం, రథం నిర్మించినట్లు తెలుస్తోంది.
రామప్ప దేవాలయం: తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లు సమీపంలో ఉన్న శివాలయం రుద్రేశ్వర ఆలయం ఆనాటి కాకతీయ రాజుల దైవ భక్తికి, కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల కాలంలోనే యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద ప్రదేశంగా గుర్తించబడింది. అనేక మంది యాత్రికులు రోజూ ఈ రామప్ప దేవాలయం సందర్శించి ఆధ్యాత్మికతతో పరవశించి పోతారు. ముఖ్యంగా ఈ దేవాలయం లోని కళా నైపుణ్యానికి, శిల్ప సౌందర్యానికి అందరూ ముగ్దులు కావాల్సిందే.
ఏ రకమైన సౌకర్యాలు లేని ఆకాలంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ పాలకులు నిర్మించిన కట్టడాలు, దేవాలయాలు నేటికీ సజీవంగా, హూందాగా ఉంటూ ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మన కళాకారుల పనితీరు, నైపుణ్యాలు, పరిజ్ఞానం, అభివద్ధి, కళాతృష్ణ, నిర్మాణ కౌశలం సదా ప్రశంసనీయం. మనలో నైపుణ్యాలకు కొదువ లేదని రుజువు చేస్తున్నాయి. ఈనాడు ఎంతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా, విద్యుత్ సౌకర్యం ఉన్నా, అరచేతిలో సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నా నేడు కడుతున్న అనేక నిర్మాణాలు, బ్రిడ్జిలు, ఆనకట్టలు, అపార్ట్‌మెంట్లు కళ్ళముందే అతి తక్కువ సమయంలో కూలిపోతూ మన నైపుణ్యాలను అవహేళన చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అవినీతి. నిబద్ధత లేకపోవడం. ఇకనైనా సరిచేసుకోవాలి.
ఈ పైన పేర్కొన్న నిర్మాణాలే కాకుండా 18వ శతాబ్దంలో ఢిల్లీలోని నిర్మించిన జంతర్ మంతర్, ఆగ్రాలో షాజహాన్ నిర్మించిన ‘తాజ్ మహల్’, కలకత్తాలో బ్రిటిష్ వారు నిర్మించిన ఛత్రపతి శివాజీ టెర్మినల్, మైసూర్ మహారాజా ప్యాలెస్, గుజరాత్‌లోని ‘రాణీ కా వావ్’, అక్షరధామ్ ఆలయం, తమిళనాడు లోని ‘మధుర మీనాక్షి ఆలయం’, ఢిల్లీలోని కుతుబ్ మినార్, ఐరన్ పిల్లర్, హైదరాబాద్ లోని చార్మినార్ ఇలా అనేక నిర్మాణాలు వివిధ వ్యక్తులు, వివిధ కాలాల్లో నిర్మించి, దేశానికి జాతి సంపదగా అందించారు. ఆనాటి కళానైపుణ్యానికి నిదర్శనంగా మన ముందు నిలబెట్టారు. ఇటువంటి నిర్మాణాలను ప్రభుత్వాలు, ప్రజలు సంరక్షించుకోవాలి. వీలును బట్టి అందరూ సందర్శించి, మధురానుభూతి పొందాలి. భావి తరాలకు ‘వారసత్వ సంపదగా’ అందించుటయే మన అందరి కర్తవ్యం.
ఐ.ప్రసాదరావు,
6305682733