అంబేద్కర్‌ అంబేద్కర్‌ అంబేద్కర్‌

కూల దోస్తే కూలిపోయే.
విగ్రహం కాదు ఆ పేరు
పగలగొడితే విరిగిపోయే
బొమ్మ కాదు ఆ పేరు

భయంభయంగా
తుడిచేసినా తడిపేసినా
నోరు నెత్తిన పెట్టుకొని
మాయం చేసినా సరే!

మీ గుండెల్లో కళ్ళు తెరిచి చూస్తున్న
‘టోర్నాడో’ ఆ పేరు !!

కులం ఉచ్చ కంపు మెడను వంచి
మతం మలం కంపు ముడ్డి మీద తన్ని
అంటరానితనం గుండెల్లో
ఆత్మగౌరవోదయం నాటిన పేరది

నిచ్చెనమెట్లకు వేలాడుతున్న ఉరితాడుకు
చండాలుని తప్పించి
మనవును వేలాడదీసిన పేరది

కరిగించి పెట్టుకున్న సీసం డబ్బాలు
నూరి పెట్టుకున్న నాలుకలు
కోసే కత్తులు
కట్టి పెట్టుకున్న ముడ్డిక్కట్టే చీపిర్లు
చేసి పెట్టుకున్న మూతి కట్టే ముంతలు
మీ మాటల్లో మీ చేతల్లో
మీ అడుగుల్లో మీ ఆలోచనల్లో
తలుక్కున మెరవడం
మాక్కనిపిస్తూనే ఉంది
అక్షరానికి బలి ఇచ్చిన
ఇంద్ర కుమార్‌ మేగ్వాల్‌
ఏడుపు వినిపిస్తూనే ఉంది

నువ్వు గాయం చేసినప్పుడల్లా
మా మందుపట్టి ఆ పేరే!

దళిత గోవిందం మిత్రులారా!
మీ దేవుళ్ళ స్వర్గాలను మీ కొదిలి
సబ్బండ వర్ణాల నేల మీది స్వర్గాలకు
నడవాల్సిన దారి
చూపిన చూపుడువేలు ఆ పేరు

మీకు చూపానది గాని
నాలుగు బాటల మీద నిలబడ్డది
ఆరడుగుల విగ్రహం కాదు
మా గుండెల్లో నిద్రిస్తున్న సునామీ!

– వడ్డెబోయిన శ్రీనివాస్‌, 9885756071