అంబానీ..అంబానీ..అంబానీ

Ambani..Ambani..Ambaniఎటు చూసినా ముకేశ్‌ అంబానీ కొడుకు పెండ్లి మాటే. ఏ వార్తపత్రిక చూసినా, ఏ టీవీ ఛానెల్‌ చూసినా ప్రపంచకుబేరుల్లో ఒకడు ముకేశ్‌ అంబానీ కొడుకు పెండ్లి ముచ్చటే. అనంత్‌ అంబానీ పెండ్లి హడావిడి మూడు నెలల ముందునుంచే మొదలైనది. మొదటి ప్రీ వెడ్డింగ్‌ గుజరాత్‌లోని జాంనగర్‌లో జరిగింది. ఆహూతులందరినీ ప్రయివేటు జెట్‌ ప్లేన్ల ద్వారా పిలిపించారనీ, ప్రపంచ ప్రసిద్ద పాప్‌ గాయని రిహానా హాజరై పాట పాడిందనీ పత్రికలూ రాశాయి డబ్బు నీళ్లలా ఖర్చయిందని సమాచారం. రెండవ ప్రీ వెడ్డింగ్‌ ఇటలీలో జరిగింది. మొదటి ప్రీ వెడ్డింగ్‌కి రూ.1000 కోట్లు ఖర్చయితే, రెండవ ప్రీ వెడ్డింగ్స్‌కి రూ.3వేల కోట్లు ఖర్చయిందని సమాచారం. ఆ తరువాత ఈ నెల 12 న వివాహ మహోత్సవనానికి దేశంలోని సెలెబ్రిటీలతో పాటు ప్రపంచంలోని సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. భారతదేశ సినీ జగత్తులోని హేమమేమీలు ఆ వివాహానికి హాజరయ్యారు. పెండ్లికి ముందు హల్దీ, మెహందీ, లేడీస్‌ సంగీత్‌ అని రక రకాల ఈవెంట్లు జరిగాయి. చేతికి బోమిక లేకుండా ఖర్చయిందని అంటారు. ఈ పెళ్లే ఓ పాతికేళ్ల క్రితం జరిగి ఉంటే వార్తా పత్రికలు ఇంతింత దుబారా ఖర్చు ఎందుకని ఘాటుగా విమర్శించి ఉండేవి. కానీ ఈనాటి పత్రికలు చాలావరకు కార్పొరేట్ల చేతుల్లో ఉన్నాయి. అవి ఇలా దుబారని విమర్శించాడికి బదులుగా ఆ పెళ్లి గురించి అతి గొప్పలు చెబుతున్నాయి. అయితే ఇంత డబ్బు ఎక్కడినుండి వచ్చింది. నిజంగా కష్టపడ్డ డబ్బేనా? న్యాయంగా వ్యాపారంచేసి సంపాదించిందేనా? అంటే ఎవరు ఏమీ చెప్పరు… అయితే జనాల్లో ఓ టాక్‌ ఉంది.. ”ఆు ఏముంది.. అదంతా మన డబ్బే కదా… మొన్న పెరిగిన టెలికామ్‌ ధరలతో ఇంతకు ఇంత సంపాదించుకుంటాడు”అని.
ఈ మధ్యనే అన్ని టెలికామ్‌ సర్వీసుల ధరలు 15శాతం నుంచి 25శాతం వరకు పెరిగాయి. నిజానికి ఇది అకారణమైన పెరుగుదల. ఇప్పటికే, అధిక ధరలతో బాధ పడుతున్న ప్రజలకి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉంది. టెలికామ్‌ రేగులటరీ అథారిటీ అఫ్‌ఇండియా (ట్రారు) వాళ్లు 5జి ఇస్తున్నారు కదా, దానికి ఖర్చులు ఉంటాయి కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.5జి వాడుకలోకి వొచ్చి ఏడాది దాటింది. ఏ సర్వీస్‌ ప్రొవైడర్‌కి కూడా నష్టం వాటిల్లలేదు. ఆయినావీళ్లకి మరిన్ని లాభాలు చేకూర్చి పెట్టాడనికి ఈ టెలికామ్‌ ధరల పెరుగుదల. ఈ పెరుగుదలని బేరీజు వేస్తే, మొబైళ్లు వాడుతున్న ప్రతి ఒక్కరికి నెలకి 29 రూపాయలు పెరుగుతాయి. అంబానీ జియోని సుమారు 43 కోట్ల మంది, మిత్తల్‌ ఎయిర్‌టెల్‌ని 27 కోట్లకి పైగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఒక లెక్క జియోది చూద్దాం. 43 కోట్లమంది నెలకి రూ.1256 కోట్లు, ఏడాదికి 15072 కోట్లు చెల్లిస్తున్నారు. ఇది కేవలం ఒక సంవత్సరానికి.
