అమెజాన్‌ కార్మికుల ఆందోళన

అమెజాన్‌ కార్మికుల ఆందోళన– పలు డిమాండ్లతో బ్లాక్‌ ఫ్రైడే
న్యూఢిల్లీ : అమెజాన్‌ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు శుక్రవారం దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. ‘మేక్‌ అమెజాన్‌ పే’ పేరిట ప్రపంచ దేశాల్లో చేపట్టిన నిరసనల్లో భాగంగా మన దేశంలో కూడా బ్లాక్‌ ఫ్రైడే పాటించారు. యూఎన్‌ఐ గ్లోబల్‌ యూనియన్‌, ప్రోగ్రెసివ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ పిలుపు మేరకు 80 సంఘాలు, పౌర సమాజ సంస్థలు, పర్యావరణవేత్తలు ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లించాలని, సంఘాల్లో చేరే హక్కును గౌరవించాలని డిమాండ్‌ చేశారు. పన్నులు సక్రమంగా చెల్లించాలని, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కర్తవ్యాలను నెరవేర్చాలని కూడా వారు తమ ప్రచారోద్యమంలో డిమాండ్‌ చేశారు. న్యూఢిల్లీ, పాట్నా, వారణాసి, ముంబయి, కొల్‌కతా, ఔరంగాబాద్‌, రుషీకేశ్‌, ఆగ్రా, భోపాల్‌, కొల్హాపూర్‌ తదితర ప్రాంతాల్లో అమెజాన్‌ కార్మికులు నిరసన తెలిపారు. తమ మానసిన, శారీరక బాగోగులను అమెజాన్‌ సంస్థ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది దేశాల్లో యూఎన్‌ఐ గ్లోబల్‌ యూనియన్‌ చేపట్టిన సర్వే ప్రకారం… అమెజాన్‌ సంస్థ జరుపుతున్న పర్యవేక్షణ కారణంగా తమ మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటోందని యాభై శాతం మంది కార్మికులు ఫిర్యాదు చేశారు. అమెజాన్‌ గిడ్డంగిలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి మాట్లాడుతూ ‘పని ఒత్తిడి విపరీతంగా ఉంటోంది. రోజుకు పది గంటలు పని చేయాలి. ఆ సమయంలో నిలుచునే ఉండాలి. గంటకు 150 పెద్ద వస్తువుల్ని ప్రాసెస్‌ చేయాల్సి ఉంటుంది. అది మా టార్గెట్‌. ఒకవేళ గంటలో ఆ పని చేయకపోతే అధికారులు మాపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయాలని అడుగుతారు. మధ్యలో ఎలాంటి విరామాలు ఉండడం లేదు. లక్ష్యాన్ని చేరుకోకపోతే వాష్‌రూమ్‌కి కూడా వెళ్లనివ్వరు. తోటి కార్మికులతో మాటా మంతి ఉండదు. కనీసం ఫోన్‌లో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు’ అని వాపోయారు. సమాన వేతన విధానాన్ని అమలు చేయాలని, 2030 నాటికి ఉద్గమనాలను పూర్తిగా నివారించాలని, వాస్తవికతను దృష్టిలో పెట్టుకొని పనిలో లక్ష్యాలను నిర్దేశించాలని, ప్రమాదాలకు గురైతే నష్టపరిహారం అందజేయాలని, మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని అమెజాన్‌ ఇండియా కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. కార్మికులు వరుసగా నాలుగు సంవత్సరాల నుండి బ్లాక్‌ ఫ్రైడేను పాటిస్తున్నారు. అమెజాన్‌ విధానాలను నిరసిస్తూ ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ వంటి దేశాల్లో సమ్మె కూడా చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు అమెజాన్‌ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు.