క‌ళా శ్రామికుల‌కు అపురూప పుర‌స్కా‌రాలు

కళాకారులు.. సాహితీవేత్తలు.. సంఘశ్రేయోభిలాషులు.. క్రీడాకురులు… వీరంతా తమ విశ్రాంతినీ, వినోదాన్ని త్యాగం చేసి ఆ సమయాన్నంతా తమ అభిరుచికి అనుకూలంగా వుండే ఆయా రంగాలకు కేటాయించినపుడు వారు తమకు ఇష్టమైన రంగంలో పేరు తెచ్చుకోగలుగుతారు. అలా అనుదినం శ్రమించి ఏదో ఒక రంగంలో రాణించిన నిరంతర శ్రామికులు వీరు. తమలోని కళకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ, ఆయా కళల్లో పేరు ప్రఖ్యాతులు ఆర్జించి, తమలోని విద్యను మరికొందరికి అందిస్తూ, నయనానందాన్నీ, మనో వికాసాన్నీ, సాంత్వననీ అందిస్తున్న మహిళా కళాకారులనూ, సేవా మూర్తులనూ గుర్తించి సత్కరించాలన్న సంకల్పంతో ప్రముఖ విద్యా, సాహితీవేత్త, కళా ప్రేమికురాలైన డా.అమృతలత ప్రతి ఏడాది మాతృదినోత్సవం సందర్భంగా అపురూప అవార్డులు అందిస్తున్నారు. అటువంటి అపురూపమైన అవార్డులు ఈ రోజు అందుకోబోతున్న వారి చిరుపరిచయాలు నేటి మానవిలో….

నిరంతర శ్రామికులు వీరు
కళలన్నీ ఎంతో శ్రమ, సమయం, సంయమనం, ధనం, ఓపికలతో కూడు కున్నవి. అయినా అలాంటి వెరవక, వారిని అడుగడుగునా ప్రోత్సహించే తల్లిదండ్రులు, గురువులు, సోదరులు, స్నేహితులు, జీవత భాగస్వాములు, చివరకు వారికి పుట్టిన బిడ్డలు కూడా సహకరించినపుడు మాత్రమే వారు ఆయా రంగాల్లో రాణించగలుగుతారు. కళారూ పాలేవీ కర్మాగారాల్లో తయార య్యేవి గానీ, పరిశోధనా సంస్థల్లో వెలువడేవి గానీ, విత్తనాలు చల్లితే పొలాల్లో పండేవి గానీ కావు. వాటంతటవే పుట్టేవి కూడా కావు. తన అనుభవాల్లోనో, భావాల్లోనో, అనుభూతుల్లోనో, ఆలోచన ల్లోనో నిరం తరం తపించి, జ్వలించి, లయించిన మనిషి తన హృదయాన్నీ, మేధస్సునూ రంగరించి ఒక తపస్సులా సృష్టించినవే లలిత కళలు. అలా నిరంతరం కళల కోసం తపించే విశ్రాంతి ఎరుగని నిరంతర శ్రామికులు వీరు. అలాంటి వారిని సంత్కరించాలనే ఉద్దేశంతో ఈ అపురూప అవార్డులు ప్రారంభించాం. ఈ ఏటితో ఈ పండుగ పద్నాలుగేండ్లు పూర్తి చేసుకుందని చెప్ప డానికి సంతోషిస్తున్నా ను. ఈ ప్రయాణంలో సహకరించిన, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు.
– డా.అమృతలత

సాహిత్యం..వైద్యం
డా.కె.వికృష్ణకుమారి… ఈ ఏడాది అమృతలత జీవనసాఫల్య పురస్కారం అందుకోబోతున్నారు. వైద్యురాలు, రచయిత్రి, సంఘసేవకురాలు అయిన ఈమె తెనాలిలో డా.కాజా వెంకట జగన్నాథరావు, సత్యవతి దంపతులకు జన్మించారు. తెనాలిలో పాఠశాల విద్యను పూర్తి చేసి కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్య అభ్యసించారు. తర్వాత తెనాలి, గుంటూరు, హైదరాబాద్‌ కింగ్‌కోటి గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌లో వైద్యసేవలు అందించి పదవీ విరమణ చేశారు. హైస్కూల్లో చదువుతున్నపుడే రచనా రంగంలోకి అడుగుపెట్టారు. వృత్తిరీత్యా వైద్యురాలు అయినా ఆమె ప్రవృత్తి మాత్రం రచనా వ్యాసంగం.

