ఎనిమిది మంది భారతీయుల్ని కలిసిన రాయబారి

న్యూఢిల్లీ : గూఢచర్యం ఆరోపణలతో ఖతార్‌ కోర్టు మరణశిక్ష విధించిన భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులను దేశ రాయబారి కలిసారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 3న ఖతార్‌లోని భారత రాయబారి కలిసినట్లు తెలిపారు. ఖతార్‌ కోర్టు విధించిన మరణశిక్ష తీర్పును సవాలు చేస్తూ ఖతార్‌ కోర్టులో భారత ప్రభుత్వం అప్పీల్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఈ కేసులో ఇప్పటివరకు రెండుసార్లు విచారణ జరిగింది. మేం ఈ అంశాన్ని నిశితంగా గమనిస్తున్నాం. ఇది చాలా సున్నితమైన అంశం. వారికి న్యాయపరమైన, దౌత్యపరమైన సహకారం కొనసాగుతుంది. డిసెంబర్‌ మూడున మన రాయబారి వారిని కలిశారు’ అని బాగ్చి వెల్లడించారు. అలాగే, డిసెంబర్‌ 13లోగా భారత పార్లమెంట్‌పై దాడి చేస్తామని ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నాయకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ చేసిన బెదిరింపులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ‘ఆ బెదిరింపులను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వ్యవహారాన్ని అమెరికా, కెనడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. తీవ్రవాదులు, ఉగ్రవాదులు మీడియా కవరేజీని కోరుకుంటారు. అలాంటి బెదిరింపులను తీవ్రంగా ఖండిస్తున్నాం. వీటిపై భారత దర్యాప్తు సంస్థలు తగిన చర్యలు తీసుకుంటాయి’ అని బాగ్చి అన్నారు.