ఈ మధ్యనే ప్రధాన మంత్రి మోడీ రష్యా వెళ్లిన సంగతి అందరికీ తెలుసు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మోడీని చాలా అభిమానంతో చూసి, ఆయనకు రష్యా అతి పెద్ద పౌర పురస్కారంతో సన్మానించారు. ఈపురస్కారానికి కారణం భారతదేశం రష్యా నుంచి కొన్ని మిలియన్‌ బ్యారెళ్ల ముడిచమురు కొనుగోలు చేసింది.పేరు ఇండియాదే అయినా దానివల్ల భారతదేశంలో పెట్రోలు ధరలు ఏమీ తగ్గలేదు. ఎందుకంటే ముడి చమురుని వాస్తవంగా కొన్నది ముకేశ్‌ అంబానీ రిలయన్స్‌ కంపెనీ కోసం. ఈ రిలయన్స్‌ కంపెనీయే ముడి చమురుని తమ రిఫైనరీల్లో శుద్ధి చేసి 67 బిలియన్‌ డాలర్ల పెట్రోలుని యురోపియన్‌ దేశాలకి అమ్మింది. ఈ విధంగా ప్రస్తుత ప్రభుత్వం ఇటు అంబానీకి లాభం చేకూర్చడంతో పాటు పుతిన్‌కి సాంత్వన కలిగించింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం తరువాత అమెరికాతో పాటు యురోపియన్‌ దేశాలన్నీ రష్యానుండి ముడి చమురుతో పాటు ఇతర ఇంధన వనరుల కొనుగోలుని నిషేధించాయి.ఇతర దేశాలని కూడా కొనవొద్దని హెచ్చరిక చేసాయి. ఈ నిషేధాన్ని ఉల్లఘించినందుకు అమెరికా, యురోపియన్‌ దేశాలుఏమైనా చర్య తీసుకుంటే భవిష్యత్‌లో అది భారత ప్రజలు అనుభవించాల్సి వస్తుంది. రిలయెన్స్‌ కాదు.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తి కోసం తాము వాడే బొగ్గులో 10 శాతం బొగ్గు విదేశాలనుండి తెప్పించుకోవాలని ఒక ఆదేశాన్ని జారీ చేసింది. మన వద్దే కావలిసినంత బొగ్గు, బొగ్గు గనులుండగా విదేశాలనుండి తెప్పించుకోవాల్సిన అవసరం ఏముంది? ఇదీ మళ్లీ కార్పొరేట్ల లాభం కోసమే. మారో ధన కుబేరుడు గౌతమ్‌ అదానీకి విదేశాల్లో బొగ్గు గనులున్నాయి. ఆ బొగ్గునే వాడాలని ఆదేశం. ఈ విదేశీ బొగ్గు మన దేశంలో దొరికే ధరకన్నా పదిరెట్లు ఎక్కువ. దాంతో అనివార్యంగా విద్యుత్తూ బిల్లులు పెరుగుతాయి. ప్రజలు చెల్లించిన డబ్బు అదానీకి చేరుతుంది. ఈమధ్య అయన నాసిరకం బొగ్గుని, మేలైన బొగ్గుగా అమ్మాడు అని, దానిపై ఎంక్వయిరీ నడుస్తున్నది. ఒక ఎన్నికల సభలో రాహుల్‌ గాంధీ ఈ విషయాన్నే ప్రస్తావించాడు. మరో సభలో అయన పేదలు మరింత పేదలవుతున్నారని, ధనికులు మరింత ధనికులవుతున్నారని అంటాడు. ఆమాటే మన ప్రధానమంత్రిని కొందరు విలేకరులడిగితే, ధనికులని కూడా పేదలని చేయాలా’ అని ఎదురు ప్రశ్నిసాడు. నిజానికి జరుగుతున్నది అదే. పదేళ్లకు ముందు దేశంలో 102 మంది కుబేరులంటే ప్రస్తుతానికి వారిసంఖ్య 166కి చేరింది. ఇది దేనికి సంకేతం?
2021-22 ఆక్స్‌ఫామ్‌ రిపోర్టు ప్రకారం మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేదలు, అత్యంత పేదలుగా ఉన్న 50శాతం ప్రజలు 64శాతం జీఎస్టీ కడుతున్నారు. ఎగువ మధ్యతరగతి, ధనికులు, మరింత ధనికులాగా ఉన్న 40 శాతం ప్రజలు 33శాతం జీఎస్టీ కడితే అత్యంత ధనిక వర్గానికి చెందిన పది శాతం ప్రజలు కేవలం మూడు శాతం జీఎస్టీ కడుతున్నారు. వార్షిక నికరాదాయాల్లో ఈ అసమానత కనిపిస్తుంది. ఆక్స్‌ఫాÛమ్‌ వార్షిక నికరాదాయాల రిపోర్టు కూడా ప్రచురించింది. దాని ప్రకారం బాగా ఫై లెవెల్లో ఉన్న ఒక శాతం ప్రజల నికరాదాయం సంవత్సరానికి రూ.53 లక్షలు, ఆ తరువాత లెవల్లో ఉన్న 10 శాతం ప్రజల ఆదాయం 13.56 లక్షలు, కింద ఉన్న 40 శాతం ప్రజల ఆదాయం 1.65 లక్షలు, నెలకి 13,750/- పూర్తిగా దిగువ ఉన్న 50 శాతం ప్రజల ఆదాయం 71,163 అంటే నెలకి 6 వేలతో ఈ 50 శాతం ప్రజలు జీవనం గడుపుతున్నారు. ఇవన్నీ ఆక్స్‌ఫామ్‌ ఇచ్చిన లెక్కలే. పెరుగుతున్న ధరలతో పోల్చితే ఈ 6 వేలు కాని, 13,500 కానీ సముద్రంలో కాకి రెట్టలాంటిదే.
– పి.జయప్రకాష్‌, 8374851426