సంగీతం-గజల్‌
జ్యోతిర్మయి మళ్ళ… బీఎస్సీ మాథమాటిక్స్‌, హిందీ సాహిత్యరత్న పట్టాలతో పాటు కర్ణాటక సంగీతంలో డిప్లమా పొంది, చెన్నై ఆలిండియా రేడియోలో డి గ్రేడ్‌ లలిత సంగీత గాయనిగా పని చేశారు. ఉర్దూ భాషకి సంబంధించిన ఈ గజల్‌ ప్రక్రియను దాశరథి, సినారెలు తెలుగు వారికి రుచి చూపిస్తే దాన్ని అందిపుచుకుని ప్రచారంలోకి తీసుకొస్తున్న సాహితీవత్తలో ఈమె తొలివరుసలో ఉంటారు. గత పదిహేనేండ్లలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా గజల్‌ కచేరీలు చేసిన మొదటి మహిళ ఈమె. ప్రముఖ గజల్‌ కవయిత్రి బైరి ఇందిర జ్ఞాపకార్థం ఈ ఏడాది అపురూప పురస్కారం అందుకోబోతున్నారు.

సాహిత్య విమర్శ
ప్రొ.సి.హెచ్‌. సుశీలమ్మ.. గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా బాధ్యతలు చేపట్టి ఒంగోలు, చేబ్రోలులో ప్రిన్సిపాల్‌గా పని చేసి పదవీవిరమణ చేశారు. ఎన్నో అంతర్జాతీయ, జాతీయ సదస్సు ల్లో పత్ర సమర్పణలు చేసిన ఆమె రాష్ట్ర మహిళా కమిషన్‌ ఏర్పాటుచేసిన పలు సదస్సులో రిసోర్స్‌ పర్సన్‌గానూ, జాతీయ మహిళా కమిషన్‌ ఏర్పాటు చేసిన న్యూఢిల్లీ సదస్సులోనూ, ఆకాశవాణి దూరదర్శన్‌ ఏర్పాటుచేసిన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక ప్రభుత్వ, ప్రభు త్వే తర సంస్థల్లో రిసోర్స్‌ పర్సన్‌గా సాహితీ సదస్సు లో అనర్గళంగా ప్రసంగించగల ఈమె ఈ ఏడాది సాహిత్య విమర్శకు పురస్కారం అందుకోబోతున్నారు.

వైద్యం..సాహిత్యం
డా.అలూరి విజయలక్ష్మి… కృష్ణాజిల్లా ఆత్కూరులో గూడపాటి వరలక్ష్మి, రామ కోటయ్య దంపతులకు జన్మించారు. ఎస్‌.ఎస్‌.ఎల్‌.సిలో కృష్ణా జిల్లా ఫస్ట్‌ ర్యాంకర్‌గా, ఎం.ఎస్‌.లో పాట్నా యూనివర్సిటీ టాపర్‌గా, ఆంధ్రా మెడికల్‌ కాలేజీ మహిళా స్పోర్ట్స్‌ ఛాంపియన్‌గా, టెన్నీకాయిట్‌ ఛాంపియన్‌గా నిలిచి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాతగా ఎదిగారు. కాకినాడ విజయలక్ష్మి నర్సింగ్‌ హౌమ్‌లో 43 ఏండ్లపాటు ఇరవై రెండు వేల ప్రసవాలు చేసిన ఘనత ఆమెది. ఈ విజయలక్ష్మి హౌం వైద్య, మహిళా ఉద్యమ, కళా, సామాజిక చేతన, స్వచ్ఛంద సేవ, రాజకీయ సదస్సులకు వేదిగా ఒక స్ఫూర్తివంతమైన భూమికను పోషించింది. ప్రతి మొదటి ఆదివారం హౌమ్‌లో పేద మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ జరిగాయి. వైద్యురాలిగానే కాక రచయిత్రిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహిళలు, పిల్లల ఆరోగ్యం గురించి ఎన్నో పుస్తకాలు రచించిన ఘనత ఈమెది. చుండ్రు సబ్బాయమ్మ రోటరీ స్త్రీల వృద్ధాశ్రమం వ్యవస్థాపకురాలిగా, మహర్షి సాంబమూర్తి వికలాంగ బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాల సహ వ్యవస్థాపకులుగా వికలాంగ బాలికల విద్య, వైద్యం కోసం కృషి చేసిన విజయలక్ష్మి ఈ ఏడాది అమృతలత జీవన సాఫల్య పురస్కారం అందుకోబోతున్నారు.

రంగస్థలం
సావేరి దుర్గాభవాని… పదిహేనేండ్ల పాటు ఉపాధ్యాయినిగా, రెండేండ్లు ఇంగ్లీష్‌, ఎకనామిక్స్‌ లెక్చరర్‌గా విధులు నిర్వహించిన భవాని తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ భాషలలో విశేషాధ్యయనం చేసిన విద్యావంతురాలు. సంగీత కుటుంబం నుండి వచ్చిన ఆమె 28 ఏండ్ల కిందట సి.నా.రె సూచన మేరకు ఆమెకు ఇష్టమైన సావేరీ రాగం పేర సావేరి కల్చరల్‌ అసోషియేషన్‌ సంస్థని స్థాపిం చారు. దీని ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరెన్నో నాటకాలను ప్రదర్శిస్తూ సంగీత సాంస్కృ తిక రంగాల ప్రేక్షకులను అలరించిన ఆమె రంగ స్థల విభాగంలో పురస్కారం అందుకోబోతున్నారు.

