– జాతీయ మాస్టర్ ప్లాన్ ప్రాంతీయ సమావేశంలో అరుణ్‌కుమార్ జైన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ అమలుతో దేశాభివృద్ధిలో అద్భుత మార్పులు సంభవిస్తున్నాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. మౌలాలీలోని ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (ఐఆర్‌ఐఎఫ్‌ఎమ్)లో గతశక్తి జాతీయ మాస్టర్‌ప్లాన్‌పై 64వ నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ రెండు రోజుల ప్రాంతీయ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ, పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖల ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు. దీనిలో ఆయన కీలకోపన్యాసం చేశారు. గతిశక్తి జాతీయ మాస్టర్‌ప్లాన్‌ను ముందుకు తీసుకెళ్లడంలో భారతీయ రైల్వేల పాత్ర ముఖ్యమైనదని అన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే బోర్డులో బహుళ-క్రమశిక్షణా గతిశక్తి డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేసిందనీ, అన్ని డివిజన్లలో ఈ యూనిట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. వేగంగా ప్రాజెక్టుల మంజూరు, పనుల అమలు పర్యవేక్షణ, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేయడంలో ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ బాగా ఉపయోగపడుతున్నదని వివరించారు. సామాజిక, ఆర్థిక పరివర్తన సాధనలో మౌలిక సదుపాయాలపై పెట్టుబడి కీలకాంశమని చెప్పారు. మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ ఏర్పాటు, లాజిస్టిక్స్ ధరలు తగ్గించడం వంటి చర్యలతో పరిశ్రమల్లో పోటీతత్వం మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు. సమగ్రత, ప్రాధాన్యత, సర్వోత్తమ సమకాలీకణ, విశ్లేషణా సామర్థ్యం, క్రియాశీల చిత్రీకరణ అంశాలు గతిశక్తి మాస్టర్‌ప్లాన్‌కు మూలస్తంభాలని విశ్లేషించారు. గతిశక్తి పోర్టల్‌ను దక్షిణ మధ్య రైల్వే సమగ్రంగా వినియోగించుకుంటున్నదనీ, ప్రస్తుతం 600 కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉన్న తొమ్మిది ప్రాజెక్టులు ఈ పోర్టల్ ద్వారానే కేటాయించబడినాయని వివరించారు. కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి సుమిత దావ్రాతో పాటు పలు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మంత్లీ అవార్డులు ప్రదానం
దక్షిణ మధ్య రైల్వేలో ప్రతినెలా ఉద్యోగులను ప్రోత్సహించేందుకు ఇచ్చే ‘మ్యాన్ ఆఫ్ ది మంత్’ భద్రత అవార్డులను మంగళశారం ఆ సంస్థ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అందచేశారు. డివిజన్ పరిధిలో విధి నిర్వహణలో అప్రమత్తంగా వుంటూ, అంకితభావంతో విధులు నిర్వహించిన తొమ్మిది మందికి సికింద్రాబాద్ రైలు నిలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందచేశారు. కార్యక్రమంలో సంస్థ అదనపు జనరల్ మేనేజర్ ఆర్ ధనుంజయులుతో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ డివిజనల్ రైల్వే మేనేజర్‌లు (డీఆర్‌ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో చేపడుతున్న భద్రతా చర్యల్ని జీఎమ్ సమీక్షించారు.