అంతర్జాల పత్రిక సంపాదకత్వం
డా.కొండపల్లి నీహారిణి… నిత్య చైతన్యశీలి. తెలుగు భాషాభిమానంతో, సాహి త్యా భినివేశంతో రచనలు ప్రారం భించి ఇప్పటి వరకు పద్నాలుగు పుస్తకాలు రచించారు. అటు కుటుంబాన్నీ, ఇటు సాహిత్యాన్నీ, సమన్వయం పరచుకుంటూ కవయిత్రిగా, రచయిత్రిగా, విమర్శకురాలిగా, సంపాదకురాలిగా, వక్తగా వైవిధ్యభరితమైన పాత్రల్లో తనదైన ముద్రతో సాహితీ స్థానాన్ని పదిల పరచుకొని ఎందరో మహిళలకు మార్గదర్శకురాలిగా నిలుస్తూ అపురూప పురస్కారం అందుకోబోతున్నారు.

సామాజిక సేవ
ప్రొ.సమతా రోష్ని… తల్లిదండ్రుల నిరాడంబరత, సేవాగుణం, అన్యాయాన్ని సహించనితనం, ప్రశ్నించే గుణం, కళాత్మకత, దేశవిదేశాల రచనల ఆకళింపు అన్నీ కలిసి సమతారోష్ని వ్యక్తిత్వానికి బలమైన పునాది. ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో చేరి తొమ్మిది నెలల తర్వాత హాస్టల్‌ ఫీజు కట్టలేక చదువు మానుకొని, కమ్యూనిస్టు పార్టీ సహ కారంతో మాస్కో పీపుల్స్‌ యూనివర్సిటీలో వైద్య విద్య పూర్తి చేశారు. స్వదేశానికి తిరిగి వచ్చి పలు పి.హెచ్‌.సీల్లో సేవ చేస్తూ బలమైన ముద్ర వేసి అనేక ప్రమోషన్లు పొంది సామాజిక సేవా రంగంలో పురస్కారం అందుకోబోతున్నారు.

కవిత్వం
వేవనపల్లి వీణావాణి… వృత్తిలోనూ, ప్రవృత్తిలోనూ నిబద్ధత కలిగిన కవయిత్రి, రచయిత్రి. చిన్న వయసు నుండే చదువుపట్ల ఆమెకున్న శ్రద్ధాసక్తులు, కుతూహలం మూలంగా అధ్యయనం, పరిశీలన, వాస్తవిక దృష్టికోణం దిశగా వృత్తిపరం గా, ప్రవృత్తి పరంగా ఆమె అడుగులు లోకహితార్థమై పయనించాయి. జోగు లాంబ సర్కిల్‌కు అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ పారెస్ట్‌గా, నారాయణపేట జిల్లా అటవీశాఖ అధికారిగా అదరపు బాధ్యతలు చూస్తున్నారు. కవయిత్రిగా, రచయిత్రిగా, కాలమ్‌ రైటర్‌గా, పర్యావరణ సాహిత్య కారిణిగా గుర్తింపు పొందారు.

షార్ట్‌ ఫిల్మ్స్‌
అంజనీ యలమంచిలి… కేవలం సమాజసేవే కాదు సాహిత్యమన్నా ఎంతో ప్రేమ ఈమెకు. తనకు నచ్చిన పుస్తకాలు కొని వాటిని పదిమందికి ఇచ్చి వారితో చదివించడం, అందమైన పదబంధాలతో చక్కటి పుస్తక సమీక్షలు చేయడం, వ్యాసాలు రాయడం అవి అంతర్జాల పత్రికలలో ప్రచురితం కావడం ఆమె సాహితీ ప్రియత్వానికి, కార్యదీక్షకి నిదర్శనం. స్త్రీలపై, చిన్నపిల్లలపై జరిగే దౌర్జన్యాల గురించి విన్నప్పుడల్లా ఆమె మనసు రగిలిపోయేది. అలాంటివన్నీ నిర్మూలించడానికి తానేమి చేయగలను అనే ఆలోచన నుండి ఎవీఎం క్రియేషన్స్‌ బానర్‌లో 2016 నుండి లఘుచిత్రాలు తీస్తున్నారు.

సినీ విశ్లేషణ
శివలక్ష్మి… అరవై ఏండ్ల కిందట గుంటూరు జిల్లా రేపల్లె తాలుకా భట్టిప్రోలు గ్రామంలో పుట్టారు. పీజీ చదువుతున్న రోజుల్లోనే నాటికలు, డ్రామాలు, సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌క్లబ్‌ ఉద్యమంలో వుంటూ కొన్ని రోజులు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా కూడా పని చేయడంతో అసలు సినిమా అంటే ఏమిటో ఆమెకు అర్ధమై మనం చూస్తున్న సినిమాలు మన జీవితాలకు సంబంధించినవి కావని తెలుసుకున్నారు. తర్వాత ప్రత్యామ్నాయ సినిమా పట్ల అపూరూపమైన అభిరుచి పెంచుకున్న ఈమె సినీ విశ్లేషణ విభాగంలో పురస్కారం అందుకోబోతున్నారు.

పద్య రచన
నండూరి సుందరీ నాగమణి… ఆధునిక కాలంలో వచన కవిత్వం ఎంతగా రాజ్యమేలుతున్నా వీటితో పాటు పద్య రచనలు చేస్తూ ప్రాచీన సంప్రదాయ కవిత్వాన్ని బతికిస్తున్న కవులూ ఉన్నారు. అలాంటి వారిలో హృద్యంగా పద్యం చెపుతూ, సాహితీ పూదోటలో పద్యపారిజాతాలు విరబూయిస్తోన్న కవయిత్రిగా ఉన్న ఆమె పద్య రచనలో అపురూప పురస్కారం అందుకోబోతున్నారు.

నృత్యం
గీత హజారే… ఆంగికం, ఆహార్యం, అభినయాలతో పాటూ భావ రాగతాళ యుక్తమైన సంగీతంతో కూడిన సమాహార కళ నాట్యం. అందుకే నాట్యకళ లలితకళల్లో ఓ ప్రత్యేకతని చాటుకుంది. అలాంటి నాట్యంపై మక్కువతో బాల్యంలోనే నాట్యాన్ని అభ్యసించి నేడు నాట్యాచారిణిగా తన సేవలను అందిస్తున్నారు. జాతీయ స్థాయిలో స్వర్ణపతకం, నాట్య మయూరి బిరుదు, నాట్యగురు, మల్టీ టాలెంటెడ్‌ ఉమన్‌ అవార్డులు అందుకున్నారు.

కథారచన
జి.ఎస్‌ లక్ష్మి… తన తండ్రి పిడమర్తి సుబ్బయ్యశాస్త్రి ప్రోత్సాహంతో సాహితీ ప్రస్థానం మొదలుపెట్టారు. భర్త ప్రొఫెసర్‌ గరిమెళ్ళ విశ్వనాథం చదువునీ, సంగీతాన్ని ప్రోత్సహించడంతో సోషియాలజీలో ఎమ్‌.ఎ, సంగీతంలో డిప్లొమా, కంప్యూటర్‌ కోర్సు ఎం.ఎస్‌.ఆఫీస్‌ చెయ్యగలిగారు. చక్కని సంభాషణలను కథలుగా మలచి రక్తి కట్టించడం ఈమెలోని ప్రత్యేకం. ఇప్పటి వరకు సుమారు 150 కథలు రచించిన ఆమె కథారచన విభాగంలో అపురూప పురస్కారం అందుకోబోతున్నారు.

జర్నలిజం-ఎలక్ట్రానిక్‌ మీడియా
ప్రేమమాలిని…హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, ఉన్మానియా యూనివర్సిటీ పరిధిలోని సెయింట్‌ ఆన్స్‌ కాలేజీ నుండి కామర్స్‌ డిగ్రీని అందుకున్నారు. సీనియర్‌ పాత్రికేయులు, రచయిత వనం జ్వాలానరసింహారావు కూతురిగా తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ప్రేమ ఎంతో ఇష్టంతో జర్నలిజాన్ని తన జీవన మార్గంగా ఎంచుకున్నారు. కొంతకాలం వివిధ వాణిజ్య ప్రకటనా సంస్థల్లో మీడియా అడ్వర్టయిజింగ్‌లో, జపా 4 ఎఫ్‌.ఎంలో పని చేశారు. తర్వాత టీవీ9లో అడుగుపెట్టి టీవీ ఛానల్స్‌లో కొత్తతరం జర్నలిజానికి శ్రీకారం చుట్టారు. అనంతరం టీవీ5లో చేశారు. తనకున్న అనుభవంతో మిహిర క్రియాటివ్స్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ప్రముఖులను ఇంటర్వ్యూలు చేయడంలో ఈమెకు ఈమే సాటి. జర్నలిజం బోధనా రంగంలోకి కూడా అడుగుపెట్టారు.